పీచుపదార్థాల గొప్పదనం గ్రహించండి!
కొత్త పరిశోధన
కేవలం మన ఆహారపు అలవాట్లలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకొని, రోజూ కనీసం 30 గ్రాముల పీచు మన శరీరానికి అందేలా చేస్తే అది అద్భుతం (మిరకిల్)తో సమానమని అంటున్నారు అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కు సంబంధించిన వైద్య నిపుణులు. వీరు కొంతమంది టైప్-2 డయాబెటిస్ ఉన్న రోగులను ఎంపిక చేసి, వారికి ప్రతిరోజూ 30 గ్రాముల పీచుపదార్థాలు అందేలా ఆహార ప్రణాళికను అమలు చేశారు. దాంతోపాటు ఉప్పు, ఆల్కహాల్, చక్కెర పదార్థాలు వాళ్ల ఆహారంలో లేకుండా డైట్‌ప్లాన్ సిద్ధం చేశారు.
ఈ 30 గ్రాముల పీచు శరీరానికి అందడం కోసం తాజా కూరగాయలు, ఆకుపచ్చటి రంగు ఆకుకూరలు, తాజా పండ్లు, పొట్టుతో ఉన్న ధాన్యాలు ఎక్కువగానూ కొవ్వు తక్కువగా ఉండే ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలను తగిన మోతాదుల్లోనూ అందించారు. ఏడాది తర్వాత పరిశీలిస్తే కేవలం ఏడాది వ్యవధిలోనే రెండు నుంచి మూడు కిలోల బరువు తగ్గడంతో పాటు వారిలో రక్తపోటు, చక్కెరపాళ్లు అదుపులో ఉన్నట్లు తెలుసుకున్నారు. ఈ పరిశోధన ఫలితాలను ‘యానల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్’ అనే మెడికల్ జర్నల్‌లో సైతం పొందుపరచారు.