మా పాప వయసు ఎనిమిది నెలలు. పాపకు తల ఎడమవైపున ఫ్లాట్‌గా ఉంది. దీనికి ఏదైనా చికిత్స అవసరమా?
- వీణ, నిడదవోలు
మీరు చెబుతున్నదాన్ని బట్టి మీ పాపకు పొజిషనల్ సెఫాలీ అనే కండిషన్ ఉందని అనిపిస్తోంది.పిల్లలను ఎప్పుడూ ఒకే పొజిషన్‌లో పడుకోబెట్టినప్పుడు ఈ సమస్య కనిపిస్తుంది. పిల్లలు పడుకున్నప్పుడు వాళ్ల తల పొజిషన్‌ను తరచూ మారుస్తుండటం చాలా అవసరం. మెడ కండరాలకు సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే ఒకసారి డాక్టర్‌కు చూపించి దానికి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. పొజిషనల్ సెఫాలీ అయితే చిన్నారులు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య అదే సర్దుకుంటుంది. దీని వల్ల మెదడుపై ఎలాంటి ప్రభావం ఉండదు. మీరు ఒకసారి మీ పాపను పీడియాట్రిషి యన్‌కు చూపించి ఇది పొజిషనల్ సమస్యేనా, లేదా ఇతరత్రా ఏవైనా సమస్యలున్నాయా అని తెలుసుకోండి.
మా పాప వయస్సు ఆరేళ్లు. రెండు నెలల క్రితం మా పాపకు జలుబు వస్తే ఈఎన్‌టీ స్పెషలిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాం .సమస్య తగ్గింది అయితే ఇప్పుడు మళ్లీ మరో పక్క చెవి నొప్పిగా ఉందని అంటోంది. ఇలా జరిగే అవకాశం ఉందా?
శాంతిశ్రీ, భీమవరం
మీ పాపకు ఉన్న కండిషన్‌ను ‘అడినాయిడైటిస్ విత్ యూస్టేషియన్ కెటార్’ అని చెప్పవచ్చు. ఎడినాయిడ్స్ అనే గ్రంధులు ముక్కు వెనకాల, టాన్సిల్ పైన ఉంటాయి. ఈ గ్రంథులకు టాన్సిల్స్ తరహాలో ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇలాంటిది జరిగినప్పుడు మధ్య చెవి నుంచి ముక్కు వెనుక భాగంలో ఉండే యూస్టేషియన్ ట్యూబులో కొన్ని మార్పులు జరగవచ్చు. ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సైనసైటిస్, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, నోటితో గాలి పీల్చడం, నిద్రపట్టడంలో ఇబ్బంది వంటి లక్షణాలూ రావచ్చు. ఇలాంటి పిల్లలకు యాంటీహిస్టమిన్, యాంటీ బయాటిక్ కోర్సులతో చికిత్స చేయాలి. నొప్పి ఉంటే పెయిన్ మెడికేషన్ కూడా అవసరం కావచ్చు. . మీరు ఒకసారి పీడియాట్రీషియన్ లేదా ఈఎన్‌టీ సర్జన్‌ను సంప్రదించండి.
డాక్టర్ రమేశ్‌బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్
స్టార్ హాస్పిటల్స్,బంజారాహిల్స్, హైదరాబాద్
పీడియాట్రీ కౌన్సెలింగ్
Published Sat, May 9 2015 2:44 AM | Last Updated on Tue, Sep 18 2018 7:36 PM
Advertisement
Advertisement