చీకట్లో చిత్రదీపం! | Citradipam darkness! | Sakshi
Sakshi News home page

చీకట్లో చిత్రదీపం!

Published Thu, Jan 2 2014 12:47 AM | Last Updated on Mon, Aug 20 2018 4:42 PM

చీకట్లో చిత్రదీపం! - Sakshi

చీకట్లో చిత్రదీపం!

ఏడు సంవత్సరాల క్రితం... బ్రిటన్ ఆర్టిస్ట్ అర్థర్ ఎలీస్‌కు అందరిలాగే  వస్తువులు కనిపించేవి. అందరు ఆర్టిస్ట్‌ల మాదిరిగానే  ఆకర్షించి  ఆకట్టుకునే దృశ్యాలను చిత్రమయం చేసేవారు. కానీ, ఆయనకు ఇప్పుడు చూపు లేదు. వెలుగు లేదు. అంతమాత్రాన ఆయనేమీ నిరాశలో కూరుకుపోలేదు. కుంచెకు సెలవివ్వలేదు.
 
 తనకంటూ ఒక సరికొత్త మనోప్రపంచం ఏర్పరచుకున్నాడు. ఆ ప్రపంచంలో తనకు కనిపించే వినూత్నమైన దృశ్యాలను చిత్రాలుగా మలుస్తున్నాడు. ఒకప్పుడు ప్రింటింగ్ ఇండస్ట్రీలో పని చేసిన అర్థర్ తన అధివాస్తవిక చిత్రాలతో కళాభిమానులను ఆకట్టుకున్నాడు. ఆయనకు ప్రయోగాలు చేయడం కొత్తేమీ కాదు. అయితే ఇప్పుడు పనిగట్టుకొని ప్రయోగాలు చేయనక్కర్లేకుండానే ఆయన మనోసీమ నుంచి కొత్త కొత్త చిత్రాలు కుంచెలోకి దిగుమతి అవుతున్నాయి. అవి అంతకు ముందు గీసిన చిత్రాల కంటే పూర్తి భిన్నంగా ఉంటాయి.
 
 ఒకప్పుడు చావు అంచుకు వరకు వెళ్లివచ్చిన అర్థర్ తన జీవితంలో కొత్త అర్థాన్ని వెదుకుతున్నాడు. తన జీవనోత్సాహానికి కావల్సిన ఇంధనాన్ని ‘కళ’ నుంచి సంపాదిస్తున్నాడు.
 
 అంధత్వం పరిచయం అయిన తొలిరోజులలో వింత, వికృత దృశ్యాలతో అతని మనసు కల్లోలంగా ఉండేది.
 
 పడుకుంటే చాలు తన పక్కన పాములు కదలాడినట్లు అనిపించేది. తెగిన మనిషి మొండెం తన ముందు రక్తసిక్తంగా కనిపించేది. అతని మనో యవనికలో కనిపించే సోఫా కొద్దినిమిషాల్లోనే విమానంగా మారిపోయేది. ఇలా ఎన్నో వింతలు! బ్రెయిన్‌లో ఆప్టికల్ నర్వ్ డ్యామేజి వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది.
 
  ఒక దశలో అయితే ‘‘నాకు పిచ్చి పట్టదు కదా!’’ అనే సందేహం కూడా అర్థర్‌కు వచ్చింది. ఆ దృశ్యాలకు అలవాటు కావడానికి కొంత కాలం పట్టింది.
 ‘‘నా బ్రెయిన్ నా మీద ఎన్నో ట్రిక్స్‌ను ప్లే చేస్తుంది’’ అని సరదాగా చెప్పే అర్థర్ ఆ ట్రిక్‌లకు తనదైన రీతిలో సమాధానం చెబుతున్నాడు.
 
 లోకం ‘సిండ్రోమ్’ అనుకునేదాన్ని తాను అనుకోవడం లేదు. పైగా తాను సర్రియలిజంలో సంచరిస్తున్నాని చెబుతాడు.  కేవలం మానసికసంతృప్తికి  మాత్రమే పరిమితం కాకుండా తన చిత్రాలను ప్రొఫెషనల్ ఎగ్జిబిషన్‌లో అమ్మకానికి పెడుతున్నాడు. బొమ్మల విషయంలో మిత్రులు, కుటుంబసభ్యుల అభిప్రాయాలను, సలహాలను తీసుకుంటాడు.‘‘నా వర్క్ ఎంతో మందిని ఇన్‌స్పైర్ చేస్తుందని చాలామంది అంటుంటారు. ఇది  విన్నప్పుడల్లా నాలో ఉత్సాహం రెట్టింపు అవుతుంది’’ అంటున్నాడు అర్థర్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement