సుబ్బారావు, సుమిత్రలకు ఆనంద్, అంజలి పిల్లలు. ఆనంద్ చిన్నప్పటి నుంచీ బాగా చదువుకునేవాడు. కానీ అంజలి ఎంత చదివినా మార్కులు వచ్చేవి కావు. దాంతో పేరెంట్స్ ఆమె గురించి ఆందోళన పడుతుండేవారు. బెటర్ స్కూల్, బెటర్ మెటీరియల్స్, బెస్ట్ ట్యూషన్ ్స పెట్టించినా ఫలితం లేకపోయింది. పదో తరగతి ఎలాగోలా గట్టెక్కింది. లక్షల ఫీజు కట్టి హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్ కాలేజీలో చేర్పించారు.
మొదటిసారి పేరెంట్స్‌కి, ఊరికి దూరంగా హాస్టల్లో ఉండటం వల్ల దిగులుగా ఉండేది. దానికి తోడు మార్కులు సరిగా రాకపోవడంతో క్లాసులో అందరిముందూ అవమానంగా మాట్లాడేవారు. దాంతో మరింత కుంగిపోయింది. ఈ మధ్యకాలంలో పేరెంట్స్ ఫోన్ చేస్తే.. ఇంటికి వచ్చేస్తానంటూ ఏడుస్తోంది. ఎలాగోలా రెండేళ్లు సర్దుకోమ్మా అని ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. ఏం చేయాలో అర్థంకాక, లెక్చరర్ సలహా మేరకు కౌన్సెలింగ్‌కి తీసుకువచ్చారు.
అంజలితో మాట్లాడుతున్నప్పుడు చాలా చురుకైన పిల్ల అని అర్థమైంది. బాగా బొమ్మలు వేస్తుంది, పాటలు పాడుతుంది, నాట్యం చేస్తుంది. మార్కులు మాత్రం రావు. దాంతో ‘పనికిమాలిన కళలన్నీ బానే ఉన్నాయి, చదువు మాత్రం రాదు’ అంటూ విమర్శలు. ‘నేను అందరికంటే ఎక్కువసేపు చదువుతా సర్, అయినా గుర్తుండవు. ఏం చేయాలో అర్థం కావడంలేదు’ అని బాధపడుతూ చెప్పింది అంజలి. తెలివితేటలున్నా వాటిని మార్కులుగా మార్చుకునేందుకు అవసరమైన స్టడీస్కిల్స్ లేకపోవడమే ఆమె సమస్యని అర్థమైంది.
స్టడీస్కిల్స్ లేకపోతే కష్టం, నష్టం..
స్టడీస్కిల్స్ లేని విద్యార్థులు ఏకాగ్రతతో వినలేరు, చదవలేరు. చదివినా గుర్తుండదు. దాంతో వాయిదా వేస్తుంటారు. సిలబస్ పేరుకుపోతుంది. ఫలితంగా పరీక్షల ముందు ఒత్తిడి పెరుగుతుంది. పరీక్షలంటే భయం ఏర్పడుతుంది. భయం, ఆందోళన, ఒత్తిడి కలగలిసి పెర్ఫార్మెన్స్ ని దెబ్బతీస్తాయి. మార్కులు తక్కువ వస్తాయి. దాంతో ‘ఎంత చదివినా ఇంతే, నా మొహానికి మార్కులు రావు’ అనే భావన స్థిరపడిపోతుంది. ఆ నెగెటివ్ సైకిల్‌లో పడ్డారంటే నిరాశ, నిస్పృహలతో చదువు అటకెక్కుతుంది.
విజయానికి పునాది
అకడమిక్స్‌లో విజయం సాధించాలంటే స్టడీస్కిల్స్ పునాదిగా పనిచేస్తాయి. క్లాసులో చెప్పింది శ్రద్ధగా వినడం, అర్థం చేసుకోవడం, నోట్స్ రాసుకోవడం, చదవడం, గుర్తు చేసుకోవడం.. ఇవన్నీ స్టడీస్కిల్స్ కిందకు వస్తాయి. ఇవి సహజంగా వస్తాయని, ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదని చాలామంది పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ భావిస్తుంటారు. కానీ ఇవన్నీ ‘స్కిల్స్’.. అంటే ప్రయత్నంతో నేర్చుకోవాల్సినవని గుర్తించాలి.
స్కిల్స్ కూడా నేర్చుకోవచ్చు..
స్టడీస్కిల్స్ పుట్టుకతో రావు. కాలక్రమేణా కొందరికి సహజంగా రావచ్చు. అలాంటివారికే మార్కులు, ర్యాంకులు వస్తాయి. అలాగని మిగతావారు నిరాశ పడాల్సిన అవసరంలేదు. కాస్తంత ప్రయత్నం చేస్తే ఎవరైనా స్టడీస్కిల్స్ నేర్చుకోవచ్చు. కోరుకున్న మార్కులు, ర్యాంకులు సాధించవచ్చు. అందుకోసం కొన్ని టిప్స్..
- స్టడీస్కిల్స్‌లో అతి ముఖ్యమైనది ఎఫెక్టివ్ లిజనింగ్. క్లాసులో శ్రద్ధగా వింటే.. మీరు 70శాతం సబ్జెక్ట్ నేర్చుకున్నట్లే. అందుకే శ్రద్ధగా వినడం ప్రాక్టీస్ చేయండి.
- నేర్చుకోవడం మీ మెంటల్ స్టేటస్‌పై ఆధారపడి ఉంటుంది. బాగా విశ్రాంతి తీసుకున్న మనసు మెరుగ్గా పని చేస్తుంది. అందువల్ల తగినంత నిద్ర, సమతుల ఆహారం, సరిపడా శారీరక శ్రమ ఉండేలా చూసుకోండి. శరీరం యాక్టివ్‌గా ఉంటే మైండ్ కూడా యాక్టివ్ అవుతుంది.
- ఎఫెక్టివ్ స్టడీ అనేది ఎఫెక్టివ్ ప్లానింగ్‌తో మొదలవుతుంది. మీరు నేర్చుకోవాల్సిన అంశాలను చిన్న చిన్న భాగాలుగా విభజించి స్టడీ షెడ్యూల్‌ను రూపొందించుకోవాలి. ప్రతి అంశానికి సరిపడా సమయం కేటాయించాలి. ఫోకస్ కొనసాగించడానికి మధ్య మధ్యలో గ్యాప్ తీసుకోవాలి.
- చదవడమంటే పుస్తకం ముందేసుకుని కూర్చోవడం కాదు. అందులోని కాన్సెప్ట్స్‌ని అర్థం చేసుకోవడం, ప్రాసెసింగ్ చేయడం, ఇంకొకరికి బోధించడం. ఇలా చేయడం ద్వారా మీ అవగాహన, జ్ఞాపకశక్తి బలోపేతమవుతాయి.
- క్లాసులో చెప్పిన ప్రతి అక్షరం నోట్సులో రాసుకునే అలవాటును వదిలేయండి. బదులుగా ముఖ్య అంశాలను మాత్రమే నోట్ చేసుకునే సెలక్టివ్ నోట్ టేకింగ్ ప్రాక్టీస్ చేయండి. కంటెంట్ సారాంశాన్ని గ్రహించి కీలక అంశాలను మీ సొంత మాటల్లో రాసుకోండి. ఆడియో, వీడియో, ఫ్లాష్ కార్డ్‌లు ఉపయోగించండి. సులువుగా నేర్చుకోగలుగుతారు.
- పరీక్షల్లో ఇచ్చిన టైమ్‌లో సమాధానాలు రాయడం అత్యంత ముఖ్యమైన విషయం. అందువల్ల పోమోడోరో టెక్నిక్ వంటి వాటిని ఉపయోగించి ఫోకస్డ్‌గా చదవడం, రాయడం నేర్చుకోండి.
- ఏ విషయంలోనైనా మీకు సమస్య ఎదురైతే పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్ సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి.
(చదవండి: హలో బ్రదర్ సినిమా మాదిరి కవల సిస్టర్స్ !..ఊహాతీతమైన ఓ మిస్టరీ గాథ)
Comments
Please login to add a commentAdd a comment