కళ్లకింద వలయాలను వెళ్లగొడదాం...
బ్యూటిప్స్
కొందరికి పనివత్తిడివల్ల లేదా ఇతర కారణాల వల్ల కళ్లకింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. అందవికారంగా అనిపించడమే కాకుండా అనారోగ్యాన్ని కూడా సూచిస్తాయి. అలాంటప్పుడు కళ్లచుట్టూ స్వచ్ఛమైన ఆల్మండ్ ఆయిల్ అప్లై చేసి తేలిగ్గా మసాజ్ చేయాలి. ఇందుకు ఉంగరం వేలిని ఉపయోగిస్తూ ఒక్కో కంటికి ఒక్కో నిమిషం చొప్పున చేసి పదిహేను నిమిషాల తర్వాత తడిదూదితో తుడిచేయాలి. ఇలా కొన్నిరోజులపాటు చేయాలి. కీరా రసం, బంగాళదుంప రసం సమపాళ్లలో తీసుకుని కళ్లకింద రాసి 20 నిమిషాలు ఆగి నీటితో కడిగేయాలి.
బయటకు వెళ్లేముందు ఒకచుక్క నీటిని అద్ది సన్‌స్క్రీన్‌ను కళ్లకింద అప్లై చేయడం వల్ల కళ్లకింద వలయాలు ఏర్పడకుండా ఉంటాయి.
కొందరికి కళ్లకింద సంచుల్లా ఉబ్బెత్తుగా ఉంటుంది. అలాంటివారు వాడేసిన టీ బ్యాగ్స్‌ను ఫ్రిజ్‌లో పెట్టి తీసి, వాటితో కళ్లమీద కాచినట్లు చేయాలి. అలా చేస్తుంటే తొందరలోనే తగ్గిపోతాయి.