
సాక్షి చైర్ పర్సన్ వైఎస్ భారతితో సమంత ఆత్మీయ కరచాలనం. చిత్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మంజుల
హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో సోమవారం సాయంత్రం సాక్షి సిటీ ప్లస్ అనుబంధం ఏర్పాటు చేసిన ‘సిటీ ఆఫ్ ఛారిటీ’ ఇష్టాగోష్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ నటి సమంత ఛారిటీ అనే పదానికి కొత్త అర్థాన్ని ఇచ్చారు. ‘‘సాయపడుతున్నవారిని ప్రోత్సహించినా, సాయం చేస్తున్నవారి చిరునామా చెప్పినా చాలు... అది కూడా పెద్ద సాయమే’’ అన్నారు. వార్తా కథనాలతో సరిపెట్టకుండా పదిమంది సేవాతత్పరులను ఒకచోట కలిపి పరస్పర సహకారానికి నాంది పలుకుతున్న సాక్షికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలు సేవా సంస్థల నిర్వాహకులు తమ మనోభావాల్ని సాక్షితో పంచుకున్నారు.
సదా మీ సేవలో...
ఇటీవల సాక్షి సిటీ ప్లస్‌లో ‘సిటీ ఆఫ్ ఛారిటీ’ పేరుతో పదిహేడు కథనాలు ప్రచురితమైయ్యాయి. దానికి ‘సదా మీ సేవలో’ అంటూ సమంత బాసటగా నిలిచారు. ‘ప్రత్యూష సపోర్ట్’ పేరుతో గత ఏడాదిగా పేద పిల్లలకు వైద్యం, తలసేమియా బాధితులకు రక్తదానం, అనాథ పిల్లలకు ఆర్థిక సాయం చేస్తోంది ఆ సంస్థ. ప్రముఖ నటిగా క్షణం తీరికలేని సమంత, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వెనక తగిన కారణమే ఉంది.
‘‘నేను బిలో మిడిల్‌క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని. సాయం చేసే చేతులకున్న విలువ గురించి తెలుసు. ఈ ప్రపంచంలో ఒక్కశాతం మాత్రమే ధనవంతులున్నారు. మిగతా 99 శాతం ప్రజలు పేదవారే. ఈ ఒక్కశాతం ధనికులు తలుచుకుంటే మిగతా జనాభా తలరాతలు మార్చగలరని నా నమ్మకం. నేను డబ్బు, పేరు రెండూ సంపాదించాను. మిగిలింది ఆత్మతృప్తి. దానికోసమే నా ప్రయత్నం. సిటీ ఆఫ్ ఛారిటీకి బ్రాండ్ అంబాసిడర్‌గా సాక్షి సిటీ ప్లస్ నుంచి పిలుపు రాగానే ఒక్కనిమిషం కూడా ఆలోచించకుండా ముందుకు రావడం వెనకున్న కారణం కూడా ఇదే. పైగా వందకుపైగా ఎన్‌జీవోల నుంచి ఎంట్రీలు వచ్చాయని తెలిసాక ఆశ్చర్యపోయాను. ఇలాంటి ఇష్టాగోష్టి మనలో మరింత సేవాభావాన్ని నింపుతుందని ఆశిస్తున్నాను’’ అని సమంత అన్నారు.
యువత పాత్రే కీలకం...
అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ ప్రత్యేక సేవకు నడుంబిగించిన సత్యహరిచంద్ర ఫౌండేషన్ రాజేశ్వరరావు మాట్లాడుతూ...‘‘సాక్షి సేవా ప్రచారానికి నటి సమంత బాసటగా నిలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా సంస్థలో పాల్గొంటున్న యువతకు ఆమె తప్పకుండా ఆదర్శంగా నిలుస్తారు’’ అని అన్నారు. యశోదా చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గోరుకంటి రవీందర్‌రావు మాట కలుపుతూ ‘‘మనకున్నదాంట్లో కొంత తోటివారికి, పేదవారికి పంచడం త్యాగంలా భావించక్కర్లేదు, బాధ్యతగా అనుకోవాలి. అనాథపిల్లలకు ఉపాధిమార్గం చూపిస్తున్న మా సంస్థ ఉద్దేశ్యం అదే’’ అని చెప్పారు.
డబ్బులు కట్టినా ఆటలాడించే అవకాశం లేని స్కూళ్లలో, ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా ఆటలాడిస్తూ తన సేవను చాటుకుంటున్న ‘మ్యాజిక్ బస్’ సంస్థ సేవల గురించి వివరంగా చెప్పారు ఆ సంస్థ మేనేజర్ దీమంత్. ఈ సంస్థలో కూడా యువతపాత్రే కీలకం అన్నారు. స్పర్శ్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ ‘‘క్యాన్సర్ కాటుకి బలై, మృత్యువుతో పోరాడుతున్నవారు మా సంస్థలో సేదతీరుతున్నారు. ప్రేమను పంచే మా సంస్థ సేవల్ని మరింత విస్తరించాలనుకుంటున్నాం’’ అంటూ తమ ఆలోచనల్ని పంచుకున్నారు.
ఈ సంస్థలతో పాటు కృష్ణదేవరాయ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (కెఎస్‌పి), జాయ్ ఆఫ్ రీడింగ్ గ్రూప్, మేక్ ఎ డిఫరెన్స్ (మ్యాడ్), రక్షణ వెల్ఫేర్ అసోసియేషన్, స్టూడెంట్ సోషల్ సర్వీస్ (ఎస్‌ఎస్‌ఎస్), ఫ్రెండ్స్ ఫర్ సేవ , బాలసంస్కార్, సంభవామి సంస్థ, దయ ఫౌండేషన్, స్నేహదీపం, ఎ వేక్ ఓ వరల్డ్ సంస్థల నిర్వాహకులు కూడా వారి అనుభవాల్ని పంచుకున్నారు.
‘సపోర్ట్’ ఉంటుంది
ప్రత్యూష సపోర్ట్ సంస్థ కో ఫౌండర్ డాక్టర్ అనగాని మంజుల తమ సంస్థ గురించి వివరించారు. ‘‘ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థకు ప్రత్యూష సపోర్ట్ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. సమంత సేవాహృదయం నన్ను కదిలించింది. వెంటనే ఆమెతో కలిసి పనిచేయడానికి సిద్ధపడ్డాను. అవసరానికి, అవకాశానికి మధ్య వారధిగా నిలవడం కూడా ఉన్నతమైన సేవే. ఆ పనికి పూనుకున్న సాక్షికి మరొకసారి మా సంస్థ తరఫున ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను’’ అన్నారు.
ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘డాక్టర్ మంజులగారికి పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన సందర్భంగా సాక్షి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రత్యూష సపోర్ట్ సేవలతో పాటు వైద్యవృత్తిలో కూడా వారి ఆశయాలు నెరవాలని కోరుకుంటున్నాం’’ అని చెప్పారు.
ఇదే తొలిసారి...
‘‘చదువుకునే విద్యార్థి నుంచి రిటైర్ అయిన వృద్ధుల వరకూ అందరూ సేవకు సిద్దపడడం సంతోషంగా ఉంది. మీ అందరికీ సాక్షి అన్నిరకాలుగా అండగా నిలబడుతుంది. మరిన్ని సేవా సంస్థల్ని మీతో భాగస్వాముల్ని చేయడానికి మావంతు ప్రయత్నం చేస్తాం. అలాగే నటి సమంతను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. సేవకు సమయం లేదనేవారికి ఆమె ఆదర్శంగా నిలుస్తారు. అంత చిన్నవయసులో తోటివారి శ్రేయస్సుకోసం ఆమె పడుతున్న తపన నేటి యువతలో సేవాభావాన్ని నింపుతుందని ఆశిస్తున్నాను’’ అని సాక్షి ఛైర్‌పర్సన్ వైఎస్ భారతి అన్నారు.
సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ...‘‘మీలోని సేవాగుణం మరింతమందికి ఆదర్శం కావాలి. మనచుట్టూ ఉన్న స్వచ్ఛంద సంస్థలన్నింటినీ ఒక్కవేదికపైకి తేవడానికి ఇది సాక్షి వేసిన తొలి అడుగు. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది’’ అని చెప్పారు. కార్యక్రమం చివర్లో సమంత మాట్లాడుతూ...‘‘ మీ సంస్థల సేవాకార్యక్రమాల గురించి విన్నాక నాకేమనిపిస్తుందంటే.. నేను చేస్తున్న సేవా చాలా చిన్నదని. నేను ఇంకా చాలా చేయాలి. మరెంతోమందిని ఈ సేవలో భాగస్వాముల్ని చేయాలి’’ అంటూ ముగించారు.
సేవలోనే సంతృప్తి!
ఇప్పటివరకూ ఎన్నో కార్యక్రమాలకు హాజరయ్యాను. గొప్ప గొప్ప వ్యక్తుల్ని కలిసాను. కానీ ఇలా తోటివారి శ్రేయస్సు కోసం పాటుపడే పదిమంది మధ్య కూర్చోవడం ఇదే తొలిసారి. చాలా ఆనందంగా ఉంది. ఈ క్షణాలు నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. సాక్షి చేసిన ఈ ప్రయత్నానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా దృష్టిలో సంతోషం డబ్బులోను, పేరులోను ఉండదు. తోటివారికి ఎంతోకొంత సాయపడ్డామన్న తృప్తిలోనే ఉంటుంది. ఆ తృప్తి కోసమే ‘ప్రత్యూష సపోర్ట్’ నడుపుతున్నాను.
- సమంత, సినీనటి
- భువనేశ్వరి
ఫొటోలు: ఎస్.ఎస్ ఠాకూర్, జి. రాజేశ్