దాని అంతు నేను చూస్తాను | Comic serials in children incite violence | Sakshi
Sakshi News home page

దాని అంతు నేను చూస్తాను

Published Fri, Sep 13 2019 12:10 AM | Last Updated on Fri, Sep 13 2019 12:10 AM

Comic serials in children incite violence - Sakshi

పిల్లల్లో కామిక్‌ సీరియళ్లు హింసను ప్రేరేపిస్తున్నాయి అని నిన్న మొన్నటి వరకు బెంగ పెట్టుకునేవాళ్లం. అయితే పెద్దలు చూసే టీవీ సీరియళ్లను, టీవీ డిబేట్‌లను చూస్తున్నందు వల్ల పిల్లల్లో కనిపిస్తున్న విపరీత ధోరణులతో పోలిస్తే.. కామిక్‌ హింసే నయం అనే భావన కలగడం సహజమే!

ఒక ఇంట్లో :
అన్నాచెల్లెళ్లు స్కూలు నుంచి వచ్చారు. ఎవరి హోమ్‌వర్క్‌ వాళ్లు చేసుకుంటున్నారు. స్కూలుకు తీసుకెళ్లిన బుక్స్‌ అన్నీ తిరిగొచ్చాయో లేదోనని కూతురి స్కూల్‌ బ్యాగ్‌ని అలవాటుగా చెక్‌ చేస్తోంది తల్లి. అందులో ఓ బుక్‌ ఆమెకు కనిపించినట్లు లేదు.‘‘దియా నీ సైన్సు పుస్తకాన్ని నేహా నుంచి తిరిగి తీసుకున్నావా?’’ అని కూతుర్ని అడిగింది. రాస్తున్న నోట్‌బుక్‌ని, బాల్‌పెన్‌నీ పక్కన పెట్టి సీరియస్‌గా పైకి లేచింది దియా. నేహా పేరు వినగానే ఆ పాప ముఖం అప్రసన్నంగా మారిపోయింది. కళ్లు పెద్దవి చేసింది. మూతి బిగించింది. ‘‘తన గురించి ఏమనుకుంటోంది! అది నా మీద కుట్ర పన్నుతుందా?’’ అంది! తల్లి బిత్తరపోయింది. ‘దియా..’ అంది! ‘‘దాని అంతు.. నేను చూస్తాను’’ అంది దియా.

‘దాని అంతు’ అని చిన్న విరామం ఇచ్చి ‘నేను చూస్తాను’  అని అంటున్నప్పుడు టీవీ సీరియళ్లలో పగబట్టి, ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న లేడీ క్యారెక్టర్‌లా ఉంది ఆరేళ్ల ఆ పాప. ఆ తల విసరడం, చేతులు తిప్పడం, కళ్లలో కోపాన్ని ఒలికించడం.. తల్లికి దడపుట్టించేలా ఉన్నాయి. దియా అన్నయ్య కూడా హోమ్‌వర్క్‌ ఆపేసి దియా వైపు ఆశ్చర్యంగా చూస్తుంటాడు.అక్కడితో ఆగదు దియా. కుడి చేతి పిడికిలి బిగించి పైకి లేపుతూ.. ‘‘అది నా చేతిలోంచి తప్పించుకోలేదు’’ అంటుంది. పళ్లు కూడా బిగిస్తుంది.‘‘దియా..!!’ అని ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది తల్లి. ‘‘ఆగు’’ అని పెద్దగా అరిచి తల్లిని అడ్డుకుంటుంది దియా. ఆగుతుంది తల్లి. అప్పుడు అంటుంది దియా.. ‘‘చూస్తూ ఉండమ్మా..’’ అని. దియా తల్లి చేష్టలుడిగిపోతుంది.

ఇంకో ఇంట్లో :
అక్కా తమ్ముడు టేబుల్‌ మీద ఎవరి ఆటలో వాళ్లు ఉంటారు. తమ్ముడు చిన్న చిన్న బ్లాక్స్‌తో టేబుల్‌పై బిల్డింగ్‌ నిలబెడుతుంటాడు. బొమ్మలతో ఆడుతుంటుంది అక్క. ఈ సీన్‌లో.. ఇంటికి ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ వస్తారు. పిల్లల అమ్మానాన్న ఎదురెళ్లి ఆ వచ్చిన భార్యాభర్తల్ని రిసీవ్‌ చేసుకుంటారు. ‘‘సారీ రమేశ్‌.. మా అబ్బాయి సి«ద్‌ ఆడుకోవడానికి రాలేకపోయాడు’’ అంటాడు ఆ వచ్చినాయన. ఆడుకోవడానికి వచ్చేటప్పుడు సిద్‌ను కూడా తెస్తామని ముందే మాట ఇచ్చినట్లున్నారు ఆ దంపతులు. కానీ వెంటబెట్టుకు రాలేకపోయారు. అందుకే ఆయన ‘సారీ’ చెప్పాడు.‘సారీ’ అనే మాట వినగానే బ్లాక్స్‌తో బిల్డింగ్‌ కడుతున్న పిల్లాడు వింతగా, విడ్డూరంగా, విసుగ్గా చూసి.. ‘‘సారీ..! సరిపోతుందా సారీ’’ అంటాడు. అంతేకాదు, తల అడ్డంగా ఊపుతూ.. ‘‘ఇది తేలిగ్గా తీసుకునేది కాదు’’ అని కూడా అంటాడు. వచ్చిన పెద్దలు, ఈ ఇంట్లో ఉన్న పెద్దలు ఇబ్బందిగా ముఖాలు చూసుకుంటారు. పిల్లాడు ఆపడు. ‘‘ఇది గట్టిగా తేల్చుకోవాల్సిన అంశం.

సిద్‌ సమాధానం ఇవ్వాలి. ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇది చాలా అన్యాయం’’ అని రెండు చేతులూ గాలిలో ఊపుతాడు. వాడి మోచేయి తగిలి టేబుల్‌పై అంత వరకు బ్లాక్స్‌తో అతడు కట్టిన భవంతి కుప్పకూలిపోతుంది. ఇవి రెండూ.. వారం రోజులుగా డిస్నీ ఇండియా (తెలుగు) ప్రమోట్‌ చేస్తున్న వీడియోలు. ‘దట్‌ ఆక్వర్డ్‌ మోమెంట్‌’ పేరుతో పార్ట్‌’ 1, పార్ట్‌ 2 ఈ వీడియోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసింది డిస్నీ చానెల్‌. ప్రైమ్‌ టైమ్‌లో వచ్చే టీవీ సీరియళ్లు, హోరాహోరీగా సాగే న్యూస్‌ డిబేట్‌లు పిల్లలపై ఎంతగా ప్రభావం చూపుతున్నాయో చెబుతూ.. ‘పిల్లలు కేవలం పెద్దలు చూడవలసిన ప్రోగ్రామ్‌లను చూస్తుంటే ఏం నేర్చుకుంటారు? డిస్నీ కిడ్స్‌ ప్యాక్‌ తీసుకోండి. డిస్నీ యొక్క బాల్యపు మ్యాజిక్‌ను పదిలపరుచుకోండి’ అని అంటుంది డిస్నీ చానెల్‌. పై రెండు వీడియోల్లో లాస్ట్‌ సీన్‌గా.. పిల్లలు డిస్నీ కామిక్‌ సీరియళ్లు చూస్తూ లోకాన్ని మైమరిచి పకపక నవ్వేస్తుంటే వాళ్లను చూసి పేరెంట్స్‌ మురిసిపోతుంటారు. డిస్నీ ఈ వీడియోలను తన వ్యాపారం కోసమే తయారు చేసినా, పెద్దల ప్రోగ్రాములు ఆ చిన్న మెదళ్లను ఎలా దూకుడుగా, దుందుడుకుగా మార్చేస్తున్నదీ చక్కగా చెప్పగలిగింది.

అంతేకదా.. కుట్రలు పన్నే  అత్తాకోడళ్లు, బుసలుకొట్టే ఆడపడుచులు, పెద్ద గొంతేసుకుని డిబేట్‌కు వచ్చినవాళ్లపై విరుచుకుపడే ఆర్ణబ్‌ గోస్వాములు పదీ పన్నెండేళ్ల పిల్లలకు ఏం అవసరం? అయితే పిల్లలు చూసే కామిక్స్‌లో మాత్రం హింస ఉండటం లేదా? ఉంటుంది. కానీ అది నవ్వించే హింస. నవ్వునే మర్చిపోయేంత హింస కాదు. హింసలో ప్రేరేపించే గుణం ఉంటుంది. పిల్లల్లో త్వరగా ప్రేరణకు గురయ్యే బలహీనత ఉంటుంది. అందుకే  టామ్‌ అండ్‌ జెర్రీ, మిక్కీ మౌజ్, పాపోయ్, 3 స్టూజెస్, సూపర్‌మేన్, లూనీ ట్యూన్స్, స్కూబీ డూ, బఫీ ది వాంపైర్‌ స్లేయర్, అమెరికన్‌ డాల్‌ వంటి కార్టూన్‌ షోలు ఇంతగా పిల్లల్ని ఆకట్టుకుంటున్నాయి. అయితే.. ‘‘ఆకట్టుకోవడం వరకు మంచిదేకానీ, వాటిల్లోని క్యారెక్టర్లు రోజంతా పిల్లల్ని అలా కట్టి పడేసి ఉంచుతున్నాయి. వారిలో దుడుకు స్వభావాన్ని పెంపొందిస్తున్నాయి’’ అని ఐయోవా స్టేట్‌ యూనివర్సిటీ నాలుగేళ్ల క్రితమే చేసిన ఒక అధ్యయనంలో వెల్లడయింది! పిల్లలు చూసే పెద్దవాళ్ల ప్రోగ్రాములు ఇందుకు రివర్స్‌. ఆకట్టుకోవు కానీ, కట్టేసుకుంటాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement