కత్తెర చేతికి చిక్కని వేటూరి చమక్కు
కొత్త పుస్తకం
సినిమాకు పబ్లిసిటీ
ఆరో ప్రాణం... కానీ, దాని వెనక శ్రమ మాత్రం అన్ని ప్రాణాలూ తోడేసేంత. ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చు కొని పబ్లిసిటీ నుంచి ప్రొడక్షన్ దాకా 40 ఏళ్ళలో 300 చిత్రాలకు శ్రమించిన సినీజీవి ప్రమోద్ కుమార్.
ఆయన జ్ఞాపకాల నుంచి మచ్చుకు రెండు...
గోపాలకృష్ణ ప్రొడక్షన్సు హేమాంబరధరరావు దర్శకత్వంలో కె. గోపాలకృష్ణ నిర్మించిన ‘కథానాయకుడు’. తరువాత కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు, తమిళనాడుకు ముఖ్యమంత్రులైన ఎన్.టి. రామారావు, జయలలితలు ఆ చిత్ర నాయకుడు, నాయికలు. ఓ సోషల్ సెటైర్‌గా రూపొందిన చిత్రం అది. కొద్ది ప్యాచ్‌వర్క్ మినహా చిత్రీకరణ పూర్తయింది. 1969 ఫిబ్రవరి 3 నుండి 6 వరకూ ఫినిషింగ్ కాల్‌షీట్లిచ్చారు, ఎన్.టి.ఆర్, జయలలితలు. కానీ, హఠాత్తుగా ఓ పిడుగులాంటి వార్త. అప్పటికే అనారోగ్యంతో స్టాన్లీ హాస్పిటల్లో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ‘అన్నాదురై’ కన్నుమూశారు. ఒక్కమాటలో చెప్పాలంటే తమిళనాడు స్తంభించిపోయింది. నాటి రాజకీయాల్లో జయలలిత కూడా క్రియాశీలకమై ఉన్నారు. ఆ పరిస్థితులలో ‘కథానాయకుడు’ ఫినిషింగ్ పాచ్‌వర్క్ జరపటం అసాధ్యం. కానీ పిక్చర్‌కు రిలీజ్ డేటు ఇచ్చేశారు. ఆనాటి విషాదంతో జయలలిత కూడా సినిమా కార్యక్రమాలలో పాల్గొనే పరిస్థితి లేదు. అయితే ఎన్.టి.ఆర్. కాల్షీట్లు 6వ తారీఖు వరకే ఉన్నాయి. అది తప్పితే ఆరు నెలల వరకు కాల్షీట్లు లేవు. దర్శక నిర్మాతలకు ఏమీ పాలుపోని పరిస్థితి.
అన్నాదురై అంతిమ వీడ్కోలు.
రాజాజీ హాలులో పార్థివ దేహాన్నుంచారు. లక్షలాది ప్రజలు అశ్రుతర్పణం చేశారు. మర్నాడు అంతిమ సంస్కారం. తరువాత శరవేగంగా బీచ్‌లో సమాధి నిర్మాణం వెంటవెంటనే జరిగాయి. ఫిబ్రవరి 6న తమిళనాట ఉన్న సినీ రాజకీయ ప్రముఖులతోపాటు ప్రజలంతా కాలినడకన అన్నాదురై సమాధికి అంజలి ఘటించే కార్యక్రమం. జయలలిత టి.నగర్‌నుండి బీచ్ వరకూ నడిచే వెళ్ళారు. ఇక్కడ దర్శక నిర్మాతల టెన్షన్. గంట గంటకూ ఎన్.టి.ఆర్. ఫోను! ఆయన కూడా నిస్సహాయులే! అయితే మధ్యాహ్నం 3 గంటలకు జయలలిత ప్రసాద్ స్టూడియోకి వచ్చారు. ఎంతో శ్రమదమాదులకోర్చిన పిమ్మట షూటింగ్‌కు హాజరవటం ఆమె కమిట్‌మెంట్.
తీయవలసినవి 52 బిట్లు. నిర్మాతకు చెమట్లు! కెమెరామెన్ స్వామికి ఎన్.టి.ఆర్.తో ఇదే తొలి సినిమా. గోపాలకృష్ణ కెమెరామెన్ వి.ఎస్.ఆర్. స్వామి మీదనే భారం వేసి రాత్రి 12 గంటలకు పూర్తి చేయవలసినదిగా అభ్యర్థిస్తూ ఆయనకు ఓ ఫియట్ కారు బహుమతిగా ఇస్తానన్నారు. ఇహ చూసుకోండి. సహజంగానే స్వామి చాలా స్పీడు - ఓ పక్కన రోప్ మీద నుండి జారుతూ (క్రేన్ ఉపయోగించే టైమ్ లేదు) మరో పక్క ట్రాలీలు, క్లోజ్ షాట్స్! అన్నింటిని కచ్చితంగా రాత్రి 12 గంటలకు పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టి స్థిమిత పడ్డారు. అనుకొన్నట్లే ఫిబ్రవరి 27న సినిమా రిలీజైంది. హిట్టయింది.
ఆ తరువాత పదేళ్ళకు రోజా మూవీస్ పతాకంపై రూపొందిన ‘వేటగాడు’ ఓ సంచలనం. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్.కు జోడీగా శ్రీదేవి నటించారు. మద్రాసులోని ఏ.వి.యం. 5వ ఫ్లోరులో రెయిన్ సాంగ్ చిత్రీకరణ. వాటర్ (టాప్) స్పింక్లర్స్‌తో పాటు చిన్న పాండ్ సెట్. హుషార్‌గా షూటింగ్ జరిగింది.
‘‘ఆకుచాటు పిందె తడిసే, కోకమాటు పిల్ల తడిసే’’ మూడు రోజులు ఈ రెయిన్ సాంగ్ అత్యద్భుతంగా రూపొందింది. ప్రజాదరణ విశేషంగా పొందిన ఈ ‘వేటగాడు’ చిత్రంలో ఈ రెయిన్ సాంగ్ ఓ ప్రత్యేక ఆకర్షణ. అప్పట్లో సెన్సార్‌వాళ్లు చూచి ఆనందిస్తూనే, కొర్రీలు వేయకపోతే ‘‘తప్పవుతుందన్న’’ ఉద్దేశంతో తమ ప్రతాపం చూపెట్టారు. ‘‘ఆకుచాటు పిందె తడిసె కోకమాటు పిల్ల తడిసె’’ అన్న మాటలకు సౌండ్ కట్ చేయాలి లేదా మరో మాటతో సౌండ్ రిప్లేస్ చేయమన్నారు. రాఘవేంద్రరావుగారు నా వంక చూసి ‘‘పట్టుకో, వేటూరిని పట్టుకో... పట్టుకురా.. ఆల్టర్‌నేటివ్ మేటరు, అర్థం మారగూడదు’’ అన్నారు. వేటూరి గారు ఎక్కడున్నారని వెదికితే ట్రస్టుపురంలో ఏడిద నాగేశ్వరరావు ఆఫీసులో ‘శంకరాభరణం’ చిత్రానికి పాటలు రాస్తున్నారు. వేటూరికి విషయం చెప్పాను. ‘ఏవండీ ఈ సెన్సారు వాళ్లు నా పాటలో, జయమాలిని ఆటలో కట్‌లు చెప్పకుండా ఉండర’ని నవ్వుకున్నారు.
ఆ బిట్ ప్లేస్‌లో ‘కొమ్మచాటు పువ్వు తడిసె’ అని మార్చి రాసి, అయిదే నిమిషాల్లో ఇచ్చి పంపారు సరస్వతీ తనయుడు వేటూరి. ఆ బిట్‌తో చక్రవర్తి రికార్డ్ చేశారు. సెన్సార్‌వారికి కట్స్ ఇచ్చేశా. సెన్సార్ సర్టిఫికెట్ నేనే తెచ్చా. 1979 జూలై 5న ‘వేటగాడు’ విడుదలై స్వైర విహారం చేసింది.