
బస్తర్ మే సవాల్
అందరికీ తెలిసి, ఎవరికీ తెలియని మనిషి బేలా భాటియా! ఆమె ఒక పోరాట యోధురాలు. అయితే ‘పోరాట యోధురాలు’ అన్న మాట ఒక్కటే ఆమె శక్తికి, వ్యక్తిత్వానికి పరిపూర్ణమైన నిర్వచనం కాబోదు. పరిశోధకురాలు అనొచ్చా? అదీ అసంపూర్ణమే!పోనీ విద్యావేత్త? వెరీ కామన్. బేలాకు మనం ఎన్ని విశేషణాలు తగిలించినా, ఆమె విలక్షణతకు దీటుగా అవేవీ నిలబడలేవు! మరి ఆమెను ఏమనొచ్చు? ‘మనిషి’.. అనాలి.
ప్రభుత్వం మాట తప్పినప్పుడు మనిషి ఎలా ఉండాలి? బేలాలా ఉండాలి. చీకటి అకృత్యాలకు చూస్తూ వ్యవస్థ కళ్లు మూసుకున్నప్పుడు మనిషి ఏంచెయ్యాలి? బేలాలా ధైర్యంగా ఆ చీకట్లోకి ఫ్లడ్‌లైట్‌ని ఫోకస్ చెయ్యాలి. బేలాలా ఉండడం అంటే.. మనిషిలా ఉండడం. మనుషుల కోసం పోరాటం చెయ్యడం!
వట్టి చేతులతో గట్టి ఫైట్
పదేళ్లుగా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో ఉంటున్నారు బేలా. ఈ ఫ్రంట్ లైన్ యాక్టివిస్ట్ బ్యాగ్రౌండ్ ఏమిటో ఎవరికీ తెలియదు. ఆమె తెలియనివ్వలేదు. ఫ్రంట్ లైన్ యాక్టివిజం అంటే మనిషి ప్రాథమిక హక్కుల కోసం పోరాడటం. పాలిటిక్స్‌లో లేకుండా, నక్సలిజంలో లేకుండా మానవహక్కుల కోసం పోరాడడం సాధ్యమేనా? ఇలాంటి బ్యాగ్రౌండ్‌లు కూడా అక్కర్లేదనుకున్నారు బేలా. వట్టి చేతుల్తో చెట్టును గట్టిగా కావలించుకుని కాపాడుకోవాలని ప్రయత్నించినట్టు, ఆ చెట్టూ చేమల మధ్య నివసించే ఆదివాసీలను ఆత్మీయంగా హత్తుకుని, వాళ్లతో కలసిపోయి అడవిలోపలి దోపిడీలను, దౌర్జన్యాలను, దగాలను, దుర్మార్గాలను.. ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారు. ప్రభుత్వమే తప్పు చేస్తే ప్రజల దృష్టికి తెస్తున్నారు.
ఆమె ఉద్యమమే ఆమె జీవితం!
గతవారం బస్తర్‌లో బేలా భాటియా ఇంటిపై దుండగులు దాడి చేసి బెదిరించిన నాటి నుంచి దేశంలో ఎక్కడో ఒకచోట ఆమెకు సంఘీభావం తెలుపుతూ సదస్సులు, సమావేశాలు, సెమినార్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా బేలా బయోగ్రఫీని పాఠకులకు అందించాలనుకున్న సాక్షి ‘ఫ్యామిలీ’కి.. తన వ్యక్తిగత వివరాలకు సంబంధించి మొదటి నుంచీ ఆమె పాటిస్తూ వస్తున్న గోప్యనీయత
ప్రధాన అడ్డంకి అయింది.
ఆమెను కలిసి, ఆమెతో మాట్లాడి, ఆమెతో సైద్ధాంతిక భావాలను పంచుకుని, ఆమె అడుగులో అడుగు వేసుకుంటూ అడవిలోపల, అడవి బయట తిరిగిన ఆమె తెలుగు స్నేహితులను కూడా ‘ఫ్యామిలీ’ సంప్రదించింది. అంతా.. ‘ఆమె ఉద్యమమే ఆమె బయోగ్రఫీ’ అని చెప్పారే తప్ప అంతకు మించి ఏమీ చెప్పలేకపోయారు! ‘హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్’లో బేలాకు సన్నిహితంగా ఉండే ఒక సీనియర్ కార్యకర్త ఫోన్‌లో అప్పటికప్పుడు ఆమెతో మాట్లాడగలిగారు కానీ, ఒక్క ముక్క రాబట్టలేకపోయారు! అందుకే బేలా భాటియాను.. ‘అందరికీ తెలిసి, ఎవరికీ తెలియని మనిషి’ అనడం.
పేరు కూడా మార్చుకున్నారు!
అడవుల్లో జరిగేది అడవి బయటకు తెలీదు. అడవిలో ఉండి, చూసి, విని, బయటికి వచ్చి చెప్పేవాళ్లు ఎవరైనా ఉండాలి. ఆ చెప్పే వాళ్లు అడవి బయటకు, అడవి లోపలికి తిరుగుతుండాలి. అలా తిరుగుతుండే మనిషి బేలా. అయితే బేలా భాటియా ఒక చోట ఉండరు. దేశం అంతా ఆమెదే. దేశంలోని అడవులకు, ఆదివాసీలకు ఆమె దగ్గరగా ఉంటారు. ఎంత దగ్గరితనం అంటే తన పేరులోని భాటియాను తీసేసి, ఆ స్థానంలో ‘సోమారి’ అనే ఆదివాసీ పేరు పెట్టుకున్నారు బేలా’. ఏడాదిగా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా ప్రధాన కేంద్రం జగ్దల్‌పూర్‌కు దగ్గరగా ఉన్న పండ్రిపాణి గ్రామంలో ఉంటున్నారు.ఆమె అక్కడ ఉండటం స్థానిక అధికారులకు ఇష్టం లేదు. స్థానిక నాయకులకు ఇష్టం లేదు. ఆ.. ‘హక్కుల మనిషి’ వాళ్లకో చికాకు అయింది. ఆ.. ‘లా పాయింట్ల మనిషి’ వాళ్లకో తలనొప్పి అయింది. ఎలా వదిలించుకోవడం?
‘పెంపుడు కుక్కను చంపేస్తాం’
ఆరోజు ఇంట్లోనే ఉన్నారు బేలా. ముందొక వాహనం వచ్చి ఆమె ఇంటి ముందు ఆగింది. అందులోంచి కొంతమంది కిందికి దిగారు. ఆ వెనుకే కొన్ని మోటర్‌సైకిళ్లు వచ్చాయి. వాటి మీద నుంచి కొందరు దిగారు. సుమారుగా 30 మంది. ఇంట్లోకి తోసుకొచ్చారు. బేలాను బెదిరించారు. ‘24 గంటల్లో నువ్వు బస్తర్ వదలి వెళ్లిపోవాలి’ అని వార్నింగ్ ఇచ్చారు. ‘వెళ్లకపోతే నీ ఇంటిని నిప్పు పెడతాం. నీ పెంపుడు కుక్కను చంపేస్తాం’ అని బెదిరించారు. ఇంటి ఓనర్ దగ్గరికి కూడా వెళ్లి, ‘ఈ దెయ్యాన్ని వెంటనే ఇల్లు ఖాళీ చేయించకపోతే ఏం జరుగుతుందో చెప్పం. చేసి చూపిస్తాం’ అని, చూపుడు వేలు చూపించి వెళ్లిపోయారు. గ్రామ సర్పంచి ఇదంతా చూస్తూ ఊరుకున్నాడు. బేలా బస్తర్ జిల్లా కలెక్టర్ అమిత్ కటారియాకు ఫోన్ చేసిన గంటన్నర తర్వాత మాత్రమే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
బేలాపై మావోయిస్టు ముద్ర
వాళ్లెందుకు తనను ఖాళీ చేయించాలనుకుంటున్నారో బేలాకు తెలుసు. జనవరి 7న జాతీయ మానవ హక్కుల సంఘం నుంచి అధికారులు కొందరు బస్తర్ వచ్చారు. అక్టోబర్ 2015–మార్చి 2016 మధ్య బస్తర్‌లో 16 మంది ఆదివాసీ మహిళలపై ఛత్తీస్‌గఢ్ భద్రతా సిబ్బంది జరిపిన అత్యాచారాలపై విచారణ జరపడానికి వచ్చారు. వాళ్లను తెప్పించింది, వాళ్లకు అవసరమైన వివరాలను అందించిందీ బేలా భాటియానే.
బెదిరింపులు బేలాకు కొత్త కాదు. 2015 నవంబరులో కూడా.. అత్యాచార బాధితురాలైన ఆదివాసీ మహిళలకు అండగా నిలబడి నిందితులైన పోలీసులపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయించినందుకు బస్తర్ పోలీస్ యంత్రాంగం ఆమెపై పగబట్టింది. సంఘవ్యతిరేక శక్తిగా ఆమెను చిత్రీకరించి, గ్రామస్తులలో ఆమె పట్ల వ్యతిరేక భావన కలిగించడానికి దుష్ప్రచారం చేయించింది. వాటన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు బేలా. ఇప్పుడు కూడా ఆమె పోరాటం తన కోసం కాదు, ‘తన’అనుకున్న ఆదివాసీల కోసం.
నిర్విరామ ఉద్యమకారిణి
బేలా భాటియా.. ఆదివాసీల కనీస హక్కుల కోసం, వారికి జరగవలసిన కనీస న్యాయం కోసం పోరాడుతున్న నిర్విరామ ఉద్యమ నాయిక. ఆదివాసీల తరఫున ఆమె పోరాడుతున్నట్లే.. ఆమె తరఫున హక్కుల సంఘాలు గళమెత్తబట్టి.. మొన్నటి బెదిరింపుల సంఘటన తర్వాత ఛత్తీస్‌గఢ్ సీఎం స్వయంగా జగదల్‌పూర్ వచ్చి ఆమెను కలిశారు. భద్రతకు భరోసా ఇచ్చారు. అప్పుడు కూడా సీఎం రమణ్‌సింగ్‌ని ఆమె ఆదివాసీల భద్రత గురించి మాత్రమే అడిగారు. ఆ సమయంలో ఆమె భర్త జీన్ డ్రీజ్ కూడా అక్కడే ఉన్నారు.
భార్యపై పగ.. భర్తపై ప్రతీకారం
జీన్ డ్రీజ్ బెల్జియంలో పుట్టిన భారతీయుడు. భారత్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఆర్థికవేత్త! మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆహార‡ భద్రత.. ఈ రెండింటి రూపకల్పనలో, పర్యవేక్షణలో డ్రీజ్ భాగస్వామ్యం ఉంది. బేలా అంటే పడనివారు ఆమెతో పాటు డ్రీజ్ ను కూడా టార్గెట్ చేస్తుంటారు. అతడిని ‘ఫారిన్ ఏజెంటు’గా చిత్రీకరించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంటారు. ఢిల్లీలోని ఒక మురికివాడలో ఒకే ఒక చిన్న గదిలో అతి నిరాడంబరంగా జీవించే బేలా, జీన్ దంపతులు... సామాజిక జీవన స్థితిగతుల పరిశోధన, మానవ హక్కుల పరిరక్షణలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో నిత్యం పర్యటిస్తూనే ఉంటారు. కొన్నిసార్లు కలిసి. కొన్నిసార్లు విడివిడిగా.
స్త్రీ దేహంపై ప్రభావం!
2015లో బీజాపూర్‌లోని రెండు గ్రామలలో జరిగిన మూకుమ్మడి అత్యాచారాలను, 2016 సుక్మా జిల్లాలో జరిగిన లైంగిక హింస ఘటనలను వెలుగులోకి తెచ్చినందుకు బేలాపై మావోయిస్టు అన్న ముద్ర వేశారు. అత్యాచారాలు జరిగిన ఈ గ్రామాలు నక్సలైట్‌ల కదలికలు ఉన్న గ్రామాలు. అంతమాత్రాన బాధితులు మావోయిస్టులు అవుతారా? ‘‘విచారణ పేరుతో లైంగిక దోపిడీకి పాల్పడతారా? బైట ఏదైనా జరగనివ్వండి, అది స్త్రీ దేహంపై ప్రభావం చూపకూడదు. ఏ పేరుతో , ఏ కారణంతో జరిగినా.. అత్యాచారం, లైంగిక హింస అన్నవి కచ్చితంగా నేరాలు. పోలీసులు, భద్రత అధికారులు.. ప్రజల మాన ప్రాణాలకు రక్షణగా ఉండాలి కానీ, భక్షించకూడదు’’ అంటారు బేలా భాటియా.
ఆకులో ఆకు.. కొమ్మలో కొమ్మ
మిమ్మల్ని ఎవరైనా నక్సలైట్ అంటే మీరు నక్సలైట్ అయిపోతారా? మిమ్మల్ని మీరున్న చోటు నుండి ఖాళీ చేసి వెళ్లిపొమ్మంటే వెళ్లిపోతారా? బేలాను కూడా ఇలాగే అన్నారు. ఎందుకలా అన్నారంటే.. ఆమె ఒక సామాజిక అధ్యయనవేత్త. స్వతంత్ర కార్యకర్త. మూడు దశాబ్దాలపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లో పనిచేశారు. ఆయా ప్రాంతాలలోని దళితుల, ఆదివాసీల, ఇతర వెనుకబడిన వర్గాల జీవన స్థితిగతులపై అవగాహన కల్పించుకునే ప్రయత్నం చేశారు. వారి సంక్షేమానికి ప్రభుత్వాలు చేస్తున్నవాటిని, చెయ్యలేకపోయిన వాటిని గమనించారు. ఉద్యమాలు ఎలా తలెత్తిందీ, ఆ ఉద్యమాలను నీరుగార్చే ప్రయత్నాలు ఎలా జరిగిందీ చూశారు. తన అనుభవాల్లోంచి మన ప్రజాస్వామ్య వ్యవస్థ స్వరూపాన్ని వీక్షించగలిగారు.
నక్సలిజంపై పీహెచ్‌డీ
‘నక్సలైట్ మూవ్‌మెంట్ ఇన్ సెంట్రల్ బిహార్’ అనే అంశం మీద బేలా పీహెచ్‌డీ చేశారు. ఎందుకని ఒక ప్రజాస్వామ్య దేశంలోని పౌరులు కొందరు తుపాకీ చేతపట్టవలసి వస్తోందన్నది అర్థం చేసుకోడానికి ఆమె ఈ అంశాన్ని తన పీహెచ్‌డీకి ఎంపిక చేసుకున్నారు. ప్రభుత్వాలు ఎప్పుడూ మూలాలను చూడవు. అవి సమస్యను çపరిష్కరించవలసింది పోయి, మరింత సంక్లిష్టం చేస్తాయని ఆమెకు అర్థమైంది. ఢిల్లీలోని స్టడీ ఆఫ్ డెవలప్‌మెంట్ సొసైటీస్ సెంటర్ కోసం పనిచేయడం అన్నది కూడా తెలంగాణ నక్సల్స్ ఉద్యమం, బస్తర్ సల్వాజుడుం శాంతి యాత్రను వివరంగా అర్థం చేసుకోడానికి ఆమెకెంతో ఉపయోగపడింది.
సల్వా ‘జులుం’
బస్తర్‌లో ప్రభుత్వం వెనుక ఉండి నడిపించిన ‘సల్వా జుడుం’ ఆపరేషన్ లో గ్రామీణులపై జరిగిన ఎన్నో అకృత్యాలను బేలా కళ్లారా చూశారు. స్థానిక యువకులతో ప్రభుత్వం చేయించిన ఆ ఆపరేషన్‌లో వేల ఇళ్లు దహనం అయ్యాయి. వందలాది మంది గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. భార్యలపై, కూతుళ్లపై అత్యాచారాలు జరిగాయి. లక్షల మంది ఆదివాసీలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని వలసపోవలసి వచ్చింది. వాళ్ల కోసం ఏదైనా చెయ్యాల్సిన అవసరం ఏర్పడిన సందర్భం అది. అందుకే ఒక పరిశోధకురాలిగా వారి హక్కుల కోసం బేలా పోరాట పథంలోకి వచ్చారు. బస్తర్‌లోని ఆదివాసీలతో కలసి పనిచేయడం మొదలుపెట్టారు.
టీమ్ మెంబర్
ప్లానింగ్ కమిషన్ నెలకొల్పిన 11వ పంచవర్ష ప్రణాళిక నిపుణుల బృందంలో బేలా సభ్యురాలు. రైతుల ఇక్కట్లు తెలుసుకుని వాటిని పరిష్కరించే విధానాల రూపకల్పనకు ఉద్దేశించిన బృందం వారిది. డాక్టర్ బంధ్యోపాధ్యాయ్, బి.డి.శర్మ, దిలీప్‌సింగ్ బ్రురియా, ఎస్.ఆర్.శంకరన్, కె.బి.సక్సేనా, కె.బాలగోపాల్, ఇ.ఎ.ఎస్.శర్మ, ప్రకాశ్‌సింగ్, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. వీళ్లంతా ఆ బృందంలో సభ్యులు. పౌరుల కనీస హక్కుల పరిరక్షణ జరిగినప్పుడు మాత్రమే దేశం సురక్షితంగా, భద్రంగా ఉంటుందని బేలా తన రిపోర్ట్‌లో రాశారు.