ఆటలు.. వికాసానికి బాటలు
కేరెంటింగ్
‘‘హోమ్ వర్క్ ఎందుకు చెయ్యలేదు? చెయ్యి చాచు’’ అంటూ బెత్తంతో అవతలి వారి చేతిలో దెబ్బ వేసే బుల్లి టీచర్లనో, ఇయర్ ఫోన్లో, ఉత్తుత్తి స్టెతస్కోపో చేత పుచ్చుకుని, అవతలి వారి గుండెను పరీక్షించే చిన్నారి డాక్టర్లనో, డిష్యూం డిష్యూం అంటూ ఫైటింగ్ చేసే చిన్నారి కథానాయకుడినో చూస్తే భలే ముచ్చటేస్తుంది కదూ! అలాగే ఉత్తుత్తి గిన్నెల్లో ఉట్టుట్టి పప్పు, కూర, పులుసు, స్వీట్లు వండి, ఉట్టుట్టి కంచాల్లో కొసరి కొసరి వడ్డన చేసే చిన్నారి తల్లుల్ని చూసినా కడుపు నిండిపోతుంది. ఇంకా బస్ కండక్టర్‌లా టికెట్లు చించి ఇచ్చే ఆటను కూడా పిల్లలు బాగా ఇష్టపడతారు. అప్పట్లో చిన్నారులే పెళ్లి పెద్దలుగా మారి, బొమ్మల పెళ్ళిళ్లు చేసేవారు. పిల్లలు ఆడుకునే ఇటువంటి ఆటలనే రోల్ ప్లేయింగ్ గేమ్స్ అంటారు. ఇలా రోల్ ప్లే గేమ్స్ ఆడుకుంటూ పెరిగే పిల్లల్లో పెద్దయ్యాక నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయని, ఇలాంటి గేమ్స్ ఆడటం వల్ల వారిలో మేధోవికాసం కనిపిస్తుందని పిల్లల మనస్తత్వ నిపుణులు అంటున్నారు.
ఎందుకంటే ఊహాకల్పన విద్యకన్నా, విజ్ఞానం కన్నా గొప్పది. విద్యకు, విజ్ఞానానికి ఎల్లలు ఉంటాయేమో కానీ, తలపులకు తలుపులు ఉండవు. ఊహలు రెక్కలు కట్టుకుని ప్రపంచమంతా పర్యటిస్తాయి. చిన్నప్పుడు ఇలాంటి ఆటలు ఆడుతూ పెరిగిన పిల్లలు పెద్దయ్యాక మంచి ప్రతిభావంతులవుతారట. సమాజంలో తొందరగా కలిసిపోతారట. ఉత్తమ పౌరులుగా రూపుదిద్దుకంంటారట! సమష్టిగా చేసే పనుల్లో మంచి పాత్ర పోషించగలరట. ఇవన్నీ ఉట్టుట్టికే గొప్పకోసం చెప్పుకుంటున్న మాటలు కావు.. బాలల వ్యక్తిత్వ వికాస శిక్షకుడు, అమెరికాకు చెందిన సుప్రసిద్ధ మనస్తత్వ నిపుణుడు గ్రాన్‌విల్లే స్టాన్లీ హాల్ అనేక పరిశోధనల అనంతరం వెలిబుచ్చిన అభిప్రాయాలే సుమీ!
రోల్ ప్లే గేమ్... సాధారణ పరిభాషలో చెప్పుకోవాలంటే దొంగా పోలీసాట లేదా అమ్మా నాన్నా ఆట అని చెప్పుకోవచ్చు. డ్రాయింగ్ మాస్టర్లుగా, హీరోలుగా, విలన్లుగా... డాక్టర్లుగా, లాయర్లుగా, టీచర్లుగా.. ఇలా వారు ఆడే ఆటలను బట్టి వారిలో మానసిక వికాసం ఉంటుందట. అందుకే పెద్దవాళ్లు తమ పిల్లలు విడియోగేమ్సో, సెల్‌ఫోన్లో స్కోరింగ్ గేమ్సో ఆడుతుంటే చూసి మురిసిపోవద్దు. చక్కగా రోల్ ప్లే గేమ్ ఆడేందుకు ప్రోత్సహించండి. ఏ సూపర్ మార్కెట్‌కో, పోలీస్ స్టేషన్‌కో, డాక్టర్ దగ్గరకో వెళ్లినప్పుడు వారు అక్కడి వాతావరణాన్ని, మనుషులను నిశితంగా గమనించి, ఇంటికొచ్చిన తర్వాత తమ తోటిపిల్లలతో వారిలాగే ఆటలు ఆడటం మొదలు పెడతారు. అటువంటప్పుడు వారిని కసురుకోకుండా, దూరంగా ఉండి గమనిస్తూ ఉండండి. ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దాలి. అదేవిధంగా చిన్నారులను ఏ సూపర్ మార్కెట్‌కో, షాపింగ్ మాల్స్‌కో తీసుకె ళుతుంటారు కదా.. ఇంటి కి వచ్చాక వారిని అక్కడ ఏమేమి గమనించారో చెప్పమనండి. చేతికి కాగితం, కలం ఇచ్చి వారు గమనించిన వాటి జాబితా రాయమనండి. ఉత్సాహంగా ముందుకొస్తారు.
‘‘రోల్ ప్లే గేమ్స్ వల్ల పిల్లల్లో సంభాషణా చాతుర్యం పెరుగుతుంది. భాషాపరమైన అభివృద్ధి కలుగుతుంది. భిన్న సంస్కృతులకు త్వరగా అలవడతారు. అవతలివారు చెప్పే దాని మీద దృష్టి పెట్టడం నేర్చుకుంటారు. తమ భావాలను చక్కగా వ్యక్తం చేయగలుగుతారు’’ అని బాలల మనస్తత్వ శాస్త్రవేత్తలు ముక్తకంఠంతో చెబుతున్నారు. మనం వారి మాటలను చెవిన వేసుకుందాం. మన పిల్లలను ఆ ఆటలు ఆడేలా ప్రోత్సహిద్దాం.