
వేళ్లు చిటపటమనడం ఆర్థరైటిస్ రావడానికి చిహ్నమా?
ఓ గంట ఏకబిగిన పని చేస్తే వేళ్లు పట్టేసినట్లుంటాయి. రెండు చేతులను వేళ్లను ఇంటర్‌లాక్ చేసి వెనక్కి విరిస్తే టపటపమని చిరు టపాకాయల్లా పేలుతాయి. దాంతో కీళ్లు హాయిగా అనిపించి మళ్లీ పనిలో పడుతుంటాం. అయితే ఇలా కీళ్ల దగ్గర పట్టేయడం, విరిస్తే పటపటమనడం వంటి లక్షణాలు ఆర్థరైటిస్ వ్యాధికి సూచనలు అని కొందరు భయపడుతుంటారు.
ఇది కేవలం అపోహ మాత్రమే. వేళ్ల కణుపుల దగ్గర సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. వేళ్లను లాగినప్పుడు ఈ ఫ్లూయిడ్ కీళ్ల మధ్య సరిగ్గా విస్తరిస్తుంది, ఈ ఫ్లూయిడ్‌తోపాటుగా కణుపుల దగ్గర నైట్రోజెన్ వాయువుతో నిండిన చిన్నచిన్న బుడగలు ఉంటాయి. వేళ్లను విరిచినప్పుడు ఆ బుడగలు పేలినట్లవుతాయి. మనం వినే శబ్దం ఆ బుడగలు పేలినప్పుడు వచ్చేదే. ఇది ఆర్థరైటిస్‌కు దారి తీసే పరిణామం ఎంత మాత్రమూ కాదు.