కలలు అందరూ కంటారు. వాటిని నిజం చేసుకోవడానికి కొందరే ప్రయత్నిస్తారు. కొన్ని కలలు సగంలో ఆగిపోతాయి. కొన్ని కలలు ప్రోత్సాహం కోసం ఎదురు చూస్తాయి. గృహిణులుగా ఇల్లు నడిపే స్త్రీలు ఆర్థిక స్వావలంబన కోసం ఎన్నో ఆలోచనలు, ప్రయత్నాలు చేస్తారు. వాటికి వేదిక దొరికినప్పుడు గొప్పగా తమ ప్రతిభను చాటుతారు. దేశంలో వ్యాపార ఆలోచనలు చేయగల గృహిణులను ప్రోత్సహించడానికి, వారి ఆలోచనలు పది మందికి ఉపాధి ఇచ్చేటట్టయితే ఆర్థిక మొత్తం అందించడానికి బ్రిటానియా సంస్థ 2018 నుంచి ‘బ్రిటానియా మేరీగోల్డ్ మై స్టార్టప్’ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. 2018లో సీజన్1 కాంటెస్ట్ జరగగా 2020 ఫిబ్రవరిలో సీజన్ 2 కాంటెస్ట్∙మొదలయ్యి తాజాగా విజేతల ప్రకటన జరిగింది.
‘మీ దగ్గర మంచి వ్యాపారాలోచన ఉంటే అదే మీరు పాల్గొనడానికి యోగ్యత’ పేరుతో మొదలైన ఈ కాంటెస్ట్‌లో ఏ గృహిణి అయినా పాల్గొనవచ్చు. సీజన్2లో దేశంలో 32 రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి దాదాపు 15 లక్షల ఎంట్రీలు వచ్చాయి. ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, వెబ్‌సైట్ ద్వారా గృహిణులు తమకున్న ఆలోచనలు పంచుకున్నారు. నిర్వాహకులు చెప్పడం కేవలం వాట్సప్ ద్వారా 25 శాతం ఎంట్రీలు వచ్చాయి. అనుభవజ్ఞులైన అంట్రప్రెన్యూర్‌లు, మీడియా నిపుణులతో కూడిన సెలెక్షన్ కమిటీ ఈ ఎంట్రీలన్నీ పరిశీలించింది. కరోనా కాలం కనుక ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు నిర్వహించింది. అనేక వడపోతల తర్వాత 50 మందితో షార్ట్‌లిస్ట్ తయారైంది. మళ్లీ వీరిని పరిశీలించి 10 మంది విజేతలను ప్రకటించారు. వీరిలో ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల ఆర్థిక బహుమతి అందించారు. అంతే కాదు... వీరిలో మంచి ఆలోచనలు చెప్పిన 10 వేల మందిని ఎంపిక చేసి నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్.ఎస్.డి.సి) సహాయం ప్రత్యేకమైన ఆన్‌లైన్ స్కిల్ ప్రోగ్రామ్ ద్వారా అంట్రప్రెన్యూర్‌గా ఎదగడానికి అవసరమైన నైపుణ్యాలను అందిస్తారు.
‘బ్రిటానియా మేరీగోల్డ్ మై స్టార్టప్ కాంపెయిన్ 2020’ విజేతలుగా 1. జరీనా (తెలంగాణ), 2. షహనాజ్ తబస్సుమ్ (బిహార్), 3.నర్మత వసంతన్ (తమిళనాడు), 4.రాగిణి కుమారి (జెంషెడ్‌పూర్), 5.షిఖా డే (పశ్చిమ బెంగాల్), 6. అర్చన.పి (తమిళనాడు), 7.ఎలాక్షి ఫుకన్ (అస్సామ్), 8. దీప్తి బన్సాల్ (హర్యానా), 9.సరీనా.సి (కేరళ), 10. సుమతి.ఆర్ (కాంచీపురం) నిలిచారు.
హైదరాబాద్‌కు చెందిన జరీనా ‘లెనిన్ బేబీ క్లోతింగ్’ తయారీ కేంద్రం ప్రారంభించాలనుకుంటున్నానని, దిగువ శ్రేణి వర్గాల మహిళలకు అందులో ఉపాధి కల్పించనున్నానని తన ఐడియా చెప్పి బహుమతి గెలుచుకున్నారు. ‘మూడేళ్ల లోపు పిల్లల బట్టలను అనే సంస్థలు ఉత్పత్తి చేస్తున్నా లెనిన్ వస్త్రంతో సౌకర్యంగా, ఫ్యాషన్‌గా ఎవరూ తయారు చేయడం లేదు. కనుక ఆ ఏరియాలో ఆశాజనకమైన ఆర్థిక ఫలితాలు ఉంటాయని భావిస్తున్నాను’ అని జరీనా చెప్పారు. హర్యానాకు చెందిన దీప్తి బన్సాల్ ‘వెజిటెబుల్ అండ్ ఫ్రూట్ శానిటైజర్’ తయారీ కేంద్రాన్ని ప్రారంభిస్తానని చెప్పారు.
అస్సామ్‌కు ఎలాక్షి సుగర్ ఫ్రీ అస్సామీ సంప్రదాయ స్వీట్లు తయారీ ఐడియాకు బహుమతి పొందారు. కేరళకు సరీనా ‘కేజ్ ఫిష్ ఫామ్’ తన వ్యాపార కలగా చెప్పుకున్నారు. తమిళనాడుకు చెందిన అర్చన పిల్లల కోసం ఒక సైన్స్ మ్యూజియం తెరుస్తానని చెప్పి బహుమతి పొందడం గమనార్హం. కంప్యూటర్ ట్రయింగ్ సెంటర్, హెల్త్ మసాజ్ సెంటర్‌ల ఐడియాలకు కూడా బహుమతులు దక్కాయి. వీరే కాదు ఈ కాంటెస్ట్‌లో పాల్గొన్న వేలాది మంది స్త్రీలు ఎన్నో వినూత్న ఆలోచనలు పంచుకున్నారు. స్త్రీలకు అవకాశం ఇవ్వగలిగితే వ్యాపార, ఉపాధి రంగాలలో గొప్ప ప్రతిభను చాటగలరని ఈ కాంటెస్ట్ మరోసారి నిరూపించింది. ఈసారి ఈ కాంపెయిన్‌ని మిస్ అయినవారు వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో తప్పక పాల్గొనండి.
Comments
Please login to add a commentAdd a comment