
వైద్యం ఎంతో అభివృద్ధి చెందింది అనుకున్న ఈ కాలంలో కూడా ఎక్స్‌రే నలుపు తెలుపుల్లోనే ఉండటం ఏమిటని మీకెప్పుడైనా అనిపించిందా? త్వరలోనే ఈ పరిస్థితి మారిపోనుంది. శరీరం లోపలి భాగాలను రంగుల్లో చూసుకునేందుకు రంగం సిద్ధమైంది. మార్స్ బయో సెన్సింగ్ అనే న్యూజిల్యాండ్ కంపెనీ పరిశోధనల పుణ్యమా అని అందుబాటులోకి రానున్న త్రీడీ స్కానర్ ఎముకలు, కండరాలతో పాటు కొవ్వులను కూడా రంగుల్లో చూపుతుంది. స్విట్జర్లాండ్ సరిహద్దుల్లోని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయోగశాల సీఈఆర్‌ఎన్ శాస్త్రవేత్తలు ఈ స్కానర్ కోసం ప్రత్యేకమైన మైక్రోప్రాసెసర్‌ను తయారు చేయడం విశేషం.
సంప్రదాయ సీటీ స్కాన్ల ద్వారా శరీరం లోపలికి ఎక్స్‌రే కిరణాలు ప్రసరించినప్పుడు దాని తీవ్రతలో వచ్చే మార్పులను పరిశీలించడం ద్వారా ఎక్స్‌రే తయారవుతుంది. ఎముకల గుండా ప్రయాణించినప్పుడు శక్తి తగ్గిపోతుంది కాబట్టి ఆ ప్రాంతం తెల్లగానూ, తగ్గని కండరాల ప్రాంతం నల్లగానూ ఉంటుందన్నమాట. ఇలా కాకుండా లోపలి పదార్థాన్ని బట్టి తగు తరంగ దైర్ఘ్యమున్న కిరణాలను పంపగల స్పక్ట్రల్ స్కానర్లను వాడటం ద్వారా మార్స్ బయో సెన్సింగ్ కలర్ ఎక్స్‌రే యంత్రాలను సిద్ధం చేసింది. ఇప్పటికే ఓ నమూనా యంత్రాన్ని విజయవంతంగా పరీక్షించిన ఈ కంపెనీ త్వరలోనే దీన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment