ముళ్ల ఒడి తల్లడిల్లుతోంది
ఢిల్లీలో రోజుకు 29 ఫైట్‌లు జరుగుతుంటాయి. అవి రాష్ట్రాలవి. ఢిల్లీలోనే 8 ఏళ్లుగా ఓ ఫైట్ జరుగుతోంది. అది ఓ తల్లిది! ఢిల్లీ నుంచి తన పల్లెకు చేరాలని ఆమె ఆరాటం. వెళ్లొచ్చుగా.. ఏముంది ఢిల్లీలో? ఢిల్లీలో ఆమె ప్రాణం ఉంది. ఆ ప్రాణం.. ఎనిమిదేళ్ల ఆమె కూతురిలో ఉంది. ఆ కూతురు.. ‘ఇల్లీగల్ అడాప్షన్’లో ఉంది! బతుకు చీకటిని తప్పించుకోడానికి చీకటి బతుకులోకి జారిపడి.. ఒడిలోని కూతుర్ని చేజార్చుకున్న ఈ ‘రెడ్‌లైట్’ బాధితురాలు ఎదుగుతున్న ఆ కూతుర్ని దక్కించుకునేందుకు... న్యాయపోరాటం చేస్తోంది. పిల్ల లేనిదే ఢిల్లీ కదలనంటోంది.
ఢిల్లీలోని రెడ్‌లైట్ ఏరియా. ‘నువ్వు నాకు నచ్చావ్! పెళ్లి చేసుకుంటా.. ఈ కూపంలోంచి బయటకు తీసుకెళ్తా!’ చెప్పాడు అతను. ‘హు..’ పేలవంగా నవ్వింది ఆమె. ‘నిజం.. ఒట్టు ... నన్ను నమ్ము’ ఆమె తల మీద చెయ్యేసి చెప్పాడు నమ్మకంగా! ‘ఆడవాళ్లనే నమ్మలేను నీ మాటెలా నమ్మాలి’.. తల మీదనుంచి చేయి తీసేస్తూ అన్నది ఆమె నిర్లిప్తంగా. ‘కానీ నన్ను నమ్ము’ నమ్మించే ప్రయత్నం చేస్తూ అతను.
‘నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లాలంటే బ్రోతల్ హౌజ్ వాళ్లకు డబ్బు కట్టాలి.. పైగా నన్ను నీ భార్యగా మీ ఇంట్లోవాళ్లు ఒప్పుకుంటారా?’ అతని కళ్లల్లోకి సూటిగా చూస్తూ ఆమె.
‘వాళ్లు అడిగినంత డబ్బు కట్టే నిన్ను విడిపించుకు వెళ్తా.. ఇక మా ఇంట్లోవాళ్ల సంగతి అంటావా... ఇది నా పెళ్లి.. నా ఇష్టం’ అని సమాధానమిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆమె పేరు సారిక.. అతని పేరు రాకేశ్! (గోప్యత దృష్ట్యా ఇద్దరి పేర్లూ మార్చాం)
ఆమెది ఆంధ్రప్రదేశ్ లోని ఓ గ్రామం. అందరి అమ్మాయిల్లాగే పెళ్లి చేసుకొని, పిల్లల్ని కని హాయిగా సంసారం చేయాలని కలలు కన్నది. అనుకున్నట్టే చక్కటి భర్త దొరికాడు. యేడాది తిరక్కుండానే పండంటి బిడ్డ పుట్టింది. ఏ చింతా లేకుండా సాగిపోతున్న కాపురం ఒక్కసారిగా కల్లోలంలో పడింది. సారిక ఎనిమిదినెలల గర్భిణిగా ఉన్నప్పుడు ఆమె భర్తకు పాము కాటుకు చనిపోయాడు. అత్తింట, పుట్టింట ఆదరణ లేక.. అనాథయింది సారిక. చేతిలో బిడ్డతో ఆ నిండుచూలాలికి దిక్కు తోచలేదు. దమ్మిడీ ఆదాయం లేక ఆ పిల్లనెలా సాకేది? ఇంకో బిడ్డనెలా కనేది? అప్పుడు వచ్చింది పక్కింటామె.
పొట్టకూటికోసం ఢిల్లీ వెళ్లి చుట్టపుచూపుగా సొంతూరుకి వచ్చిపోతూ ఉంటుంది. సారిక గురించి తెలిసి పరామర్శించడానికి ఆ ఇంటి గుమ్మంలో అడుగుపెట్టింది. ఆప్యాయంగా పలకరించింది. ఆ కాసింత ప్రేమకే కదిలిపోయింది సారిక. ఆమె ఒళ్లో తలపెట్టి వెక్కివెక్కి ఏడ్చింది. ‘పిచ్చిదానా...ఎందుకలా బాధపడ్తావ్? నేను లేనా?’ అని ఓదార్చింది. తనతోపాటు ఢిల్లీ వస్తే అక్కడ ఉద్యోగం ఇప్పిస్తానని మాటిచ్చింది. ఆశపడ్డ సారిక అంతలోనే అనుమానంతో పొట్ట మీద చేయి వేసుకుంది అనుమానంగా. సారిక ఆంతర్యం గ్రహించిన ఆమె ‘అక్కడ మంచి ఆసుపత్రిలో క్షేమంగా డెలివరీ చేయించే బాధ్యత నాది’ అంది సారిక చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ! గుండె నిండా ఊపిరిపీల్చుకుంది సారిక.
కూతురు పుట్టిన నెలకు..
అలా పక్కింటామె భరోసా మీద నాలుగేళ్ల బిడ్డతో ఢిల్లీలో ఏపీ ఎక్స్‌ప్రెస్ దిగింది సారిక. పక్కింటామె ఇంట్లోనే బసచేసింది. ఇదిగో రేపే ఓ బట్టల దుకాణంలో సేల్స్ ఉమన్‌గా ఉద్యోగంలో పెట్టించబోతున్నా. అయిదువేల రూపాయల జీతం’ అని చెప్పింది. ఏరోజుకారోజే రేపు అంటూ పదిహేనురోజులు దాటవేసింది. ‘తర్వాత డెలివరీ కానివ్వు..’ అంది. ఆ మాట అన్న పదిహేను రోజులకి సారికకు పురుడొచ్చింది. కూతురు పుట్టింది. నెలయ్యాక నెమ్మదిగా తన అసలు రంగు బయటపెట్టింది పక్కింటామె. ‘నీకు ఏ బట్టల షాపులో ఉద్యోగం లేదు. నేను చెప్పిన చోట పనిచేయాలి.
నెలకు అయిదు వేలు నాకే ఇవ్వాలి ఎందుకంటే నీ పిల్లల్లిదర్నీ నేను చేసుకోవాలి కాబట్టి’ అంటూ ఆమెను తీసుకెళ్లి ఓ బ్రోతల్‌హౌజ్‌లో పెట్టింది. సారిక పెద్ద కూతురిని గుర్‌గావ్‌లో ఉన్న ఓ గవర్నమెంట్ స్కూల్లో చేర్పించింది. రెండో కూతురిని సారిక తన ఇష్టం మీదే దత్తత ఇస్తున్నట్టు దత్తత కాగితాల మీద బలవంతంగా సంతకాలు చేయించుకుంది. అలా సారిక బలవంతంగా వ్యభిచార కూపంలోకి వచ్చిపడింది. వారానికి ఒకసారి గుర్‌గావ్ వెళ్లి పెద్దకూతురిని చూసొస్తూ ఉండేది సారిక.
కానీ ఢిల్లీలోని జీబీ రోడ్‌లో ఉన్న చిన్న కూతురి దగ్గరకే మొదట్లో రానిచ్చినా తర్వాత ఆ పిల్లను చూడనివ్వడం మానేశారు. సారిక బలవంతంగా వస్తే.. తమ మాట వినకపోతే పిల్లలిద్దర్నీ కూడా వ్యభిచారంలోకి దింపుతామని బెదిరించేవారు. ఆ భయానికి చిన్న కూతురు దగ్గరకి వెళ్లడమే మానేసింది. ఆ సమయంలోనే పరిచయమయ్యాడు రాకేశ్. ముందు విటుడుగా.. తర్వాత ప్రేమికుడిగా!
అనుకున్నట్టే పెళ్లైంది
రాకేశ్ తాను సారికకు ఇచ్చిన మాట ప్రకారం ఆమె ఉంటున్న బ్రోతల్‌హౌజ్ యజమానికి లక్షరూపాయలు చెల్లించి సారికను విడిపించాడు. పెళ్లీ చేసుకున్నాడు. అప్పుడు చెప్పింది తన లక్ష్యాల గురించి రాకేశ్‌కి. అండగా ఉంటానని మాటిచ్చాడు. రాకేశ్ సహాయంతో పెద్ద కూతురిని తేలికగానే విడిపించుకుంది. తన బిడ్డ ఇక్కడుంటే ప్రమాదమని భావించి తీసుకెళ్లి తన సొంతూర్లో తమ్ముడు, మరదలి దగ్గర పెట్టింది. కూతురి అవసరాలకోసం నెలనెలకు తమ్ముడికి డబ్బులు పంపించి కూతురిని చదివించుకుంటోంది.
రెండో బిడ్డ కోసం...
ఢిల్లీలోని తానుంటున్న రెడ్‌లైట్ ఏరియా వదలాలనుకోలేదు సారిక. ఎందుకంటే ఆ ప్రాంతం నుంచి తాను దూరంగా వెళ్లిపోతే తనను ఈ నరకంలోకి నెట్టిన వాళ్ల కదలికలు తెలుసుకోలేదు. దాంతో రెండో బిడ్డ జాడా తెలియదు. అందుకే మొండిగా అదే ప్రాంతంలో ఇంకో బ్రోతల్ హౌజ్‌లో పనిచేయడం మొదలుపెట్టింది. రాకేశ్‌తో ఇంకో కూతురూ పుట్టింది. ఓ వైపు ఆ బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటూనే తన రెండో బిడ్డ జాడ గురించి ఆరా తీయడం మొదలుపెట్టింది.
స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బిడ్డ ఆచూకీ కోసం కంప్లయింట్ ఇచ్చింది. తనను వ్యభిచారిగా మార్చిన స్త్రీ వచ్చింది. ‘ఆమె బిడ్డను ఆమెనే ఇష్టపూర్వకంగా దత్తతకు ఇచ్చింది’ అంటూ సారిక సంతకం చేసిన పత్రాలను పోలీసులకు చూపించింది. ‘ఈ సంతకం నీదేనా?’ అని అడిగారు పోలీస్ అధికారులు. పరీక్షగా చూసింది. అవును తనదే! కానీ బెదిరించి, భయపెట్టి పెట్టించిన సంతకం అది. ఆ విషయాన్నే పోలీసులకు మొరపెట్టుకుంది. ‘నువ్వు మైనర్‌వి, తెలియనిదానివి కాదు కదా.. భయపెట్టి సంతకం పెట్టించుకోవడానికి. నీ సంతకం ఉంది కాబట్టి ఏం చేయలేం’ అంటూ పెదవి విరిచారు. అవమానం, దుఃఖం, కోపం, నిస్సహాయత, తనమీద తనకే పుట్టిన జాలితో వెనుదిరిగింది సారిక. ఇంటికి వచ్చి గుండెపగిలేలా ఏడ్చింది. భార్య బాధ రాకేశ్ గుండెను పిండేసింది.
సారిక న్యాయ పోరాటం
బంధించి, భయపెట్టి, బ్లాక్‌మెయిల్ చేస్తూ ఇలాంటి కాగితాల మీద సంతకాలు చేయించడం నేరం. అలాంటివి చెల్లవు కూడా. దీనికే కాదు సారికను బ్లాక్‌మెయిల్ చేస్తున్న వాళ్లను ట్రాఫికింగ్, ప్రాస్టిట్యూషన్ నేరాల కింద అరెస్ట్ చేయాలి. సారికది న్యాయ పోరాటం. ఆమె పోరాటానికి శక్తివాహిని మద్దతు ఎప్పటికీ ఉంటుంది. - రవికాంత్, శక్తివాహిని ప్రధానకార్యకర్త
శక్తివాహిని సహాయంతో..
స్థానికంగా పనిచేస్తున్న శక్తివాహిని అనే ఎన్‌జీవోకు వెళ్లాడు రాకేశ్. ఆ సంస్థ అధికారి రవికాంత్‌ను కలిశాడు. సారిక పరిస్థితిని వివరించాడు. ఆమె కథ విన్ని రవికాంత్ ఆమె రెండో కూతురును విడిపించడంలో తనకు సహాయపడ్తామని మాటిచ్చాడు. ఆ మరుసటిరోజే సారికను తీసుకెళ్లి రవికాంత్‌కు పరిచయం చేశాడు రాకేశ్. శక్తివాహిని ఆమెకు ధైర్యమిచ్చింది. బిడ్డ కోసం ఢిల్లీ కోర్ట్‌లో పిటీషన్ వేయించింది. ఇప్పుడు ఆ పోరాటంలోనే ఉంది సారిక. ‘భర్త చనిపోయిన నా నిస్సహాయస్థితిని ఆసరాగా తీసుకొని నన్ను నమ్మించి ఢిల్లీ తీసుకొచ్చి.. ఈ కోపంలోకి నెట్టింది.
నా రెండోబిడ్డనూ నెట్టాలని చూస్తోంది. అసలు హిందీరాని కొత్తలో నా చేత ఏవో హిందీపేపర్ల మీద సంతకం చేయించి ఇప్పుడు అవే దత్తత కాగితాలని, వాటి మీద నేను ఇష్టపూర్వకంగా సంతకం చేశానని చూపిస్తోంది. నా ఇద్దరు బిడ్డలనూ వ్యభిచారంలోకి నెడ్తామని బెదిరించి నా చేత బలవంతంగా సంతకాలు చేయించారు. ఈ పాపాలకు వాళ్లకు శిక్షపడేలా చేయందే నిద్రపోను. ఎన్నేళ్లయినా సరే పోరాడుతాను. నా బిడ్డను తెచ్చుకుంటాను. నెల పసిగుడ్డప్పుడు నా నుంచి దూరం చేశారు. ఇప్పుడు దానికి ఎనిమిదేళ్లు.
కోర్టు వాయిదాలకు వాళ్లతో కలిసి వస్తోంది. అసలు నన్ను గుర్తే పట్టడం లేదు. నేను నీ అమ్మను తల్లీ.. అని ఏడుస్తున్నా పిచ్చిదాన్ని.. పరాయిదాన్ని చూస్తున్నట్టు చూస్తోంది. అన్నిటికన్నా ఈ బాధను తట్టుకోలేకపోతున్నా..!’అంటోంది సారిక ఉబికొస్తున్న దుఃఖాన్ని పంటి బిగువున్న ఆపుకుంటూ!
‘మా రెండో బిడ్డను తెచ్చుకోవడానికి మా ప్రాణాలను సైతం లెక్కచేయం. ఎంతదాకైనా పోరాడాతాం’ అంటున్నాడు రాకేశ్.