నవరాత్రుల బొమ్మల కొలువుకు తమిళనాట అధిక ప్రాధాన్యత ఉంది. చెన్నైలోని ప్రముఖ పారిశ్రామికవేత్త అభిరామి రామనాధన్ అయితే ఏటా తన నివాసంలో ఏకంగా బంగారు బొమ్మల్ని కొలువు తీరుస్తారు! వాటిల్లో కాంస్య విగ్రహాలు బంగారు తాపడంతో ఉంటాయి. వాటికి బంగారు నగలు అలంకరించి ఉంటాయి. అన్నపూర్ణాదేవి ప్రధానాంశంగా అన్నీ బంగారు తాపడంతో చేసిన విగ్రహాలనే కొలువులో ఉంచటం, వాటికి బంగారు ఆభరణాలను అలంకరించటం వాళ్లింటి ప్రత్యేకత. ఐదు వరుసలలో కొలువుదీరి బంగారు వర్ణంతో తళతళ మెరుస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ విగ్రహాలు గతవారం రోజులుగా సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి.
మైలాపూరులోని తమ నివాసంలో రామనాధన్ సతీమణి నల్లమ్మై రామనాధన్ కొలువు దీర్చిన ఈ విగ్రహాలకు మరో ప్రత్యేకతా ఉంది. ఇవి నిత్యం వాళ్ల పూజా మందిరంలో పూజలు అందుకునే ఉత్సవ విగ్రహాలే. ఏడాదికి ఒక బంగారు తాపడంతో కూడిన కాంస్య విగ్రహాన్ని కొనుగొలు చేసి ఏటా ఇలా బొమ్మల కొలువులో ప్రత్యేక అలంకారాలతో బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు ఈ దంపతులు. ఈ ఏడాది నాలుగు వరుసల్లో వివిధ రకాల దేవతా మూర్తులు ఇక్కడ కొలువుదీరారు. నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు అందుకునే ఈ బొమ్మల కొలువు చెన్నైలో ఇప్పుడు అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment