సందేహాల ప్రదక్షిణ!
దేవుడిపై సందేహాలు రావడం పాపమూ కాదు. సందేహాలను సహించలేకపోవడం దైవభక్తీ అయిపోదు.
దేవుడున్నాడా లేడా? దెయ్యాలు నిజంగానే ఉన్నాయా? ఈ మహావిశ్వాన్ని వీక్షిస్తున్న మనిషికి ఆది నుంచీ ఉన్న ప్రాథమిక సందేహాలు ఈ రెండూ. ఇవికాక ఇంకా లక్షప్రశ్నలు, యక్షసందేహాలు! అయితే అవన్నీ కూడా దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నవే. ఒకవేళ దెయ్యాలు నిజంగానే ఉన్నాయని రూఢీ అయినా అవేమీ వరాలిచ్చేవీ, కష్టాలను గట్టెక్కించేవీ కాదు కాబట్టి, వాటి జోలికి మనుషులు వెళ్లే ప్రసక్తే లేదు. పైగా ‘పట్టి పీడించడం’ వాటి వృత్తిధర్మం కనుక వీలైనంతగా వాటికి దూరంగా ఉంటాం. అయినా మనుషుల్లోనే నిత్యం ఎంతోమంది పీక్కుతినేవారినీ, పీడించేవారినీ చూస్తూ కూడా దెయ్యాలంటే భయపడేవారు ఎవరుంటారు?!
దేవుడున్నాడా లేడా అని సందేహపడడంలో ‘లేకపోతే ఎలా?’ అనే భయం ఉంది. దెయ్యాలు నిజంగానే ఉన్నాయా అనుకోవడంలో ‘ఉంటే మాత్రం ఏమైంది?’ అనే ధైర్యం ఉంది. అందుకేనేమో ప్రతిదానికీ మనం దెయ్యాన్ని వదిలేసి, దేవుడి మీద పడిపోతుంటాం. చంటిపిల్లలు... ఇంట్లోకి వస్తున్న నాన్న మీదికి ఎగబాకినట్టు, ఇంటిపనిలో ఉన్న అమ్మ ఒడిలోకి పరుగున వచ్చి ఒక్క గెంతుతో దూకేసినట్లు దేవుడిని ఆక్రమించుకుంటాం. అవివ్వమనీ, ఇవివ్వమనీ నస పెడతాం. అదివ్వలేదేం? ఇదివ్వలేదేం? అని రాగం తీస్తాం.
‘నీకోసం హోమ్‌వర్క్ అంతా కంప్లీట్ చేశాను కదా, వేమన పద్యాలన్నీ అప్పజెప్పాను కదా, పదమూడో ఎక్కం కూడా నేర్చుకున్నా కదా, ప్లే స్టేషన్ ఎప్పుడు కొనిస్తావ్’ అని పిల్లలు అడిగినట్లు... రోజూ తెల్లవారుజామునే చన్నీళ్ల స్నానం చేస్తున్నాను కదా, టెంకాయలు కొడుతున్నాను కదా, ఉపవాసాలు ఉంటున్నాను కదా... అన్నీ మర్చిపోయావా అని ఆక్రోశిస్తాం.
‘భక్తతుకారాం’లో అక్కినేని అడిగినట్లు ‘చేసిన మేలును మరిచేవాడా నువ్వా దేవుడివీ... నువ్వొక వ్యర్థుడివి’ అని దుఃఖపడతాం. చివరికి... ఉన్నావా? అసలున్నావా? అని మొదటికొచ్చేస్తాం! మన తప్పు మాత్రం ఏముంది? దేవుడు ఉన్నాడని అనుకోబట్టే కదా, ‘ఉన్నాడా?’ అనే సందేహం. ఇలాంటి సందేహంతోనే ఓసారి ప్రఖ్యాత బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ విశ్వరహస్యాలపై కాల్‌టెక్ (కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అయితే ఆ సందేహం ఆయనకు, దేవుడిని నమ్మడం వల్ల కలిగినది కాదు.
దేవుడిపై తనకు నమ్మకం లేదని చెప్పడానికి తనకు తానుగా సృష్టించుకున్న సందేహం. వాట్ వాజ్ గాడ్ డూయింగ్ బిఫోర్ క్రియేషన్? అంటాడు స్టీఫెన్. విశ్వాన్ని సృష్టించడానికి ముందు దేవుడు ఏం చేస్తుండేవాడు? హాకింగ్ అలా అడగ్గానే అక్కడి శాస్త్ర నాస్తికులెవరో - బహుశా మనలాంటి ‘అవిశ్వాస తోమా’ (డౌటింగ్ థామస్) ల కోసం నరకాన్ని నిర్మిస్తూ ఉండివుండొచ్చని పెద్దపెట్టున నవ్వారు. మళ్లీ ఇంకో సందేహం. ‘నరకం అనేది దెయ్యాల సామ్రాజ్యం కదా, దాంతో దేవుడికేం పని?’
నమ్మకం ఉన్నచోటే సందేహమూ ఉంటుంది. ప్రేమ ఉన్నచోటే అనుమానం ఉంటుందని నిరీశ్వరత్వం నుంచి మేల్కొని అరుణాచలానికి చేరుకున్న చలం అన్నారు కదా! అలా ఉన్నదా అని సందేహించడం నమ్మకం వల్లనే. ఎన్ని సందేహాలుంటే దైవదర్శనానికి అన్ని మెట్లు ఎక్కినట్లు. సందేహాలు దెయ్యాలవంటివైతే దైవసాక్షాత్కారం కోసం వాటితో చెలిమి చెయ్యడమూ దైవకార్యమే. అర్చనలో భాగమే.