
రూపా గంగూలి
కూడబెట్టుకున్న సంపదను కరిగించేసినట్లే, కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టల్ని కూడా హరించేస్తుంటారు కొందరు పుత్రరత్నాలు. బీజేపీ ఎంపీ రూపా గంగూలి కుమారుడు ఆకాశ్ ముఖోపాధ్యాయ్ (20) కారు నడుపుతూ ఇంటి పక్కనే ఉన్న ఓ గోడను డీకొట్టాడు. ఆ ధాటికి గోడకు అవతల ఉన్న కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే గానీ ఏ దేవుడో చెయ్యి అడ్డు పెట్టి తృటిలో తప్పించేశాడు. గోడ మాత్రం కూలిపోయింది. కారు నడుపుతున్నప్పుడు అతడు తప్ప తాగి ఉండడాన్ని తాము చూశామని ఘటనాస్థలంలో ఉన్న వాళ్లు చెప్పడంతో పోలీసులు ఆకాశ్‌ని అరెస్ట్ చేశారు. ఎంపీ గారి తనయుడు కనుక శిక్ష లేకుండా బయటికి వచ్చేస్తాడని మనం అనుకోవచ్చు. కానీ రూపా గంగూలి ‘నో పాలిటిక్స్ ప్లీజ్’ అంటున్నారు. ‘దయచేసి ఈ ఘటనను రాజకీయం చేయకండి. నా కొడుకంటే నాకు ఇష్టమే. కానీ చట్టం తన పని చేసుకుపోతుంది’’ అని కొడుకు అరెస్ట్‌పై ఆమె ఒక ట్వీట్ పెట్టారు. కోల్‌కతాలోని గోల్ఫ్ గార్డెన్ ప్రాంతంలో గురువారం ఈ ఘటన జరిగింది. ఆకాశ్ కారు గుద్దిన గోడ ఒక క్లబ్బుది.
Comments
Please login to add a commentAdd a comment