
పందొమ్మిది వందల డెబ్బైలనాటి అమెరికన్ కాలేజ్ అమ్మాయిల ప్రియనేస్తం ‘అవర్ బాడీస్ అవర్‌సెల్వ్స్’ ఇక మీద కనిపించబోవడం లేదు! స్త్రీ శరీర స్వభావాల గురించి, దేహధర్మాలు, దైనందిన బరువు బాధ్యతల గురించి సచిత్రంగా విపులీకరించి వారి భయాలు, అపోహలు పోగొట్టిన ఈ పుస్తకం పునర్ముద్రణలు నిజానికి 2011తోనే ఆగిపోయాయి. అయితే ‘అదే ఆఖరు’ అని ఈ ఏప్రిల్ నాలుగున పుస్తక ప్రచురణకర్తలైన ‘బోస్టన్ ఉమెన్’ గ్రూపు సభ్యులు ప్రకటించారు! 1970లో తొలిసారి విడుదలైనప్పుడు ఈ పుస్తకం పేరు ‘ఉమెన్ అండ్ దెయిర్ బాడీస్’.
తర్వాత ‘అవర్ బాడీస్ అవర్‌సెల్వ్స్’గా మార్చారు. 193 పేజీలున్న ఈ పుస్తకాన్ని ప్రారంభంలో 35 సెంట్లకు (నేటి విలువలో 2.30 డాలర్లు / 150 రూపాయలు) విక్రయించారు. ఈ యాభై ఏళ్లలో 4 కోట్ల ప్రతులు అమ్ముడయ్యాయి. 31 భాషల్లోకి తర్జుమా అయింది. అంతా మహిళలే వ్యాసకర్తలుగా ఉన్న ఈ పుస్తకంలో ప్రధానంగా మహిళల ఆరోగ్యం, వారి మానసిక స్థితిగతుల గురించిన సందేహాలకు ప్రామాణికమైన సమాధానాలు ఉండేవి.
‘‘వయసొచ్చిన ప్రతి ఆడపిల్లకూ ‘అవర్ బాడీస్ అవర్‌సెల్వ్స్’ ఒక ఆంతరంగిక స్నేహితురాలిగా ఉండేదని ప్రచురణ బృందంలోని యువ సభ్యురాలు వెండీ క్లైన్ గత ఏడాది వాషింగ్టన్ పోస్ట్‌కు రాసిన వ్యాసంలో ప్రస్తావించారు. అయితే ఇంతగా ఆదరణ పొందిన పుస్తకం ప్రచురణను శాశ్వతంగా నిలిపివేయడానికి.. ఆన్‌లైన్‌లో అపరిమితంగా సమాచారం అందుబాటులో ఉండటమే కారణం అని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment