50 రోజుల్లో 52 మంది మృతి | Swine flu spreads hyderabad, 52 died with in 50days | Sakshi
Sakshi News home page

50 రోజుల్లో 52 మంది మృతి

Published Sun, Feb 22 2015 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM

Swine flu spreads hyderabad, 52 died with in 50days

కొనసాగుతున్న స్వైన్‌ఫ్లూ ఉధృతి
9 మంది ట్రైనీ ఐపీఎస్‌లకు సోకిన వైరస్

 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో చలి తగ్గుముఖం పట్టింది. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మండే ఎండలకు వాతావరణంలో వైరస్ తీవ్రత కొంత తగ్గుతుందని భావించినా.. గ్రేటర్‌లో మాత్రం ఫ్లూ వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. శనివారం ఒక స్వైన్‌ఫ్లూ మరణం నమోదైంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 20 వరకు 3,777 నమూనాలు పరీక్షించగా, 1,233 మందికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు తేలింది. వీరిలో 52 మంది మృతి చెందగా, ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే 42 మంది మరణించడం ఆందోళనకరం. శనివారం ఒక్కరోజే 128 నమూనాలు పరీక్షించగా, 47 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 56 మంది చికిత్స పొందుతున్నారని ఆస్పత్రి నోడల్ అధికారి డాక్టర్ నర్సింహులు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి మండలం జిల్లెల గ్రామానికి చెందిన ఎల్లమ్మ (36) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఐదుగురు అనుమానితులు చికిత్స పొందుతుండగా, ఫీవర్ ఆస్పత్రిలో పది మంది చికిత్స పొందుతున్నారు.
 
 జాతీయ పోలీసు అకాడమీలో కలకలం
 హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్న తొమ్మిది మంది ఐపీఎస్ ట్రైనీలు స్వైన్‌ఫ్లూ బారిన పడ్డారు. తిరుపతి ఉపఎన్నికల పరిశీలనకు వెళ్లి ఆదివారం అకాడమీకి తిరిగొచ్చిన శిక్షణార్థుల్లో కొందరు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం, గొంతు నొప్పి, దగ్గు లక్షణాలతో అకాడమీలోని ఆస్పత్రిలో చేరారు. వీరి నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపగా.. తొమ్మిది మందికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు తేలింది. వీరు అపోలో, యశోద ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి మెరుగవవడంతో శనివారం డిశ్చార్జి అయ్యారు. ఒకేసారి తొమ్మిది మందికి సోకడంతో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రంగారెడ్డి జిల్లా ఎపిడెమిక్(అంటువ్యాధుల) విభాగం ప్రత్యేకాధికారి జి.శ్రీనివాస రావు, జిల్లా ఆరోగ్య నిఘా అధికారి డాక్టర్ లలిత పోలీసు అకాడమీని సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్ అకాడమీలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement