స్పాట్‌లైట్ : నచ్చని ఫాలోవర్లను ఇక బ్లాక్ చేయొచ్చు!
సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ట్విటర్ తన ఖాతాదారులకు ‘బ్లాక్’ సేవను పునరుద్ధరించింది. దీంతో మీ అకౌంట్‌ను మీకు నచ్చనివారు ఎవరైనా ఫాలో అవుతుంటే వారిని తొలగించి, బ్లాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఈ సదుపాయం ఉండేది. అయితే ట్విటర్ యాజమాన్యం ఎందుకో ఈ బ్లాక్ చేసే పద్ధతిని తొలగించింది. యూజర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను గమనించి ఈ సేవను తిరిగి అందిస్తున్నట్టు ట్విటర్ పేర్కొంది. సెలబ్రిటీల హడావుడి ఎక్కువగా ఉన్న ట్విటర్‌లో ‘రీట్వీట్’ల విషయంలో కొంత ఇబ్బంది ఉంది. సెలబ్రిటీల ఫాలోవర్లుగా ఉంటూనే కొంతమంది అసభ్యపూరితమైన రీట్వీట్‌లు ఇస్తుండటాన్ని గమనించవచ్చు. ఈ నేపథ్యంలో... తిరిగి ‘బ్లాక్’ చేసే సదుపాయం మొదలవుతుండటం విశేషం.
తెలుగును సపోర్ట్ చేసే
సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్!
కొరియన్ హ్యాండ్‌సెట్ మేకర్ ‘సామ్‌సంగ్’ భారతీయులను ఇప్పుడు ప్రాంతీయ భాషల్లో పలకరిస్తోంది. తాజాగా ఆ సంస్థ మధ్య స్థాయి గెలాక్సీ ఫోన్ ఎస్ డుయోస్-2 ను విడుదల చేసింది. ఇది పది ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేస్తుండటం విశేషం. ఈ ఫోన్ మెనూ తెలుగు, కన్నడ, తమిళంతో మొత్తం పది ప్రాంతీయ భాషల్లో డిస్‌ప్లే అవుతుంది. ఫేస్‌బుక్, గూగుల్, జీమెయిల్ తదితరాలను తెలుగు డిస్‌ప్లేతో సర్ఫ్ చేయొచ్చు! 4 అంగుళాల స్క్రీన్, 5 మెగా పిక్సెల్ కెమెరా, 1.2 జీహెచ్‌జెడ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌తో ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.