ఆడకూడదా?
అధ్యయనం
టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువగా ఉన్న స్త్రీలు క్రీడలలో సాటి స్త్రీల కంటే ఎక్కువ శక్తిని ప్రదర్శించ గలరని నిరూపిస్తున్న తాజా అధ్యయనం ద్యుతీ చంద్ వంటి క్రీడాకారిణుల భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది!
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్న భారత అథ్లెట్ ద్యుతీచంద్‌కు ఇది నిజంగా షాకింగ్ వార్తే...! గతంలో తాను ఎదుర్కొన్న లింగ నిర్ధారణ కేసు మరోసారి తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె శరరీంలోని పురుష హార్మోన్ల మద్దతుతోనే తను ఇతరులకన్నా ఎక్కువ లాభపడుతోందని గతంలో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సంఘం (ఐఏఏఎఫ్) ద్యుతీని నిషేధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి సంబంధించి మరిన్ని సాక్ష్యాలతో క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సీఏసీ)ను ఆశ్రయించాలని ఐఏఏఎఫ్ నిర్ణయించింది.
ద్యుతీ చంద్, భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ), ఐఏఏఎఫ్ మధ్య సాగిన ఈ వివాదాస్పద కేసు రెండేళ్ల క్రితం సీఏఎస్ ముందుకు వచ్చింది. అప్పట్లో విచారణ జరిపిన సీఏఎస్ 2015, జూలై 27న ద్యుతీపై ఐఏఏఎఫ్ విధించిన నిషేధాన్ని రెండేళ్ల పాటు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పు ఇచ్చే వరకు తను పోటీల్లో పాల్గొనవచ్చని సీఏఎస్ చెప్పడంతో ఊరట చెందిన ద్యుతి... అప్పటి నుంచి యథావిధిగా పోటీల్లో పాల్గొంటోంది. అయితే ఈ నెలలోనే రెండేళ్ల గడువు ముగియనుండడంతో ఐఏఏఎఫ్ మరోసారి ద్యుతిపై పోరాటానికి సిద్ధమవుతోంది.
హైపరాండ్రోజెనిక్ హార్మోన్లు కలిగిన మహిళా అథ్లెట్లు మామూలు టెస్టోస్టిరాన్ స్థాయి కలిగిన వారితో పోల్చితే భిన్నంగా ఉంటారని ఐఏఏఎఫ్ తన నివేదికలో పేర్కొననుంది. దీన్ని అవకాశంగా తీసుకుని ఆయా అథ్లెట్స్ వివిధ పోటీల్లో 1.8 శాతం నుంచి 4.5 శాతం వరకు ఇతర మహిళా అథ్లెట్లకన్నా ఎక్కువ ఫలితం పొందగలరని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురించిన ఆర్టికల్‌ను ఐఏఏఎఫ్ సాక్ష్యంగా పేర్కొననుంది.
గతంలో జరిగిందిదీ...
ఉండాల్సిన స్థాయికన్నా అధికంగా పురుష హార్మోన్లు (టెస్టోస్టిరాన్) ఉన్నట్టు పరీక్షలో తేలడంతో ఐఏఏఎఫ్ హైపరాండ్రోజెనిజమ్ పాలసీ ప్రకారం 2014లో భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) ద్యుతీచంద్‌పై వేటు వేసింది. అయితే ఏఎఫ్‌ఐపై ఆ ఏడాది సెప్టెంబర్‌లో ఆమె సీఏఎస్‌లో సవాల్ చేసింది. ఈ విషయంలో ద్యుతికి క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి ఆర్థికంగా సహాయం కూడా అందింది. అయితే ఆమెలో పురుష హార్మోన్లు ఇతరులకన్నా అధికంగా ఉన్నట్టు స్పష్టమైన ఆధారాలు లేవని క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు 2015 జూలై 27న మధ్యంతర తీర్పునిచ్చి ఊరట కలిగించింది.