స్వైన్‌ఫ్లూ కౌన్సెలింగ్‌ | Counseling swine flu | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూ కౌన్సెలింగ్‌

Published Thu, Apr 6 2017 12:42 AM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM

స్వైన్‌ఫ్లూ కౌన్సెలింగ్‌

స్వైన్‌ఫ్లూ కౌన్సెలింగ్‌

మామూలు జలుబులా కనిపిస్తూ సమస్యలు సృష్టించే స్వైన్‌ఫ్లూ!

నా వయసు 25 ఏళ్లు. చిన్నప్పటి నుంచి నాకు తరచు జలుబు చేస్తోంది. డాక్టర్ల్‌ దానివల్ల ప్రమాదం ఏదీ లేదని, శరీర తత్వం వల్ల కొందరికి తేలిగ్గా జలుబు చేస్తుందని చెప్పారు. రెండేళ్ల కిందట ఒక కాల్‌ సెంటర్‌లో ఉద్యోగిగా చేరాను. చల్లగా ఉండే వాతావరణంలో ఉండటం వల్ల మరింత తరచుగా నాకు జలుబు చేస్తోంది. ఈ మధ్య తరచూ వార్తా పత్రికల్లో స్వైన్‌ఫ్లూ కేసుల గూర్చి వార్తలు వినవస్తున్నాయి. నాకు ఆ రకమైన జలుబు వస్తుందేమోనని భయంగా ఉంది. స్వైన్‌ఫ్లూ అంటే ఏమిటి? ఎవరికి వస్తుంది? దానిని ఎలా గుర్తించాలి? తెలియజేయండి.
– కవిత, సికింద్రాబాద్‌

స్వైన్‌ఫ్లూ అనేది ఇన్‌ఫ్లుయెంజా–ఏ అనే వైరస్‌ వల్ల వచ్చే శ్వాససంబంధిత వ్యాధి. ఇది సాధారణ జలుబుకు పూర్తిగా భిన్నమైనది.
వ్యాధి లక్షణాల విషయానికి వస్తే ఇతర ఫ్లూ రకాల మాదిరిగా దీనిలోనూ జ్వరం, దగ్గు, గొంతులో మంట, తలనొప్పి, వణుకు, కండరాల–కీళ్లనొప్పులు ఉంటాయి. కొంతమందిలో వీటికి తోడు వాంతులు, విరేచనాలు కూడా కనిపిస్తాయి. వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు లక్షల సంఖ్యలో వైరస్‌లు గది వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. గది తలుపులకు ఉన్న హ్యాండిల్స్, వాష్‌ బేసిన్‌లలోని కుళాయిల పైన పడ్డ తుంపర్ల నుంచి వైరస్‌ ఆ తర్వాత ముట్టుకున్న వారి చేతలకు అంటడం ద్వారా, గాలిలో తేలియాడుతున్న వైరస్‌లు శ్వాస ద్వారా ఆ పరిసరాల్లో వ్యక్తుల శరీరంలోకి ప్రవేశిస్తాయి.

వ్యాధిగ్రస్తుడైన వ్యక్తికి సన్నిహితంగా మెలగడం ద్వారా కూడా స్వైన్‌ ఫ్లూ ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. మీరు పనిచేసే చోట స్వైన్‌ ఫ్లూ వ్యాధిగ్రస్తులు ఉంటే తప్పించి కేవలం చల్లటి వాతావరణంలో పనిచేయడం వల్ల స్వైన్‌ఫ్లూ సోకే అవకాశం ఎంతమాత్రమూ లేదు. పందిమాసం తినడం వల్ల స్వైన్‌ఫ్లూ వస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. పందుల పెంపకం కేంద్రాలలో పనిచేసేవారు, ఇళ్లలో పందులను పెంచేవారికి మాత్రం వాటి నుంచి స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకే అవకాశం ఉంది.

స్వైన్‌ఫ్లూ నివారణకు కచ్చితమైన మార్గం వ్యాక్సినేషన్‌ (టీకా) వేయించుకోవడమే. ఈ వ్యాక్సిన్‌ సూదిమందు, నేసల్‌ స్ప్రే రూపాలలో లభిస్తున్నది. వ్యాధికారక వైరస్‌లను బలహీనపరచి దీనిని తయారుచేస్తారు. సూదిమందుగానో లేక నేసల్‌స్ప్రేగానో ఈ వ్యాక్సిన్‌ ఇవ్వడం వల్ల వ్యక్తిలో సైన్‌ఫ్లూ వ్యాధిని ఎదుర్కోగల రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది. ఆరు నెలల పసివాళ్లు మొదలుకొని వయోవృద్ధుల వరకు అందరూ ముందుజాగ్రత్త చర్యగా స్వైన్‌ఫ్లూ వ్యాక్సినేషన్‌ తీసుకోవచ్చు.

స్వైన్‌ఫ్లూ వల్ల కలిగే తీవ్ర అసౌకర్యానికి తోడు ఈ వ్యాధి కారణంగా నిమోనియా, శ్వాసకోశాల ఇన్ఫెక్షన్ల వంటి ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ముందుజాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఇప్పటికే ఆస్తమా, డయాబెటిస్‌ ఉన్నవారిలో స్వైన్‌ఫ్లూ వల్ల పరిస్థితి మరింత విషమిస్తుంటుంది. అందువల్ల జలుబుకు తోడు పొట్టలో నొప్పి, తీవ్రమైన వాంతులు, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు  కనిపిస్తున్నప్పుడు వెంటనే డాక్టర్‌కు చూపించుకోవడం అవసరం.
డాక్టర్‌ వి. నాగార్జున మాటూరు
సీనియర్‌ పల్మనాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్‌


పైల్స్‌... మందులతో తగ్గుతుందా!
హోమియో కౌన్సెలింగ్‌

నా వయసు 40 ఏళ్లు. నాకు గత మూడు నెలలుగా మల విసర్జన సమయంలో రక్తం పడుతోంది. మలద్వారం వద్ద బుడిపెలా ఏర్పడి నొప్పి, మంట ఉంటున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే పైల్స్‌ అని చెప్పారు. ఈ సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా?
– స్వరూప, కొత్తగూడెం

పైల్స్‌ అనేది మారుతున్న జీవనశైలి, మారుతున్న ఆహార అలవాట్లు, వంశపారంపర్యంగా వచ్చే వ్యాధుల్లో ఒకటి. తరచూ వచ్చే సమస్యల్లో ఇదీ ఒకటి. మలాశయం లోపల, బయట చిన్న బుడిపెల రూపంలో ఇవి ఏర్పడతాయి. మల ద్వారం చివర్లో ఉన్న సిరలలో మార్పుల వల్ల అవి ఉబ్బడం వల్ల ఏర్పడతాయి. ఈ వ్యాధిలో మొత్తం నాలుగు దశలుంటాయి.

గ్రేడ్‌ – 1: మొలలు పైకి కనిపించవు. నొప్పి ఉండదు. కానీ రక్తం పడుతుంది.
గ్రేడ్‌ – 2: రక్తం పడవచ్చు – పడకపోవచ్చు. కానీ మొలలు బయటకు వస్తాయి. మల విసర్జన తర్వాత వాటంతట అవే లోపలికి పోతాయి.
గ్రేడ్‌ – 3: మల విసర్జన చేసినప్పుడు పైల్స్‌ బయటకు వస్తాయి. కానీ వేలితో నెడితేనే లోపలికి వెళ్తాయి.
గ్రేడ్‌ – 4: మొలలు బయటే ఉంటాయి. నెట్టినా అవి లోపలికి వెళ్లవు.

నివారణ: మలబద్దకం లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. చాలా ఎక్కువ సేపు కూర్చొని పనిచేసే వారికి మొలల సమస్య వస్తుందని భావిస్తారు. అది కేవలం అపోహ. సరైన వ్యాయామం, శారీరక శ్రమ లేనివారికి మలబద్దకం వచ్చే అవకాశం ఉంది.కొబ్బరినీళ్లు తీసుకోవడం, మెత్తటి పరుపు మీద కూర్చోవడం, వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల ఈ సమస్య నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. నూనెలో వేయించిన మాంసం, బిర్యానీ, ఆలుగడ్డ, చామదుంప వంటి వాటి వల్ల సమస్య పెరుగుతుంది.

ఎక్కువ ప్రయాణాలు చేస్తూ, సరైన ఆహారం తీసుకోని వారికి, మానసిక ఒత్తిడి అధికంగా ఉండటం, అధిక వేడి ప్రదేశంలో పనిచేసేవారికి, గర్భస్రావం తర్వాత స్త్రీలకు ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. నీరు ఎక్కువగా తీసుకోవడం, పీచుపదార్థాలు తినడం (బీరకాయ, ఆనప, బచ్చలి) వల్ల ఈ సమస్య నుంచి కొద్దిగా ఉపశమనం పొందవచ్చు .హోమియోలో వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను బట్టి కాన్‌స్టిట్యూషన్‌ చికిత్స ఇచ్చి వ్యాధి నిరోధకత పెంచడం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించడం జరుగుతుంది. ఇలా సమస్యను పూర్తిగా అదుపులోకి తీసుకువస్తారు.
డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి సీనియర్‌ డాక్టర్‌
పాజిటివ్‌ హోమియోపతి హైదరాబాద్‌


తగినంత బరువు పెరగవచ్చు !
హోమియో కౌన్సెలింగ్‌

నా వయసు 24 ఏళ్లు. సన్నగా ఉంటాను. ఎంత తిన్నా లావుకావడం లేదు. ఎప్పుడూ నీరసంగా, చర్మం పొడిబారినట్లుగా ఉంటోంది. టానిక్కులు తాగినా బరువు పెరగడం లేదు. నా సమస్యకు హోమియోలో మందులు ఉన్నాయా?
– సునీత, నిజామాబాద్‌

వ్యక్తి ఆరోగ్యానికి... కావలసిన బరువు ఉండడం చాలా అవసరం. మెదడు సామర్థ్యాన్ని, వ్యాధి నిరోధక శక్తిని బట్టి ఆరోగ్యవంతంగా ఉన్నామని చెప్పలేం. బరువు అనేది మన శరీర పోషణ, జీర్ణశక్తి, జీర్ణమైన ఆహారాన్ని గ్రహించుకునే శక్తి... లాంటి పలు అంశాలను నిర్ణయిస్తుంది. అధిక బరువు వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అందుకని చాలామంది అధికంగా బరువు పెరగకుండా అదుపులో ఉంచుకుంటున్నారు. అలాగే కొంతమంది తక్కువ బరువు ఉన్నవారు ఎంతగా ప్రయత్నించినా బరువు పెరగరు. కొందరి శరీర ఆకృతి అలా ఉంటుంది. తక్కువ బరువు ఉన్న వారు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది అమ్మాయిలే గాక, అబ్బాయిలు, వారి వయసుకు తగినంత బరువు ఉండరు.

ఉండాల్సిన దానికంటే తక్కువ బరువు ఉన్నవారు ఏదో ఒక కారణంతో బాధపడుతూ ఉంటారు. ఇది వ్యాధి వల్ల కాదు. జీర్ణశక్తి తగ్గిపోవడం వల్లనే. బరువు తక్కువగా ఉంటే ఇతర వ్యాధులు త్వరగా సోకుతాయి. బరువు పెరగడానికి తమ ఆహార నియమావళిలో మార్పులను, శారీరక శ్రమలో మార్పులను చేసుకోవాల్సి ఉంటుంది.

తక్కువ బరువుకు కారణాలు:  పని ఒత్తిడి, ప్రశాంత జీవనానికి దూరంగా ఉండటం. చిరాకు, దుఃఖం. విరేచనాలు, డయాబెటిస్, థైరాయిడ్‌ వంటి వ్యాధులు . సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం . ఆహారంలో అవసరమైన విటమిన్లు, మినరల్స్‌ లేకపోవడం. అతిగా శారీరక శ్రమ చేయడం, మానసిక సమస్యలు.
లక్షణాలు:  అలసట, నీరసం  త్వరగా అలసిపోవడం  బలహీనంగా ఉండటం  ఆకలి ఎక్కువగా లేకపోవడం
వ్యాధి నిర్ధారణ: బీఎంఐ
చికిత్స: హోమియో వైద్యవిధానంలో ఈ తక్కువ బరువు (అండర్‌ వెయిట్‌) అనే పరిస్థితికి చికిత్స అందించడానికి దాదాపు 50 నుంచి 60 వరకు మందులు ఉన్నాయి. ఉదా: కాల్కేరియా ఫాస్, అర్జంటమ్, నైట్రికమ్, సిలికా, అయోడమ్, ఆరమ్‌మెట్‌ మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. హోమియో మందులు ఇచ్చే ముందు శారీరక, మానసిక పరిస్థితులు, ఆరోగ్య అలవాట్లు వంటి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఒంట్లో స్రవించే హార్మోన్ల సమతౌల్యతను చక్కదిద్దాల్సి కూడా రావచ్చు. ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తే ఈ సమస్యను అధిగమించ వచ్చు.
డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డిఎండీ (హోమియో)
స్టార్‌ హోమియోపతి హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement