విశ్వమంతా ఆత్మజ్యోతి ప్రకాశమే
అంగిరసుడు శౌనకునికి బ్రహ్మవిద్యను ఇలా కొనసాగిస్తున్నాడు. శౌనకా! నేను చెప్పేది నిత్యసత్యం. బాగా మండే మంటల్లో నుంచి వేల సంఖ్యల్లో నిప్పురవ్వలు పుట్టినట్టు అక్షరపరబ్రహ్మం నుంచి సాకారమైన అనేకజీవులు అసంఖ్యాకంగా ఉద్భవిస్తాయి. మళ్లీ అక్కడే లీనమవుతాయి. దివ్యమూ, రూపరహితమూ. అతిప్రాచీనమూ, లోపలా బయటా ఉన్నదీ, పుట్టుకలేనిదీ, ప్రాణం లేనిదీ, మనస్సు లేనిదీ, స్వచ్ఛమైనదీ, నాశనం లేనిదీ, సృష్టి అంతటికీ అవతల ఉండేదే పరబ్రహ్మం. దానినుంచి ప్రాణం, మనస్సు, అగ్ని, ఇంద్రియాలు, ఆకాశం, గాలి, నిప్పు, నీరు, విశ్వాధారమైన భూమి(పంచభూతాలు) ఏర్పడుతున్నాయి.
పరబ్రహ్మమే అగ్ని శిరస్సు. చంద్రసూర్యులు నేత్రాలు. దిక్కులు చెవులు. తెరిచి ఉంచిన వేదాలు నోరు. వాయువు ప్రాణం. విశ్వం హృదయం. పరబ్రహ్మ పాదాలనుంచే భూమి ఏర్పడుతోంది. అన్ని ప్రాణుల్లో ఉండే అంతరాత్మ పరబ్రహ్మమే! దానినుంచి అగ్ని పుట్టింది. అది వెలగటానికి సూర్యుడు సమిధ అవుతున్నాడు. చంద్రుణ్ణించి మేఘాలు, భూమినుంచి ఓషధులు జన్మిస్తున్నాయి. పురుషుడు ఆ ఓషధులను తినటం ద్వారా ఏర్పడిన వీర్యాన్ని స్త్రీయందు నిక్షేపించ గా, అసంఖ్యాకంగా జీవులు పుడుతున్నాయి. ఇవన్నీ పరబ్రహ్మం నుంచే ఆవిర్భవిస్తున్నాయి. దానినుంచే ఋక్కులు, సామ, యజుర్వేదాలు, యజ్ఞదీక్షలు, క్రతువులు, దక్షిణలు, సంవత్సరం, యజమానుడు (యజ్ఞం చేసేవాడు) సూర్యచంద్రులు ప్రకాశించే లోకాలు పుడుతున్నాయి. ఆ పరబ్రహ్మం నుంచే దేవతలు, అనేకరూపాల సాధ్యులు, మనుష్యులు, పశువులు, పక్షులు, ప్రాణ, అపానవాయువులు, వరి, గోధుమ వంటి ధాన్యాలు, తపస్సు, శ్రద్ధ, సత్యం, బ్రహ్మచర్య విధులు ఏర్పడుతున్నాయి. దానిలోనుంచే ఏడుప్రాణాలు, ఏడు అగ్నులు, సమిధలు, ఏడు హోమాలు, ఏడులోకాలు, గుండెగుహలో ఉండే ప్రాణాలు అన్నీ ఏడు ఏడుగా సృష్టింపబడుతున్నాయి.
ఆ పరమాత్మ నుంచే సముద్రాలు, కొండలు, అన్ని నదులూ, అన్ని ఓషధులూ, పంచభూతాలతో ఏర్పడే శరీరాన్ని పోషించే రసమూ, మూలికలూ అన్నీ వస్తున్నాయి. పురుష ఏ వేదం విశ్వం కర్మ తపో బ్రహ్మ పరామృతమ్ ఏ తద్యో వేద నిహితం గుహాయాం సో విద్యాగ్రంథం వికి ర తీహసౌమ్య నాయనా! ఈ విశ్వం, కర్మలు, తపస్సు అన్నీ అమృత స్వరూపమైన పరబ్రహ్మమే. దీనిని ఎవరు తెలసుకుంటారో వారి హృదయంలో ఉండే అవిద్య, అజ్ఞానం అనే ముడి విడిపోతుంది.
శౌనకా! అంతటా ప్రత్యక్షస్థితి కలిగినదై, సన్నిహితమై, హృదయమనే గుహలో ఉండే పరబ్రహ్మానికి అత్యున్నత స్థానం ఇవ్వబడింది. కదిలేది, ఊపిరి పీల్చేది, కనురెప్పలు ఆర్పేది, ఆర్పనిది ఏ జీవి అయినా పరబ్రహ్మలోనివే అది కంటికి కనపడే, కనపడని వాటన్నింటికంటే శ్రేష్ఠం. మానవ విజ్ఞానానికి అందనంత గొప్పది. మహాకాంతిమంతం, అణువుకన్నా పరమాణువు, అన్ని లోకాలు, వాటిలో ప్రాణులు తానే అయినది అక్షర పరబ్రహ్మం. అదే ప్రాణం. వాక్కు, మనస్సు, సత్యం, అమృతం. తెలియవలసినది, తెలుసుకోవలసిందీ అదే. సౌమ్యా! తెలుసుకో. లక్ష్యాన్ని సాధించు.
ఉపనిషత్ విజ్ఞానమనే ధనుస్సు తీసుకుని, ఉపాసన అనే బాణాన్ని సంధించు. ఎటూ చెదరని ఏకాగ్రమైన మనస్సుతో ఆ వింటి త్రాటిని చెవిదాకా లాగు. అక్షరమైన పరబ్రహ్మాన్నే లక్ష్యంగా ఎంచుకో. ఓంకారమే ధనుస్సు. బాణం ఆత్మ. పరబ్రహ్మమే లక్ష్యం. అప్రమత్తతతో గురిచూసి కొట్టాలి. బాణంలాగా నువ్వు దానిలోకి ప్రవేశించాలి. ఆకాశం, భూమి, అంతరిక్షం, మనస్సు, పంచప్రాణాలు అన్నీ అల్లుకున్న కేంద్రమే ఆత్మ అని తెలుసుకో. అనవ సరమైన మాటలు విడిచిపెట్టు. చావుపుట్టుకలనే రెండు గట్టులను కలిపే అమృతమనే వంతెన ఇదే. రథచక్రంలోని ఆకులన్నిటికీ ఇరుసు కేంద్రమైనట్టు నాడులన్నీ కూడిన హృదయంలో ఆత్మ ఉంటుంది. ఓంకారధ్యానంతో అది తెలుస్తుంది. చీకటికి అవతలి వెలుగు కనిపిస్తుంది. సర్వజ్ఞుడూ, సర్వవేత్త అయిన పరబ్రహ్మమే సర్వవ్యాప్తం. హృదయాకాశంలోని వెలుగు అనే బ్రహ్మపురంలో పరమాత్మ ప్రతిష్ఠితుడై ఉంటాడు. అతడు మనస్సంతా నిండి ఉంటాడు. ప్రాణ, శరీరాలను నడిపిస్తాడు. ఈ విజ్ఞానంతో ధీరులు అమృతమైన ఆనందరూపమైన పరమాత్మను చూడగలుగుతున్నారు. వారిలోని అజ్ఞానం తొలగిపోతోంది. కర్మలన్నీ తగ్గిపోతున్నాయి. ఆ బంగారు గుహలో వెలిగే పరబ్రహ్మ నిర్మలుడు, నిర్గుణుడూ, వెలుగులకు వెలుగు, పరమపవిత్రుడు. అతనేనని ఆత్మవేత్తలు తెలుసుకోగలరు. అక్కడ సూర్యుడు ప్రకాశించడు. చంద్రుడు, తారలు, మెరుపులు ఏవీ వెలగవు. అగ్ని అసలు ఉండదు. ఆ పరమాత్మ వెలుగులోనుంచి ఇవన్నీ కాంతిని పొంది ప్రకాశిస్తాయి. విశ్వమంతా ఆత్మజ్యోతిప్రకాశమే.
శౌనకా! ఈ విశ్వమంతా శాశ్వత పరబ్రహ్మమే. ముందు, వెనక, కుడిపక్క, ఎడమపక్క, కింద, పైన, అంతటా పరబ్రహ్మమే వ్యాపించి ఉంది. అదే అత్యున్నతం. అథశ్చోర్థ్యం చ ప్రసృతం బ్రహ్మైదం విశ్వమిదం వరిష్ఠమ్ఇలా అంగిరసుడు శౌనకునికి ద్వితీయ ముండకం ప్రథమ ఖండంలో సాకారంగా, ద్వితీయ ఖండంలో సర్వవ్యాప్తంగా ఉన్న పరబ్రహ్మాన్ని బోధించాడు. తృతీయ ముండకం రెండు ఖండాల్లో మరింత లోతుగా సాగే ఈ విశ్లేషణను వచ్చే వారం తెలుసుకుందాం.
- డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్
ఉపనిషత్ విజ్ఞానమనే ధనుస్సు తీసుకుని, ఉపాసన అనే బాణాన్ని సంధించు. ఎటూ చెదరని ఏకాగ్రమైన మనస్సుతో ఆ వింటి త్రాటిని చెవిదాకా లాగు. అక్షరమైన పరబ్రహ్మాన్నే లక్ష్యంగా ఎంచుకో. ఓంకారమే ధనుస్సు. బాణం ఆత్మ. పరబ్రహ్మమే లక్ష్యం. అప్రమత్తతతో గురిచూసి కొట్టాలి. బాణంలాగా నువ్వు దానిలోకి ప్రవేశించాలి. ఆకాశం, భూమి, అంతరిక్షం, మనస్సు, పంచప్రాణాలు అన్నీ అల్లుకున్న కేంద్రమే ఆత్మ అని తెలుసుకో. అనవ సరమైన మాటలు విడిచిపెట్టు. చావుపుట్టుకలనే రెండు గట్టులను కలిపే అమృతమనే వంతెన ఇదే.