
చాక్లెట్‌తో గుండెజబ్బులు దూరం...
కొత్త పరిశోధన
చిన్నారుల నుంచి పెద్దవారి వరకు అందరూ చాక్లెట్‌ను ఇష్టపడతారు. అయితే, బరువు పెరుగుతామనే భయంతో పెద్దవాళ్లలో చాలామంది చాక్లెట్ జోలికి పోవాలంటే వెనుకాడుతారు. చాక్లెట్ తినడానికి భయపడాల్సిందేమీ లేదని, పైగా రోజూ చాక్లెట్ తింటే గుండెజబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్కాట్లాండ్‌లోని అబెర్డీన్ వర్సిటీకి చెందిన పరిశోధకులు దాదాపు 21 వేల మందిపై గడచిన పన్నెండేళ్లలో నిర్వహించిన పరిశోధనలు చాక్లెట్‌లోని సుగుణాలను నిగ్గు తేల్చాయి. చాక్లెట్ రుచి చూడని వారితో పోలిస్తే అడపా తడపా చాక్లెట్‌ను ఆస్వాదించే వారికి గుండెజబ్బులు వచ్చే అవకాశాలు 11 శాతం వరకు తక్కువగా ఉంటాయని, క్రమం తప్పకుండా రోజూ చాక్లెట్ తినే వారికి గుండెజబ్బుల ముప్పు 25 శాతం వరకు తగ్గుతుందని, అలాగే మరణానికి దారితీసే జబ్బులు వచ్చే అవకాశాలు 45 శాతం మేరకు తగ్గుతాయని ఈ పరిశోధనల్లో తేలింది.