ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. ఆ కార్మికులలో యూపీలోని మీర్జాపూర్ నివాసి అఖిలేష్ కుమార్ ఒకరు. ఈయన బయటకు వస్తున్నాడని తెలియగానే అతని కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. కాగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా బయటపడాలని కోరుకుంటూ గత 17 రోజులుగా పలు ప్రాంతాల్లో పూజలు నిర్వహించారు.
ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం కార్మికులందరినీ సొరంగం నుంచి బయటకు తీసుకువచ్చారు. కార్మికులంతా బయటకు వస్తున్నారని తెలియగానే అఖిలేష్ కుటుంబం సంతోషంలో మునిగితేలింది. ఈ సందర్భంగా అఖిలేష్ తల్లి మీడియాతో మాట్లాడుతూ ‘ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు.. మేము పగలు, రాత్రి దేవుణ్ణి ప్రార్థించాం. భగవంతుడా నా కుమారుడు బయటపడేలా చూడు అని వేడుకున్నాం’ అని తెలిపారు. కాగా ఆమె తన కుమారుడు సొరంగం నుంచి బయటపడిన సంతోషంలో ఇంటి చుట్టుపక్కల వారికి స్వీట్లు పంచారు. తన కుమారునికి పునర్జన్మ లభించిందని ఆమె కనిపించిన అందరికీ చెబుతున్నారు.
ఈరోజు ఇంటిలో సంతోషకరమైన వాతావరణం నెలకొందని అఖిలేష్ తండ్రి మీడియాకు తెలిపారు. ‘గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేవుడు కరుణించి మా పిల్లలను బయటకు పంపించాడు. ఈ ప్రమాదం కారణంగా మా ఇంటిలో దీపావళి బోసిపోయింది. ఇప్పుడు మేము ఇంటిలో దీపావళి చేసుకుంటాం. క్రాకర్లు పేల్చి, స్వీట్లు పంచుకుంటాం’ అని ఆనందంగా తెలిపారు.
మంగళవారం సాయంత్రం 7.50 గంటల ప్రాంతంలో మొదటి కార్మికుడిని సొరంగం నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆ తరువాత కార్మికులంతా ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. కార్మికులందరూ పూర్తి ఆరోగ్యంతొ ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కార్యకలాపాలను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర మంత్రి బికె సింగ్ పర్యవేక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా కార్మికులతో ఫోన్‌లో సంభాషించారు.
ఇది కూడా చదవండి: టన్నెల్ రెస్క్యూలో కీలకంగా హైదరాబాద్ సంస్థ
Comments
Please login to add a commentAdd a comment