
ఈలోకంలో పుట్టిన ప్రతిబిడ్డా మొదట తల్లిపాలనే తాగుతుంది. మొదటి పాల చుక్క నుంచి మొదలుకొని... బిడ్డకు జీవితాంతం ఆరోగ్యాన్ని పంచాలంటే తల్లి కూడా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అప్పుడే అటు తల్లీ, ఇటు బిడ్డా నూరేళ్లపాటు హెల్దీగా ఉంటారు. తల్లికి అలాంటి డైట్ ప్లాన్ ఏమిటో తెలుసుకుందాం.
మన సమాజంలో బాలింతకు ఎన్నో ఆహారపరంగా ఎన్నో ఆంక్షలు. చాలా పథ్యాలు పాటించాలంటూ ఇళ్లలోని పెద్దలు కొందరు కొత్తగా తల్లి అయిన ఆమెను కట్టడి చేస్తుంటారు. అందుకే పథ్యం భోజనం అంటూ చప్పిడి మెతుకులు పెడతారు. కొన్ని కూరలు జలుబు చేస్తాయంటూ పచ్చడి మెతుకులూ పెడుతుంటారు.
ఆకుకూరల్లో ఏ బీరకాయ, దొండకాయ కూరలో ఇస్తుంటారు. తల్లి కొన్ని రకాల పదార్థాలు తినడం వల్ల బిడ్డకు సమస్య అవుతుందంటూ ఎన్నెన్నో ఆంక్షలు విధిస్తుంటారు. కాని పాలిచ్చే ప్రతి తల్లికి పోషకాహారం ఉంటేనే పాలు బిడ్డకు సరిపడేటన్ని వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చనుబాలు ఇచ్చే తల్లి అన్ని రకాల పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడం అవసరం. అందుకోసం ఆమె డైట్‌ప్లాన్ ఇలా ఉంటే మేలు...
డెయిలీ తల్లి తీసుకోవాల్సిన ఆహారం ఇలా...
♦ ఉదయం 8 గంటలకు అల్ఫాహారంగా: పాలు 250 ఎం.ఎల్ + పండు + 2 ఇడ్లీలు సాంబార్‌తో లేదా చపాతీ పప్పుకూర + ఉడికించిన రెండు గుడ్లు
♦ ఉదయం 11 గం.లకు: గుప్పెడు నట్స్, డ్రై ఫ్రూట్స్ ఉదా: 3 బాదంపప్పులు + 3 అంజీర్లు +3 వాల్‌నట్స్ + 10 ఎండు ద్రాక్ష + 1 గ్లాస్ జ్యూస్ లేదా కొబ్బరినీళ్లు లేదా బటర్‌మిల్క్
♦ లంచ్ 1 గం.కు: దంపుడు బియ్యపు అన్నం 2 కప్పులు + పప్పు లేదా మాంసం + కూరగాయలతో కూర + మజ్జిగ + అరకప్పుడు ఉడికించిన కూరగాయల సలాడ్.
♦ సాయంకాలం శ్నాక్స్ 4 గం.కు: అటుకులు–బెల్లం, పచ్చికొబ్బరి, పాలు లేదా కొత్తిమీర చట్నీతో మినప గారెలు లేదా ఆకుకూరతో రాగి రొట్టె.
♦ సాయంకాలం 6 గం.కు: ఏదైనా పండు
♦ రాత్రిభోజనం 6 గం.కు: మధ్యాహ్న భోజనం లాగానే తీసుకోవచ్చు. నాలుగు మీడియం సైజు రొట్టెలు లేదా 2 రోటీలు కప్పు అన్నం.
♦ పడుకునేముందు 10 గం.కు: గ్లాస్ పాలు
ప్రొటీన్లు, పిండిపదార్థాలు, కొవ్వు, క్యాల్షియం, ఐరన్, బి అండ్ సి విటమిన్, పీచుపదార్థాలు పాలిచ్చే తల్లి తీసుకునే ఆహారంలో తప్పకుండా ఉండాలి. వేపుడు పదార్థాలతో అజీర్తి, కడుపునొప్పి రావచ్చు. ఇక నిల్వ ఉండేవీ, ఫుడ్ కలర్లు వేసిన పదార్థాల వల్ల... ఆమె చనుబాలు తాగిన బిడ్డకు ఆరోగ్యసమస్యలు వస్తాయి.
చాలామంది వెల్లుల్లి, బెల్లం.. వంటివి తింటే తల్లికి పాలు బాగా పడతాయని అనుకుంటారు. కాని దీనికి ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. తల్లికి పాలు బాగా పడాలంటే తల్లి సమతులాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. పాలు ఇచ్చిన తర్వాత తల్లికి బాగా ఆకలిగా అనిపిస్తే తాజా పండ్లు లేదా నట్స్ లేదా కప్పు తీసుకోవడం వల్ల శక్తి వస్తుంది. టైమ్‌కు ఆహారం తీసుకోవడం అవసరం. దానితో పిల్లలకు సరిపడ ఆహారం లభించడంతో పాటు... తల్లిలోనూ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment