అన్నయ్య పిలిస్తే పలకాలి.పిలవాలంటేనే భయపడే స్థాయిలో ఉండకూడదు.అన్నయ్య తాను రాఖీ కట్టించుకోవాలి.అంతేతప్ప, చెల్లెలి చుట్టూ బంధనాలు చుట్టేయకూడదు.అన్నయ్య స్నేహితుడిలా ఉండాలి. చండశాసనుడిలా కాదు.అన్నయ్య అన్నయ్యలా ఉండాలి. జైలర్‌లా కాదు.. హిట్లర్‌లా కాదు.
స్కూలు విడిచారు.ఆడపిల్లలంతా గుంపులుగా నడుస్తున్నారు.స్కూల్ బస్‌లో పక్కసీట్‌లో కూచున్న అమ్మాయి బ్యాగ్ ఒళ్లో పెట్టుకుంటూ శ్వేతను అడిగింది– ‘ఏంటి డల్లుగా ఉన్నావ్’‘ఏం లేదు’‘ఉన్నావ్. చాలా రోజులుగా గమనిస్తున్నాను. ఏం ప్రాబ్లమ్?’‘ఏం లేదు’‘కొంప దీసి ఎవరైనా వేధిస్తున్నారా?’శ్వేత తన ఫ్రెండ్ వైపు దీర్ఘంగా చూసి అంది–‘అవును’‘ఏమిటే... మనం చదువుతున్నది నైన్త్ క్లాస్. ఇప్పటి నుంచి హరాస్‌మెంటా. ఎవడు వాడు?’‘మా అన్న’‘శ్వేతా’... కాలేజ్ నుంచి వచ్చిన వరుణ్ చెల్లెల్ని పెద్దగా పిలిచాడు.శ్వేత పరిగెత్తింది.‘ఏంటన్నయ్యా’‘రా... కాసేపు షటిల్ ఆడదాం. నీకు షటిల్ అంటే ఇష్టంగా’‘ఇష్టమే. కాని కాసేపు టీవీ చూస్తా అన్నయ్యా’‘వద్దు.
టీవీ అంతా చెత్త. ఆ చెత్త చూస్తావా నువ్వు. నేనొప్పుకోను’‘ఫోన్‌లో ఏదైనా గేమ్ ఆడుకుంటా’‘ఫోన్‌లో నెట్ ఉంటుంది. ఏది పడితే అది బ్రౌజ్ చేయకూడదు. డేంజర్. నీకు ముందే చెప్పాను. నీకు నేను అన్నయ్యనే కాదు. మంచి ఫ్రెండ్‌ని కూడా. నువ్వు నాతో ఆడుకో చాలు’‘నీతో ఎందుకన్నయ్యా ఆడుకోవడం. నేను నా ఫ్రెండ్స్‌తో ఆడుకుంటా. నువ్వు నీ ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లు’‘కుదర్దు. నువ్వు నాతోనే ఉండాలి. ఇదిగో నీ కోసం ఫైవ్‌స్టార్ చాక్లెట్ తెచ్చాను. తీసుకో’‘వద్దు’‘తీసుకో’‘వద్దన్నానా’ఫట్. చెంప పగిలింది.శ్వేత ఆ చాక్లెట్‌ను తీసుకుని తన రూమ్‌లోకి పరిగెత్తింది.రామారావు అదో రకమైన ఇంటి పెద్ద. అతడు బయట్ హెడ్ క్లర్కేగాని ఇంట్లో మేనేజర్ కంటే స్ట్రిక్ట్‌గా ఉంటాడు. ముఖ్యంగా ఆడవాళ్లతో. ఆడవాళ్లు ఎందుచేతనో చెడిపోతారని, వాళ్లని ఎప్పుడూ కట్టడిలో ఉంచాలని, వారిని బయటకు తిరగనివ్వరాదని, వారికి ఏం కావాల్సి వచ్చినా తన తోడులో ఉంటూ పొందాలని ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి.
భార్యను ఒక్కదాన్నే ఎక్కడికీ పంపడు. కూతురి పరిస్థితీ అంతే. కాని తను, కొడుకు మాత్రం ఫ్రీగా ఉంటారు. వాణ్ణి స్కూటర్ ఎక్కించుకుని బయటకు తిప్పుతాడు. అప్పుడప్పుడు సినిమాలకు తీసుకెళతాడు. డబ్బు ఇస్తాడు. ఫ్రెండ్స్ దగ్గరకు వెళతానంటే వెళ్లనిస్తాడు. కాని కూతురు మాత్రం స్కూలు, ఇల్లు తప్ప ఇంకోటి చూడకూడదు.అంతే కాదు పదే పదే ‘అరేయ్ చెల్లెలి బాధ్యత నీదే. అసలే రోజులు బాగలేవు’ అని చెప్తూ ఉంటాడు.వరుణ్‌కు చెల్లెలంటే చాలా ఇష్టం.కాని రామారావు ట్రయినింగ్ వల్ల అది పెత్తనపు ఇష్టంగా ఉన్మాద ఇష్టంగా మారింది.చెల్లెలి మీద ఎప్పుడూ నిఘా పెట్టి ఉంటాడు. ఆ అమ్మాయి వేసుకునే బట్టలు, తినే తిండి, ఎవరితో మాట్లాడుతోందీ అన్నీ పట్టించుకుంటాడు. ఆదివారం పూట స్నేహితురాలి ఇంటికి వెళతానన్నా కూడా తనే వెళ్లి అక్కడ ఉన్నది స్నేహితురాలేనని కన్ఫమ్ చేసుకొని దింపి వస్తాడు.అంత వరకూ సరే కాని అతడు తన జీవితాన్ని కూడా చెల్లెలికి అనువుగా మార్చుకున్నాడు.
చెల్లెలు ఒక్కతే అయిపోతుంది కనుక చెల్లెలి కోసం టైమ్ స్పెండ్ చేయడం మొదలెట్టాడు. చెల్లెలితో ఆడటం, కబుర్లు చెప్పడం, హోమ్ వర్క్ చేయించడం... ఇరవై నాలుగ్గంటలూ అన్నయ్య పక్కనే పడగ నీడలా ఉంటే శ్వేతకు ఊపిరి ఆడటం లేదు.‘అమ్మా... అన్నయ్య నన్ను విసిగిస్తున్నాడు’ అని తల్లితో చెప్పుకుంది.‘వాడంతేనమ్మా. వాడికి నువ్వంటే ప్రేమ’ అంది తల్లి.‘నాన్నా... అన్నయ్య నన్ను ప్రతిదానికీ క్వశ్చన్ చేస్తున్నాడు’ అంది తండ్రితో.‘మంచిదే కదమ్మా. వాడు నీ అన్నయ్య. నీ విషయాలన్నీ వాడే కదా చూసుకోవాలి’రాత్రయితే దుప్పటి నిండుగా కప్పుకుని ఎవరి కంటా పడకుండా ఏడవడం ఒక్కటే శ్వేత చేయగలుగుతోంది.ఒక రోజు వరుణ్ ఫ్రెండ్ ఇంటి కొచ్చాడు.శ్వేత కూడా ఉంది.ముగ్గురూ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఆ ఫ్రెండ్ వెళుతూ వెళుతూ ‘నీ చెల్లెలు క్యూట్‌గా ఉంది. జాగ్రత్తరోయ్. తర్వాత ఏమనుకున్నా లాభం లేదు’ అనేసి పోయాడు.
అతడు తన పెంపకానికి తగినట్టు ఏదో వాగేసి వెళ్లుండొచ్చు. కాని వరుణ్‌కు పెద్ద అనుమానం వచ్చేసింది. అంటే తన చెల్లెలి వాలకం దారి తప్పేటట్టు ఉందా.. ఆ అమ్మాయి ఏదైనా తప్పు చేయనుందా.. ఆల్రెడీ చేసేసిందా.. అది వీడు గనగ చూశాడా.. అని లక్ష సందేహాలతో చెల్లెల్ని విసిగించడం మొదలెట్టాడు.‘చెప్పు... ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ అయ్యారా’‘బయట ఎవరితోనైనా మాట్లాడుతున్నావా’‘నాకు తెలియకుండా ఏదైనా తప్పు చేశావో’...ఈ టార్చర్ తట్టుకోలేకపోయింది శ్వేత. పద్నాలుగేళ్ల అమ్మాయి. ఎంతని భరిస్తుంది. ఏం చేయాలో తోచక కిచెన్‌లోకి వెళ్లి కత్తితో చేయి కోసుకుంది. అప్పటికి కాని ఏదో సమస్య ఉన్నట్టు తల్లిదండ్రులకు అర్థం కాలేదు. అందరూ కలిసి కౌన్సిలింగ్‌కు వచ్చారు.‘ఏం బాబూ... నీ చెల్లెలు మీ అమ్మ గర్భంలో తొమ్మిది నెలలు ఉంది కదా అప్పుడు నువ్వే మీ చెల్లెలికి కాపలా కాశావా?’ అన్నాడు సైకియాట్రిస్ట్ వరుణ్‌తో.వరుణ్ తల దించుకున్నాడు.
‘స్కూల్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉంటుంది కదా. అప్పుడు కూడా నువ్వే లోపల ఉండి కాపలా కాస్తున్నావా?’ అడిగాడు మళ్లీ.వరుణ్ ఏమీ బదులు పలకలేదు.‘మగాళ్లు కాపలా కాస్తేనే మగాళ్లు తోడుగా ఉంటేనే మగాళ్లు అనుక్షణం కనిపెట్టుకొని ఉంటేనే ఆడవాళ్లు అన్ని పనులు చేయగలరనే మైండ్ సెట్ మీలో ఉండటం తప్పు రామారావు గారూ. దానినే మీ అబ్బాయి అంది పుచ్చుకున్నాడు. అతనికి ఆడవాళ్ల మీద పూర్తి స్థాయి అపనమ్మకాన్ని మీరు నూరిపోశారు. ఆ జాడ్యం అతడిలో ఎంతవరకు వెళ్లిందంటే మీ అమ్మాయి పీల్చే గాలిని కూడా అతడు పరీక్షించాలనుకుంటున్నాడు’ అన్నాడు సైకియాట్రిస్ట్.‘స్త్రీలను గౌరవించడం ముందు నేర్చుకోండి మీ ఇద్దరూ. వారు బుద్ధి, జ్ఞానం ఉన్న మనుషులే అని, వారు తమకు ఏది మంచో ఏది చెడ్డో ఎంచుకునే తెలివి ఉన్న మనుషులే అని గ్రహించండి ముందు. నడిస్తే ఎక్కడ పడిపోతారో అన్న అనుమానంతో అసలు మీరు నడవకుండా కళ్లకే గంతలు కట్టేస్తున్నారు.
మీ వైఫ్‌కు తప్పదు. ఎంతో కొంత అడ్జస్ట్ అవుతారు. కాని ఎదగాల్సిన ఆడపిల్ల. మీరిలా టార్చర్ పెడితే తట్టుకోగలదా’ అన్నాడు సైకియాట్రిస్ట్.‘శ్వేతను మంచి చదువు చదివిస్తున్నారు. కాని మంచి పెంపకం అనుకుని జైలు పెంపకం ఇస్తున్నారు. ఆ అమ్మాయిని కొంచెం వదిలిపెట్టండి. ఆమె తనకు తానుగా మంచి చెడులను తెలుసుకోనివ్వండి. ఆమెకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు మీరిద్దరూ ఉంటారన్న ధైర్యం ఇచ్చి ఆమెను ముందుకు అడుగులు వేయనీయండి. తన గుంపుతో కలవని జంతువు కూడా మూగదైపోతుంది. సాటి వయసున్న అబ్బాయిలతో అమ్మాయిలతో కొద్ది స్నేహం, సఖ్యత లేకపోతే మీ అమ్మాయి ఏం కావాలి?’ అన్నాడాయన.‘చూడు బాబు. నీ చెల్లెలు నీతో టైమ్ స్పెండ్ చేస్తే బాగుండు అన్న విధంగా ఉండు. నీతోనే టైమ్ స్పెండ్ చేయాలా అని విసుక్కునేలా ఉండకు’ అన్నాడు.తండ్రీ కొడుకులకు సమస్య కొద్దో గొప్పో బుర్రకెక్కింది.మరో వారం తర్వాత స్కూలు విడిచినప్పుడు చెంగు చెంగున ఎగురుతూ హుషారుగా సీట్లో కూలబడిన అమ్మాయి శ్వేత అనే మీరు గమనించి తీరుతారు.
కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్
Comments
Please login to add a commentAdd a comment