ఆల్ ఇన్ 1 కాయ | Brinjal special | Sakshi
Sakshi News home page

ఆల్ ఇన్ 1 కాయ

Published Fri, Apr 24 2015 11:10 PM | Last Updated on Sun, Sep 3 2017 12:49 AM

ఆల్ ఇన్ 1 కాయ

ఆల్ ఇన్ 1 కాయ

తెలుగువారి మెనూలో కచ్చితంగా ఉండే కూరగాయ... వంకాయ. ఎవరు వండినా, ఎలా వండినా... తనదైన రుచిని వంటకానికి అద్దడం వంకాయ ప్రత్యేకత. అలాంటి వంకాయతో సాక్షి పాఠకులు వండిన నాలుగు కమ్మని వంటకాలు... ఈవారం ‘రీడర్స్ కిచెన్’లో!
 
వెన్న వంకాయ
కావలసినవి : లేత వంకాయలు - పావుకిలో, పచ్చిమిర్చి - 6, ఉల్లిపాయలు - 2, వెన్న - అరకప్పు, చింతపండు - కొద్దిగా, కరివేపాకు - 1 రెమ్మ, జీలకర్ర - 2 చెంచాలు, ఆవాలు - 1 చెంచా, మినప్పప్పు - 1 చెంచా, శనగపప్పు - 1 చెంచా, ఇంగువ - 2 చెంచాలు, చక్కెర - 1 చెంచా, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, కొత్తిమీర - కొద్దిగా

తయారీ : ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి, మధ్యలో చీరాలి (గుత్తివంకాయకు చేసుకున్నట్టుగా); తర్వాత వాటిని ఐదు నిమిషాల పాటు నీటిలో ఉడికించి పక్కన పెట్టాలి; ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు, జీలకర్ర, ఉప్పు, పసుపు, చక్కెర వేసి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి; ఈ పేస్ట్‌ను వంకాయల మధ్యలో కూరాలి; స్టౌమీద బాణలి పెట్టి వెన్న వేయాలి; కరిగిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, మిగిలిన జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేయాలి; వేగిన తర్వాత స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను వేయాలి; మాడిపోకుండా కలుపుతూ సన్నని మంటమీద వేయించాలి; వంకాయలు బాగా మగ్గి మెత్తబడిన తర్వాత కొత్తిమీర వేసి దించేసుకోవాలి.
 
వంకాయ నువ్వుల పులుసు
 
కావలసినవి : వంకాయలు - పావుకిలో, నువ్వులు - 2 చెంచాలు, ఎండుమిర్చి - 4, ఉల్లిపాయ - 1, చింతపండు - నిమ్మకాయ అంత, బెల్లం - కొద్దిగా, ఉప్పు - తగినంత, కొత్తిమీర - కొద్దిగా, తాలింపుకోసం - జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు

తయారీ : చింతపండును నీటిలో నానబెట్టి పులుసు తీయాలి; వంకాయలకు నూనె రాసి, మంటమీద కాల్చాలి; అవి చల్లారిన తర్వాత తొక్క ఒలిచేసి, గుజ్జులా చేసుకోవాలి; నువ్వులు, ఎండుమిర్చి కలిపి పొడి చేసుకోవాలి; స్టౌమీద బాణలి పెట్టి, కొద్దిగా నూనె వేయాలి; వేడెక్కాక తాలింపు దినుసులు వేయాలి; చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు వేసి, రంగు మారేవరకూ వేయించాలి; తర్వాత చింతపండు పులుసు వేసి మూతపెట్టాలి; పులుసు తిరగబడుతున్నప్పుడు వంకాయగుజ్జు, ఉప్పు, నువ్వులు-మిర్చి పొడి, బెల్లం వేసి ఉడికించాలి; మిశ్రమం కాస్త దగ్గరపడిన తర్వాత కొత్తిమీర చల్లి దించేసుకోవాలి.
 
బైగన్ మంచూరియా
 
కావలసినవి : వంకాయలు - పావుకిలో, బ్రెడ్ - 4 స్లైసెస్, మైదా - 2 చెంచాలు, ఉల్లిపాయలు - 2,  పచ్చిమిర్చి - 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 చెంచాలు, ఆవాలు - 1 చెంచా, జీలకర్ర - 1 చెంచా,కారం - 1 చెంచా, పచ్చికొబ్బరి పొడి - 1 చెంచా, ధనియాల పొడి - 1 చెంచా, టొమాటో సాస్ - 2 చెంచాలు, పసుసు - చిటికెడు, ఉప్పు - తగినంత, కరివేపాకు - 2 రెమ్మలు, కొత్తిమీర - కొద్దిగా, నూనె - తగినంత

తయారీ : బ్రెడ్ స్లైసెస్‌ను పొడిలా చేసుకోవాలి; వంకాయలను ఉడికించి, మెత్తని గుజ్జులా చేసుకుని, దీనిలో ఉప్పు, కారం, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మైదా వేసి కలపాలి; ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, బ్రెడ్ పొడిలో దొర్లించి, నూనెలో డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి; స్టౌమీద మరో బాణలి పెట్టి, కాస్త నూనె వేయాలి; వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేయాలి; చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి; వేగిన తర్వాత మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరిపొడి, ధనియాల పొడి వేసి కాసేపు వేయించాలి; తర్వాత వేయించి పెట్టుకున్న వంకాయ బాల్స్, టొమాటో సాస్, కొత్తిమీర వేయాలి; సన్నని మంటమీద ఐదు నిమిషాల పాటు ఉడికించి దించేయాలి; జీడిపప్పు, కొత్తిమీరతో అలంకరించుకుని వడ్డించాలి.
 
వంకాయ ఉల్లి పచ్చడి
కావలసినవి : వంకాయలు - పావుకిలో, ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు, ఎండుమిర్చి - 3, పచ్చిమిర్చి - 3, చింతపండు - కొద్దిగా, జీలకర్ర - 2 చెంచాలు, ఆవాలు - 2 చెంచాలు, ఛాయ మినప్పప్పు - 2 చెంచాలు, ఇంగువ - అరచెంచా, ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు, నూనె - 4 చెంచాలు, కరివేపాకు - 2 రెమ్మలు

తయారీ : ముందుగా వంకాయలను కాల్చి, తొక్క తీసి, మెత్తని గుజ్జులా చేసుకోవాలి. ఈ గుజ్జు 2 కప్పులు ఉండేలా చూసుకోవాలి; ఈ గుజ్జు, ఉల్లిపాయ ముక్కలు కలిపి మెత్తని పేస్ట్‌లా చేసి పక్కన పెట్టుకోవాలి; తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, పసుపు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి; ఇప్పుడు స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేయాలి; వేడెక్కాక కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేయాలి; చిటపటలాడాక ఇంగువ కూడా వేయాలి; ఆపైన రుబ్బి పెట్టుకున్న రెండు మిశ్రమాలూ వేసి బాగా కలపాలి; రెండు నిమిషాల పాటు సన్నని మంటమీద ఉంచి దించేసుకోవాలి; దీనిలో కాసిన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు కలుపుకుని, నెయ్యితో పాటు అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది.
 
మధుమేహ రోగులకు మంచిది!
వంకాయలో క్యాలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ ఉంటాయి. ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది. ఫైబర్, నీరు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టైప్ 2 మధుమేహ రోగులు, డైట్ కంట్రోల్ చేస్తోన్న స్థూలకాయులు దీనిని తరచూ తినడం మంచిది. అలాగే వంకాయ హైబీపీని కంట్రోల్ చేస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. న్యాసునిన్ క్లోరోజెనిక్ రూపంలో ఉండే ఫైటో న్యూట్రియెంట్లు వంకాయలో పుష్కలంగా ఉంటాయి. ఇవి పలు రకాల క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడతాయి.

ఫోలేట్, మెగ్నీషియం, పొటాసియం, విటమిన్ బీ1, బీ6, విటమిన్ కె బీటా కెరోటిన్‌లు గుండెవ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. ఉబ్బసాన్ని తగ్గించడంలో కూడా వంకాయ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఆర్థరైటిస్ ఉన్నవారు తింటే కొన్నిసార్లు కీళ్లనొప్పులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్లు కొంచెం తక్కువ తీసుకోవడం మంచిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement