కామెడీ క్రాకర్స్
పొట్ట చెక్కలైతే అది.. ‘బ్రహ్మీ’ బులెట్ బాంబ్. డొక్కలు ముక్కలైతే అది... పృథ్వీ రాకెట్ షాట్. బాడీ మొత్తం షేకైతే అది... షకలక శంకర్ పాంబిళ్ల. పడీపడీ నవ్వుతుంటే అది.. అలీ గ్రౌండ్ చెక్కర్. కిందపడి కొట్టుకుంటే అది.. పోసాని విష్ణు చక్రం. రివ్వున గింగరాలు తిరిగితే అది... సప్తగిరి భూచక్రం. కితకితలొస్తే అది... శ్రీనివాస్‌రెడ్డి ఫ్లవర్ పాట్. కళ్లు తేలేసి తలకిందులైతే అది... సంపూర్ణేష్ లడీ.
తెలుగు సినిమాల్లో లేటెస్టుగా ఇప్పుడు... సౌండ్ అదిరిపోతున్న కామెడీ క్రాకర్స్ ఇవి. హ్యావ్ ఎ నైస్ అండ్ నవ్వుల దీపావళి.
కిల్ బిల్ పాండే @ రేసుగుర్రం
‘రేసుగుర్రం’లో రేసుగుర్రంలా పరుగులుపెట్టే పాత్ర నాది. అప్పటివరకూ సినిమా ఒక మూడ్‌లో నడిస్తే, నేనొచ్చాక ఇంకో మూడ్‌లో నడుస్తుంది. అసలు నా ఎంట్రీనే ఓ ఫ్రస్టేషన్ మూడ్‌లో ఉంటుంది. పోలీసాఫీసర్‌గా అన్నేళ్లు పనిచేసినా ఏం శాటిస్‌ఫేక్షన్ లేక చాలా ఫ్రస్టేషన్‌తో గడిపే కిల్‌బిల్ పాండే వేషం నాది. విలన్ ఇంటిలోకి నేను కారులో దూసుకె ళ్లడం, కదులుతున్న కారులో నుంచి దూకేయడం... ఇవన్నీ ఆడియన్స్‌కు బాగా నచ్చేశాయి. ముఖ్యంగా పిల్లలు నేనెక్కడ కనబడ్డా ‘కిల్‌బిల్ పాండే’ అని పిలవడం మొదలెట్టారు. ఈ మధ్యకాలంలో బాగా పేలిన పాత్ర అంటే ఇదే!
- బ్రహ్మానందం
బాయిలింగ్ స్టార్ బబ్లూ@ లౌక్యం
‘ఖడ్గం’ సినిమాలో నాపాత్రకు ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అంటూ ఓ మేనరిజం ఉంది.అప్పట్నుంచీ నా ఇంటిపేరు ‘థర్టీ ఇయర్స్’ అయిపోయింది. ఆ తర్వాత చాలా పాత్రలు చేసినా, ఆ పేరు మాత్రం బ్రేక్ కాలేదు. ‘లౌక్యం’లో ‘బాయిలింగ్ స్టార్ బబ్లూ’ చేసేవరకు నా పరిస్థితి ఇంతే. ఈ సినిమా దెబ్బతో ఇప్పుడు నన్నందరూ ‘బాయిలింగ్ స్టార్ బబ్లూ’ అనే పిలుస్తున్నారు. అంతలా లక్ష్మీ బాంబులా పేలిందా పాత్ర. స్క్రిప్టులో ఈ కేరక్టర్ రాస్తున్నప్పుడే రచయిత శ్రీధర్ సీపాన, దర్శకుడు శ్రీవాస్ ఇదేదో బాంబులా పేలేటట్లు ఉందే అనుకున్నారట. నిజంగానే ‘లౌక్యం’ రిలీజయిన వారానికే ఓవర్‌నైట్‌లో కమర్షియల్ కమెడియన్‌ని అయిపోయా. ఆ తర్వాత మిస్సైల్స్ లాంటి పాత్రలు వచ్చాయి... వస్తున్నాయి... వస్తాయి కూడా.
- పృథ్వీ
శుక్లాభాయ్@ నాయక్
నేను హీరోగా, డెరైక్టర్‌గా ‘బొంగుస్వామి’ పేరుతో ఓ సినిమాకు ప్లానింగ్ జరుగుతోంది. ఆ టైమ్‌లో దర్శకుడు వినాయక్ దగ్గర్నుంచి ఫోన్..‘‘ సార్.. ‘నాయక్’ సినిమాలో ఓ వేషం ఉంది. మూడురోజులు కాల్‌షీట్స్ కావాలి’’ అనడిగాడు. నాకు అలాంటి చిన్న వేషం వేయడం ఇష్టం లేదు. కానీ వినాయక్ కోసమని ఒప్పుకొని వెళ్లా. ఆ రోజు నా మీద కొన్ని సీన్స్ తీశారు. నా బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్ చూసి వినాయక్, కెమేరామెన్ ఛోటా కె.నాయుడు ఒకటే నవ్వులు. యూనిట్ సభ్యులు కూడా పగలబడి నవ్వుతున్నారు. దాంతో వినాయక్ వెంటనే రచయిత ఆకుల శివను పిలిచి-‘‘పోసాని గారు సెకండాఫ్ మొత్తం కనబడేట్టు స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చెయ్’’ అని ఆర్డర్ వేశారు. అలా 3 రోజులు అనుకున్న నా వేషం 13 రోజులకు వెళ్లింది. చివరకు క్లైమాక్స్‌లో కూడా నా పాత్రను ఇరికించారు. చిరంజీవి గారు రష్ చూసి నా పాత్రను బాగా ఎంజాయ్ చేశారు. రామ్ చరణ్‌తో ఈ సినిమా హిట్ అని ముందే చెప్పేశారట. నా పాత్ర ఇంతలా పేలుతుందని నేను కూడా అస్సలు ఊహించలేదు. రిలీజ్ తర్వాత ఫోన్ల మీద ఫోన్లు. దాసరి గారు ప్రత్యేకంగా నన్ను అప్రిషియేట్ చేశారు. అలాగే బ్రహ్మానందం గారు కూడా. ఆ దెబ్బతో రాత్రికిరాత్రే స్టార్ కమెడియన్‌ని అయిపోయా. ఈ ఒక్క పాత్ర వల్ల నాకు 37 సినిమాలు వచ్చాయి. దీంతో డెరైక్షన్ పక్కన పెట్టేశాను. ఇలాంటి పాత్ర ఇచ్చిన వినాయక్‌ను ఎప్పటికీ మర్చిపోలేను.
- పోసాని కృష్ణ మురళి
మైదానం@ రాజు గారి గది
‘ఎమ్.వై దానం....ై మెదానం’... ఇప్పుడు ఎక్కెడికెళ్లినా నన్ను ఇలానే పిలుస్తున్నారు. ఇప్పటివరకూ నేను ఎన్ని సినిమాలు చేసినా, ఈ పాత్ర మాత్రం ప్రేక్షకుల హృదయాల్లోకి తారాజువ్వలా దూసుకెళ్లింది. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలు ఒక ఎత్తయితే, నా సినీ కెరీర్‌ను మలుపు తిప్పిన పాత్ర మాత్రం ‘రాజు గారి గది’ లోని మైదానం పాత్రే. ‘గీతాంజలి’ తర్వాత ఫుల్‌లెంగ్త్ రోల్ చేసింది ఈ సినిమాలోనే. నా మొదటి సినిమా ‘రన్ రాజా రన్’. అందులో నాది కానిస్టేబుల్ వేషం. అది చూసి కోనవెంకట్‌గారు నాకు ‘గీతాంజలి’ సినిమాలో ఆరుద్ర పాత్ర ఇచ్చారు. ఆరుద్ర వల్ల ఈ మైదానం దక్కింది. ఈ మైదానం మాత్రం నాకే కాకుండా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాడు.
శ్రీను@ గీతాంజలి
ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలన్నీ తెరపై బాంబుల్లా పేలినవే. ‘ఇడియట్’లో రవితేజ ఫ్రెండ్‌గా, ‘సోలో’ సినిమాలో నారారోహిత్ పక్కన నేను చేసిన కామెడీ నన్ను ప్రామిసింగ్ కమెడియన్‌ని చేశాయి. నా కెరీర్‌ను ఒక్కసారిగా తారాజువ్వలా తీసుకెళ్లిన సినిమా మాత్రం ‘గీతాంజలి’. తొలిసారిగా మెయిన్ రోల్ చేస్తూనే కామెడీ పండించే అవకాశం దక్కింది. ఇందులో నాది డెరైక్టర్ కావాలని కలలు కనే పాత్ర. అందులోనూ ఓ దెయ్యం కథ తయారు చేసుకుని నిర్మాత కోసం వెతుకుతుంటా. ఈ నేపథ్యంలో నిజంగా దెయ్యం రావడం... ఎందుకండీ నేను చెప్పడం ఆల్రెడీ మీరు చూశారు... ఎంజాయ్ చేశారు కదా. దెయ్యం సినిమాతో నవ్వించడం అంటే మాటలు కాదు కదా. మొత్తానికి డెరైక్టర్ శ్రీను పాత్ర నా లైఫ్ టైమ్ మెమొరీలో నిలిచిపోతుంది.
- శ్రీనివాసరెడ్డి
నెల్లూరు గిరి@ ప్రేమకథా చిత్రమ్
నేను మొదట్లో ‘పరుగు’లో నటించాను. ఆ తర్వాత ఇంకొన్ని సినిమాలు చేశా. కానీ నా కెరీర్‌ను మలుపు తిప్పి, టపాకాయ్‌లా పేలిన సినిమా అంటే ‘ప్రేమకథా చిత్రమ్’. అందులో నా పాత్ర పేరు ‘నెల్లూరు గిరి’. ఆత్మహత్య చేసుకోవడం కోసం హీరో బ్యాచ్‌తో కలిసి ఊరు చివరి గెస్ట్‌హౌస్‌కు వెళ్తాడు. అక్కడ కథ ఎలా మలుపు తిరిగిందో మీకు తెలుసు. అక్కడ నుంచీ నా కెరీర్ కూడా ఎలా మలుపు తిరిగిందో కూడా మీకు తెలుసు.
- సప్తగిరి
సంపూర్ణేశ్‌బాబు@ హృదయకాలేయం
అందరికీ దొరకని అదృష్టం నాది. ఎవ్వరికీ దొరకనంత క్రేజ్ నాకు ఫస్ట్ సినిమాతోనే వచ్చేసింది. అదే ‘హృదయకాలేయం’. ముందు సోషల్ మీడియాలో సూపర్‌హిట్ అయ్యి, తర్వాత సెల్యులాయిడ్ మీద సూపర్‌హిట్ అయ్యా. మొదటి చిత్రమే నా కెరీర్‌కు యూటర్న్ అయిందంటే విచిత్రంగా ఉంది కదూ. నేను ఎన్ని సినిమాలు చేసినా, ‘హృదయకాలేయం’ సంపూర్ణేశ్‌బాబు అంటేనే చాలా మంది గుర్తుపడుతూ ఉంటారు. ఆ ట్యాగ్ ఇప్పటికీ, ఎప్పటికీ నాకు ప్లస్ పాయింట్.
- సంపూర్ణేశ్‌బాబు
రాజారత్నం @ శ్రీమంతుడు
‘‘బాబూ... నువ్వు రానంతవరకూ ఆవిడ తోటకెళ్తూనే ఉంటుంది’’ అని నేను ‘శ్రీమంతుడు’ సినిమాలో రాజారత్నం పాత్రలో చెప్పిన డైలాగ్‌కు థియేటర్‌లో విజిల్స్ పడ్డాయి. ఈ మధ్య కాలంలో నాకు బాగా పేరు తె చ్చిన పాత్ర అంటే ఇదే. అలాగే ‘బ్రూస్‌లీ’ సినిమాలో ఆమిర్ ఖాన్ స్కూప్ కూడా బాగా క్లిక్ అయ్యింది.
- అలీ