
స్త్రీ జీవితాన్ని రాతిలా మార్చాలని చూస్తుంది సమాజం. బాధ్యతలు, బరువులతో ఆమెను కుటుంబానికి పరిమితం చేస్తుంది. ఉన్న చోటే ఉంచేస్తుంది. అలాగే మిగిల్చేస్తుంది. కాని అన్ని రాళ్లు నీళ్లలో మునిగిపోవు. నీళ్లలో తేలుతాయి. ఈదులాడుతాయి. ముందుకు పోతాయి. రజనీ లక్కా మేలిమి రత్నం. తను కదలడమే కాదు, కదలలేని స్థితిలో ఉన్న ‘ఫిజికల్లీ ఛాలెంజ్డ్’ పిల్లలకు కూడా ఈత నేర్పుతోంది. ఇలా సేవ చేస్తున్న మహిళ రజనీ మాత్రమే. ఎంత గొప్ప ప్రయత్నం!
రజని లక్కా. సాధారణ గృహిణి ఒకప్పుడు. అలాగే ఉండిపోయి ఉంటే ఇంత పేరు వచ్చి ఉండేది కాదు. అల్‌జజీరా టెలివిజన్ ఆమెను వెతుక్కుంటూ వచ్చేది కాదు. నేషనల్ మీడియా ఆమె అప్పాయింట్‌మెంట్ కోసం ఎదురు చూసేది కాదు. 58 ఏళ్ల వయసులో ఆమె ఒక్కసారిగా నీళ్లలోకి డైవ్ చేస్తుంటే కెమెరా లెన్స్‌లు జూమ్ అవుతాయి. స్పెషల్లీ ఏబుల్డ్ పిల్లలను ఒక చేత్తో పట్టుకుని ఈదుతుంటే స్విమ్మింగ్ పూల్ నుంచి ఎప్పుడు బయటకు వస్తారా అని మైక్‌లు ఎదురు చూస్తుంటాయి. ఇంతకీ ఆమె ఘనత ఏమిటి?
కల... చిగిర్చిన కల...
రజని పుట్టిందీ పెరిగిందీ గుంటూరులో. చదివింది సెయింట్ లూథరన్ క్రిస్టియన్ మిషనరీ స్కూల్‌లో. చదువుకుంటున్నప్పుడు స్పోర్ట్స్‌లో టీమ్ లీడర్ ఆమె. షాట్‌పుట్, జావెలిన్ త్రోలో మెడల్స్ సాధించి, స్టేట్‌కు రిప్రజెంట్ చేశారు. స్పోర్ట్స్ పర్సన్ కావాలనేది ఆమె కల. ఈ లోపు అవాంతరం. నాన్నకు హార్ట్ ఎటాక్. దాని నుంచి బయటపడినా తండ్రి బాధ్యత ముందుకొచ్చింది.
హార్ట్ ఎటాక్ మళ్లీ ఎప్పుడు దాడి చేస్తుందో? తానుండగానే కూతురికి పెళ్లి చేసేయాలనుకున్నారాయన. అలా స్పోర్ట్స్ మీద కలలు పెంచుకున్న రజనికి పదహారేళ్లకే పెళ్లయింది. భర్తతో అనంతపురం జిల్లాకు ప్రయాణం. ఆ తరవాత ఇద్దరు పిల్లలతో బళ్లారిలో కుటుంబ జీవితం. రోజులు గడిచిపోయాయి. పిల్లలు స్కూలుకెళ్లే వయసొచ్చింది. పెళ్లి కారణంగా అణచి వేసుకున్న అభిరుచులు ఒక్కసారిగా పురివిప్పుకున్నాయామెలో. ఆ ప్రస్థానం ఆమె మాటల్లోనే...
‘చదువు మానేసి పెళ్లి చేసుకోవడంతో తెలియని అసంతృప్తి ఉండేది. డాక్టర్‌లుగా, లాయర్‌లుగా సెటిల్ అయిన క్లాస్‌మేట్స్‌ను చూసినప్పుడు ఆ అసంతృప్తి మరీ ఎక్కువగా ఉండేది. దాంతో వ్యాపకాల్లో పడ్డాను. మొక్కలు పెంచాను. మూడు వందల రకాల మొక్కలతో ఇంటిని అడవిలా మార్చేశాను. ఎంత పిచ్చి అంటే ఐస్‌క్రీమ్ కప్పులో కూడా చిన్న మొక్కను నాటేదాన్ని. పిల్లల్ని స్కూలుకి పంపించి నేను గార్డెన్‌లోకి వెళ్లేదాన్ని. ఒక్కోసారి పిల్లలు స్కూలు నుంచి వచ్చే వరకు అలాగే గడిచిపోయేది. భోజనం చేయలేదని కూడా గుర్తొచ్చేది కాదు’.
లక్ష్యం వైపు ఈదులాట
‘ఆ టైమ్‌లో బ్యూటీషియన్ కోర్స్ పరిచయమైంది. బెంగళూరులో కోర్స్ చేశాను. అప్పుడే నాకు స్విమ్మింగ్ నేర్చుకోవాలనే కోరిక కలిగింది. అయితే అది శీతాకాలం కావడంతో కోచింగ్ అందుబాటులో లేదు. ఆ తర్వాత ఆ సంగతే మర్చిపోయాను. పిల్లలు పెద్దయి ప్రొఫెషనల్ కోర్సుల కోసం హాస్టల్స్‌కి వెళ్లిపోయిన తర్వాత నేను కోల్పోయిన చదువు మళ్లీ గుర్తు రాసాగింది. ఓపెన్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్‌కు అప్లయ్ చేశాను.
తీరా ఫైనల్ ఎగ్జామ్స్ టైమ్‌కి మా మామగారికి ఆరోగ్యం బాగోలేక నా చదువుకు మరోసారి అవాంతరం. కొంతకాలానికి అంటే 1994లో బళ్లారిలో స్విమ్మింగ్‌పూల్ ఓపెన్ అయింది. అప్పటికి నాకు 34 ఏళ్లు. ఐదు రోజుల్లో స్విమ్మింగ్ నేర్చుకున్నాను. అంతకంటే ఎక్కువగా ఒక ఆలోచన తొలిచేయసాగింది. చదువుకోలేకపోయిన కారణంగా ఏ మహిళైనా గృహిణిగానే ఉండిపోవాల్సిన పని లేదు. ఇష్టమైన రంగంలో పని చేయాలి, గుర్తింపు తెచ్చుకోవాలనిపించింది.
బ్యూటీషియన్ సర్టిఫికేట్ ఉంది... అది చాలు అనుకున్నాను. బళ్లారిలో పార్లర్ ఓపెన్ చేశాను. బయటి ప్రపంచంలోకి వచ్చిన తర్వాత నా లక్ష్యాలు కూడా మారుతూ వచ్చాయి. స్విమ్మింగ్ నేర్చుకోవడమే కాదు నేర్పించాలి అనుకున్నాను. కోచ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. ఏఎస్‌సీఏ (అమెరికన్ స్విమ్మింగ్ కోచెస్ అసోసియేషన్) లెవెల్ ఒన్, టూ, త్రీలు పూర్తిచేశాను. కెనడాలో సీఆర్‌ఆర్ (కెనడియన్ రెడ్ క్రాస్ కోర్స్), న్యూజిలాండ్‌లో ఆస్ట్ స్విమ్ టెస్ట్ పూర్తి చేశాను.
మరో సమాజం కనిపించింది!
బళ్లారిలో స్విమ్మింగ్‌లో కోచింగ్ ఇస్తున్నప్పుడు మా పనమ్మాయి స్విమ్మింగ్ ఫీజు గురించి అడిగి మళ్లీ మెదలకుండా ఉండిపోయింది. అప్పుడు వాళ్లబ్బాయికి పూల్‌లో పర్మిషన్ తీసుకుని ఫ్రీగా నేర్పించాను. అప్పటి నుంచి పేద పిల్లలకు ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నాను. చదువుతోపాటు మరొక టాలెంట్ ఉంటే జీవితంలో అదే ఉపాధిగా మారవచ్చు. స్విమ్మింగ్ లైఫ్ సేవర్ కూడా. ప్రమాదవశాత్తూ నీటిలో పడి ప్రాణాలు పోగొట్టుకోకుండా కాపాడుతుంది.
స్పెషల్లీ ఏబుల్డ్ చిల్డ్రన్‌కి ఎప్పుడూ ఎవరో ఒకరు తోడుగా ఉంటుంటారు. పిల్లలు పెద్దయ్యే కొద్దీ వాళ్లను ఎత్తుకోలేక తల్లులు పడే అవస్థ చూసినప్పుడు మనసు పిండేసినట్లనిపించేది. ఇలాంటి పిల్లలకు బస్సు, రైలు నీటిలో పడడం వంటి ప్రమాదం సంభవిస్తే, నిస్సహాయంగా నీటిలో మునిగిపోవాల్సిందేనా? అనుకుంటే గుండె నీరయిపోయినట్లు బాధ. ఇలాంటి పిల్లలకు నేను చేయగలిగింది ఈత నేర్పించడమే. ఇప్పటి వరకు 60 మందికి పైగా పిల్లలకు ఈత నేర్పించి, టోర్నమెంట్‌లకు తీసుకెళ్లాను.
ఉత్తేజ్ (మూగ పిల్లవాడు) ఆరు మెడల్స్ తీసుకున్నాడు. అరవై మందిలో 12 మంది మెడల్స్ వరకు కొనసాగారు. స్విమ్ జర్నీలో మా పిల్లలు బళ్లారికి మొత్తం 64 మెడల్స్ తెచ్చారు. ప్రతిదీ ఒక సంతోషమే. బ్లైండ్ గాళ్స్‌కి నేర్పించినప్పుడు ఎంత సంతోషించానో వాళ్లు ప్రాక్టీస్ మానేసినప్పుడు అంతకంటే ఎక్కువ బాధ పడ్డాను. తమను తాము రక్షించుకోవాల్సిన అవసరం మామూలు అమ్మాయిల కంటే బ్లైండ్ అమ్మాయిలకు చాలా ఎక్కువ. అందుకే వాళ్లకు కరాటే కోచింగ్ కూడా ఇప్పించాలనుకున్నాను. కానీ అది తీరనేలేదు.
అల్ జజీరా చెప్పే వరకు తెలియదు
జీవితమంటే ఆస్తుల్ని పెంచుకోవడం కాదు, ఉన్నది తింటూ కూర్చోవడమూ కాదు. పుట్టినందుకు ఏదో ఒక పని చేయాలి. అప్పుడే మనం తినే అన్నానికి న్యాయం చేసినవాళ్లమవుతాం. ఈ ఆలోచనలే నాతో ఈ పనులన్నీ చేయించాయి. నేను నమోదు చేసింది రికార్డ్ అని అల్ జజీరా వాళ్లు నా దగ్గరకు వచ్చే వరకు నాకు తెలియనే తెలియదు. ‘ఇండియాలోనే కాదు, ఆసియా దేశాల్లోనూ ఇలాంటి సర్వీస్ చేస్తున్న మహిళ లేరు’ అని అల్ జజీరా యాంకర్ చెప్తున్నప్పుడు ఎవరూ మరొకరి కోసం ఇలాంటి చిన్న పని కూడా చేయడం లేదా అనిపించింది.
దాంతో నా సర్వీస్‌ని విస్తృతంగా చేయడానికి ‘సాయి రజని స్విమ్మింగ్ లైఫ్ అకాడమీ’, ‘సాయి రజని స్విమ్మింగ్ లైఫ్ ట్రస్ట్’ మొదలు పెట్టాను. నా సర్వీస్‌కి బళ్లారి జిల్లా అధికారులు స్విమ్మింగ్ పూల్‌ను ఫ్రీగా ఉపయోగించుకునే అవకాశం ఇచ్చారు. నా ట్రస్ట్‌కి ఏటా మా రమణారెడ్డి (భర్త) కొంత డబ్బిస్తారు. మిగిలిన డబ్బు నేను సంపన్న వర్గాల పిల్లలకు సమ్మర్ కోచింగ్ ఇచ్చి సంపాదించుకుంటాను. స్పెషల్లీ ఛాలెంజ్‌డ్ పిల్లల్ని ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లకు తీసుకెళ్లాలనేది నా ఆకాంక్ష. తెలుగు నేల మీద పుట్టాను, కన్నడ రాష్ట్రంలో నేను నివసిస్తున్న బళ్లారికి ఇన్ని మెడల్స్ తేగలిగాను. తెలుగు రాష్ట్రాల్లో కూడా నేను చేయగలిగిన పని చేయాలని ఉంది’ అంటున్నారు రజని.
గోపీని నడిపించాలి
గోపీచంద్ పదకొండేళ్ల పిల్లాడు, రెండు కాళ్లూ లేవు. ఎనిమిదేళ్ల వయసులో ఐస్‌క్రీమ్ కొనుక్కుని పరుగెత్తుకుని వస్తూ బస్సు కింద పడిపోయాడు. రెండు కాళ్లూ నుజ్జునుజ్జయ్యాయి. ఆ పిల్లాడిని అనాథాశ్రమంలో వదిలాడు తండ్రి. ఓ రోజు ఆర్ఫనేజ్ విజిట్ చేసినప్పుడు గోపీ కనిపించాడు. పెరిగే వయసు, కాళ్లు లేకపోవడంతో వ్యాయామం లేక దేహం పెరిగిపోతోంది. అలాంటి పిల్లలకు స్విమ్మింగ్ చాలా అవసరం.
గోపీకి ధైర్యం చెప్పి పూల్‌లో దించాను. రెండు రోజుల్లో బ్యాక్ స్ట్రోక్ పూర్తిగా నేర్చుకున్నాడు. నా చేతిని వదిలేసి ఈత కొట్టసాగాడు. స్టేట్ లెవెల్ పోటీల్లో, ఉదయ్‌పూర్, జైపూర్‌లో జరిగిన పారా స్విమ్మింగ్‌లో మెడల్స్ తెచ్చుకున్నాడు. ఆ వార్తలు రావడంతో గోపీకి ప్రోస్థటిక్ లెగ్స్ డొనేట్ చేయడానికి ఆదిత్య మెహతా కంపెనీ ముందుకొచ్చింది.
బస్సు ప్రమాదంలో జరిగిన నష్టాన్ని స్విమ్మింగ్ ద్వారా భర్తీ చేయగలిగానని తృప్తి. ఇప్పటికి సర్వెంట్స్ పిల్లల్ని నలుగురిని చదివిస్తున్నాను. గోపీకి సర్జరీ అయిన తర్వాత నా దగ్గరకే తెచ్చుకుని వాడిని కూడా చదివిస్తాను. బాగా చురుకైన పిల్లాడు. వాడలా నిరాశగా ఉంటే చూడలేకపోతున్నాను. వాడిని నడిపించాలి, అన్ని రకాలుగా వాడు వాడి కాళ్ల మీద నిలబడే వరకు వాడి చేతిని వదలను.
ఇంగ్లిష్ చానెల్ మెడల్ తప్పింది!
కోచ్‌గా మారడానికి ముందు ఏడెనిమిదేళ్లపాటు స్విమ్మర్‌గా అనేక టోర్నమెంట్‌లలో పాల్గొన్నాను. మొత్తం 68 మెడల్స్ గెలుచుకున్నాను. 2006లో త్రివేండ్రంలో తొలి మెడల్ అందుకున్నాను, ఆ తరువాత రాజ్‌కోట్, భోపాల్, ఆస్రేలియా, శ్రీలంకల్లో మెడల్స్ అందుకున్నాను. ఇంగ్లిష్ చానెల్ మెడల్ తృటిలో తప్పిపోయింది. పౌర్ణమి రోజు పోటీలు పెట్టకూడదు.
కానీ వెస్ట్రన్ పీపుల్‌కి తూర్పు దేశాల మీద ఒకింత చిన్నచూపు ఉంటుంది. అది ఎక్కడో ఓ చోట బయటపడుతూనే ఉంటుంది. స్లాట్‌లు ఇచ్చేటప్పుడు నిర్లక్ష్యంగా ఉంటారు. నాకు పౌర్ణమి రోజు సాయంత్రం ఆరుగంటల తర్వాత ఇచ్చారు. బోట్ లో నుంచి నీటిలో దూకి, ఈదుతున్నాను. బోట్‌ను తిరగ్గొట్టేసేటంత పెద్ద అల వచ్చి నన్ను ముంచేయబోయింది. అప్పుడు బోట్‌లో ఉన్న మహిళ నీటిలో దూకి నన్ను లాగేసింది. ప్రొటెక్షన్ పర్సన్ తాకారంటే ఇక పోటీకి అర్హత ఉండదు.
– వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment