జర... జాగ్రత్త సుమా!
అధ్యయనం
కొంతమంది పిల్లలు హింసతో కూడుకున్న ఆటలంటేనే బాగా ఇష్టపడతారు. ‘వీడియో గేమ్సే కదా’ అని మనం తేలికగా తీసుకోవడానికి లేదు. ఈ ఆటల ప్రభావం వారి మనస్తత్వంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందంటున్నారు పరిశోధకులు.
‘‘గణితం నేర్చుకునేటప్పుడు, సంగీతం నేర్చుకునేటప్పుడు తెలియకుండానే దాని ప్రభావం మన మీద ఉన్నట్లే హింసాత్మకమైన వీడియో గేమ్స్‌ను పదే పదే చూడడం వల్ల దాని ప్రభావం కూడా అనివార్యంగా ఉంటుంది. ఒక అంశాన్ని పదే పదే సాధన చేసినప్పుడు, దానికి సంబంధించిన జ్ఞానం మెదడులో నిక్షిప్తమై పోతుంది’’ అంటున్నారు లోవా యూనివర్శిటీ(ఇంగ్లండ్)కి చెందిన సైకాలజీ ప్రొఫెసర్ డగ్లస్ జెంటిల్.
హింసాత్మక ఆటలు ఆడుతున్నప్పుడు... అనుకూల భావనల స్థానంలో ప్రతికూల భావనలు పెరుగుతూ పోతాయి. సహనం తగ్గుతూ పోయి అసహనం మనసులో పెద్ద పీట వేసుకుంటుంది. తగాదాలలో తలదూర్చడం ఎక్కువ అవుతుంది అని కూడా హెచ్చరిస్తున్నారు డగ్లస్.
అధ్యయనం కోసం నాలుగు, అయిదు, ఎనిమిది, తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న మొత్తం 3,000 మంది పిల్లలను ఎంచుకుంది డగ్లస్ నేతృత్వంలోని పరిశోధక బృందం. పిల్లలు ఎంచుకున్న వీడియో గేమ్స్‌లో హింస పాలు ఎంత? వారి ప్రవర్తనలో వచ్చిన మార్పులేమిటి అనే కోణంలో మూడు సంవత్సరాల పాటు అధ్యయనం చేశారు.