వెబ్‌లో విద్యాలయం! | College on the web! | Sakshi
Sakshi News home page

వెబ్‌లో విద్యాలయం!

Published Wed, May 28 2014 9:51 PM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM

వెబ్‌లో విద్యాలయం!

వెబ్‌లో విద్యాలయం!

సమాజసేవ అంటే దానికి ప్రత్యేకమైన సమయం కేటాయించనక్కర్లేదు, రోడ్లపై తిరగాల్సిన అవసరం లేదు, ఒకవైపు మన పని మనం చేసుకొంటూనే ఏదో రకమైన సేవాకార్యక్రమాన్ని చేపట్టవచ్చు. చేసే ఆ సేవలో నవ్యత ఉండాలే కానీ... దానికి మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. మనసుంటే మార్గం ఉంటుంది.  అలాంటి మనసున్న వారిలో డేనియల్ ఫ్రీడ్‌మన్ ఒకరు. చదువు సంధ్యలు లేకపోయినా చదువుకొనే ఉత్సాహం ఉన్న వాళ్లకు డేనియల్ అందిస్తున్న సహకారం అంతా ఇంతా కాదు. ‘థింక్‌ఫుల్’ అన్న తన ప్రయత్నంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని, గౌరవం పొందుతున్న 22 ఏళ్ల యువకుడితను.
 
‘థింక్‌ఫుల్’ పేరుతో ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించి తనలాంటి కొంతమంది ఉత్సాహవంతమైన యువతీయువకులను ఒక వేదిక మీదకు తీసుకొచ్చి ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులకు చదువు చెప్పే ఏర్పాట్లు చేశాడు డేనియల్. డేనియల్ టీమ్ ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులకు గెడైన్స్ ఇవ్వడమేగాక వివిధ స్థాయిల్లోని పిల్లలకు ఆన్‌లైన్‌క్లాసులు అందుబాటులో ఉంచింది. ఇది ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయుల్లో కొన్ని వేల మంది విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంది.
 
ఇంటర్నెట్‌లో తరచి చూడాలి కానీ ట్యూటర్‌లుగా ఉపయోగపడే వెబ్‌సైట్లు అనేకం అందుబాటులో ఉన్నాయి. అయితే  అలాంటి వాటిలో థింక్‌ఫుల్ ప్రత్యేకమైనది, నవ్యతాపూరితమైనది. ఎప్పుడూ ట్యూటర్‌లు అందుబాటులో ఉంటారు!
 
థింక్‌ఫుల్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయితే అనునిత్యం కొంతమంది ట్యూటర్‌లు అందుబాటులో ఉంటారు. వారిని సంప్రదించి సందేహాలను నివృతి చేసుకోవచ్చు, క్లాస్‌లను వినవచ్చు. నిపుణులైన ట్యూటర్స్ టీమ్ ఈ వెబ్‌సైట్‌లో ఉంటుంది. వేరే వృత్తుల్లో ఉన్న అనేక మంది యువతీయువకులు రోజుకు గంటా, రెండుగంటల సేపు ఈ సైట్‌కు అందుబాటులో ఉంటారు. ఇలాంటి వారు రకరకాల విభాగాల్లో నిపుణులు, పెద్ద చదువులు చదివిన వారు కాబట్టి  ఈ సైట్‌లోకి లాగిన్ అయ్యే విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
 
అతడికి చదువు లేదు...

డేనియల్ సంగతికొస్తే అతను యేల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌లో చేరి మధ్యలో ఆపేశాడు. గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేయకుండా మధ్యలో చదువు ఆపేసిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అయితే అతడి మెదడులో చదువుకు సంబంధించి ఇంతమంచి ఆలోచన మెదలడం చాలా ఆసక్తికరం.
 
ఇదొక విద్యాలయం...
 
అమెరికా స్థాయిలో పీసీ, ఇంటర్నెట్‌లు చాలా సాధారణమైన అంశాలు కాబట్టి అనేక మంది విద్యార్థులకు ఈ వెబ్‌సైట్ ఒక వరంగా మారింది. కేవలం విద్యార్థులు అనే కాదు. వివిధ రంగాల్లో సమాచారం కోసం వివరణల కోసం ఈ వెబ్‌సైట్‌లో ప్రశ్నలు పోస్టు చేసే వాళ్లు అనేక మంది ఉన్నారు. ఆన్‌లైన్ ట్యుటోరియల్స్ విషయంలో యూట్యూబ్ వంటి సైట్ల కన్నా దీటైన స్థాయిలో ఉంది డేనియల్ వెబ్‌సైట్. ఏకవ్యక్తి సైన్యంగా ఈ స్థాయి విజయాన్ని సాధించిన డేనియల్ నిజంగానే చాలా గ్రేట్ కదూ!
 
 ఫోర్బ్స్ జాబితాలో...

 డేనియల్ సోషల్‌ఎంటర్‌ప్రెన్యూరర్‌గా పెద్ద పేరు సంపాదించాడు. ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక డేనియల్‌ను సామాజిక సేవ విషయంలో ప్రభావాత్మకమైన ‘30 అండర్ 30’ విభాగంలో ఎంపిక చేసింది. చేసింది చిన్న ప్రయత్నమే అయినా అది సూపర్ సక్సెస్ కావడంతోపాటు ఇలాంటి గౌరవం దక్కడం కూడా డేనియల్‌కు చక్కటి అనుభూతిగా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement