కమ్ముకున్న జ్వరం | Do not worry about swineflu first and be aware of it first. | Sakshi
Sakshi News home page

కమ్ముకున్న జ్వరం

Published Thu, Nov 15 2018 12:58 AM | Last Updated on Thu, Nov 15 2018 1:06 AM

Do not worry about swineflu first and be aware of it first. - Sakshi

స్వైన్‌ఫ్లూ గురించి ఆందోళన వద్దు మొదట దాన్ని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడు నివారణ ఎంత తేలికో అర్థమవుతుంది. సమర్థంగా నివారిస్తే చికిత్స తప్పిపోతుంది అసలది రాకుండా ఉండాలంటే టీకా ఉండనే ఉంది. 

చలి ప్రారంభమైంది. వ్యాధులు విజృంభించడానికి ఇది అనువైన కాలం. జ్వరాలు పెచ్చరిల్లే కాలం. సాధారణ జలుబు, జ్వరం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేకున్నా ఈ కాలంలోనే ఎక్కువగా దాడి చేసే స్వైన్‌ ఫ్లూ గురించి అప్రమత్తంగా ఉండాలి. స్వైన్‌ఫ్లూ లక్షణాలన్నీ మామూలు జలుబులాగే అనిపిస్తుంటాయి. కానీ సాధారణ జలుబు కంటే ఇది ఒకింత ప్రమాదకరం. తీవ్రత కూడా ఎక్కువ. అందుకే దీని గురించి తెలుసుకోవడం మరింత అవసరం. 

ఏమిటీ వైరస్‌? 
‘స్వైన్‌ఫ్లూ’ను హాగ్‌ ఫ్లూ, పిగ్‌ ఫ్లూ అని కూడా అంటారు.  స్వైన్‌ఫ్లూ అంటే పంది నుంచి వచ్చే ఫ్లూ అని అర్థం. జలుబుతో వచ్చే సాధారణ (ఫ్లూ) జ్వరానికి ఇన్‌ఫ్లుయెంజా అనే వైరస్‌ కారణమవుతుంది. ప్రధానంగా గాలి, దగ్గు, తుమ్ము తాలూకు తుంపర్ల ద్వారానే ఈ వైరస్‌ రోగి నుంచి మామూలు వ్యక్తికి వ్యాపిస్తుంది. ఫ్లూకు కారణమయ్యే ఇన్‌ఫ్లుయెంజాలో అనేక రకాల వైరస్‌లు ఉన్నాయి. స్వైన్‌ఫ్లూనకు కారణమయ్యే వైరస్‌ను ‘హెచ్‌1ఎన్‌1’ వైరస్‌గా నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా ఈ తరహా వైరస్‌లను ‘ఇన్‌ఫ్లుయెంజా ఎ’ అనీ, ‘ఇన్‌ఫ్లుయెంజా బీ’ అని, ‘ఇన్‌ఫ్లుయెంజా సి’ అని మూడురకాలుగా వర్గీకరిస్తారు. ఇందులో ‘ఇన్‌ఫ్లుయెంజా బీ’ అన్న రకం పందుల్లో ఉండదు. కానీ ‘ఇన్‌ఫ్లుయెంజా ఎ’, ‘ఇన్‌ఫ్లుయెంజా సి’ రెండూ పందుల్లో కనిపిస్తాయి. అందులో ప్రస్తుతం కనిపిస్తున్న వైరస్‌ ‘ఇన్‌ఫ్లుయెంజా ఎ’ గ్రూపునకు చాలా దగ్గరగా ఉంది. అలాంటి వైరస్‌లో ఒకటైన ఇది కొన్ని మ్యూటేషన్స్‌కు గురై, మానవులకు సోకే విధంగా రూపొందిందని నిపుణుల మాట. ఈ వైరస్‌ గతంలో పందుల్లో కనుగొన్న వైరస్‌తో పూర్తిగా సరిపోలడం లేదు.దాంతో సాధారణ పరిభాషలో ప్రస్తుతం ‘స్వైన్‌ ఫ్లూ’గా అభివర్ణిస్తున్న ఈ వైరస్‌ను నిపుణులు ‘క్వాడ్రపుల్‌ రీ–అసార్టెంట్‌’ వైరస్‌ అని అంటున్నారు. అంటే ఇందులో పందులకు వచ్చే వైరస్‌ల జీన్స్, పక్షులకు వచ్చే వైరస్‌ల జీన్స్, మానవులకు వచ్చే వైరస్‌ల జీన్స్‌... ఇలా నాలుగు జీన్స్‌ ఉన్నా... రెండూ పందులకు వచ్చేవే ఉండటంతో దీన్ని ‘స్వైన్‌ ఫ్లూ’ అని పిలుస్తున్నారు. 

పిల్లల్లో ఈ కింది లక్షణాలు కనిపిస్తే... 
ఆయాసపడుతున్నా లేదా శ్వాస అందడంలో ఇబ్బంది ఉన్నాచర్మం రంగు నీలంగా లేదా బూడిద రంగు (గ్రే)గా మారినా తగినంతగా ద్రవ పదార్థాలు తాగలేకపోతున్నా వాంతులు అవుతున్నా సరిగ్గా నడవలేకపోతున్నా లేదా సంభాషించలేకపోతున్నా తట్టుకోలేనట్లుగా కనిపిస్తూ అస్థిమితంగా ఉన్నా ఫ్లూ లక్షణాలు తగ్గినా జ్వరం, దగ్గు మళ్లీ మళ్లీ వస్తున్నా... వెంటనే అలాంటి పిల్లలను వైద్య సహాయం కోసం డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లాలి. 

పెద్దలలో ఈ కింది లక్షణాలు కనిపిస్తే... 
ఆయాసపడుతున్నా లేదా శ్వాస అందకపోయినా ఛాతిలో నొప్పి, కడుపులో నొప్పి లేదా పట్టేసినట్లుగా ఉన్నా అకస్మాత్తుగా తలతిరుగుతున్నట్లు అనిపించినా అయోమయంగా అనిపించినా ఆగకుండా తీవ్రంగా వాంతులు అవుతున్నా ఫ్లూ లక్షణాలు తగ్గినా దగ్గు, జ్వరం మళ్లీ వచ్చినా... అలాంటి పెద్దవాళ్లూ (అడల్ట్స్‌) కూడా వైద్య సహాయం కోసం వెంటనే డాక్టర్‌ను కలవాలి. 

వ్యాప్తిచెందే అవకాశాలిలా... 
ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి గాలి ద్వారా సోకుతుంది.  దగ్గడం, తుమ్మడం వంటి చర్యలతో గాలిలో కలిసి ఈ వైరస్‌ ఒకరినుంచి ఒకరికి వ్యాపించవచ్చు. అలాగే రోగి ముట్టుకున్న ప్రదేశాలను ఆరోగ్యవంతులు ముట్టుకున్నప్పుడు కూడా ఇది వ్యాపిస్తుంది. 

స్వైన్‌ఫ్లూ ...మరికొన్ని వ్యాధులకు  మార్గం చూపచ్చు...
స్వైన్‌ఫ్లూ విషయంలో మరికాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వ్యాధి గ్రస్తులకు మరికొన్ని వ్యాధులు తేలిగ్గా సంక్రమించే అవకాశం ఉంది. ఉదాహరణకు న్యుమోనియా, బ్రాంకైటిస్, సైనస్‌ ఇన్ఫెక్షన్, చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు తేలిగ్గా వస్తాయి. ఇలాంటి వాళ్లు అక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌ (ఏఆర్‌డీఎస్‌) బారిన పడే అవకాశం ఉంది. అందుకే ఈ వ్యాధులను ఫ్లూ–రిలేటెడ్‌ కాంప్లికేషన్స్‌ అంటారు. ఉదాహరణకు ఆస్తమా ఉన్న వ్యక్తికిగానీ లేదా హార్ట్‌ ఎటాక్‌ వచ్చిన వ్యక్తికిగానీ స్వైన్‌ఫ్లూ సోకితే అది మరింత ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది.

ఏయే పరిస్థితుల్లో వైరస్‌ మనుగడ సాగించలేదంటే...
కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో స్వైన్‌ఫ్లూ వైరస్‌ మనుగడ సాగించలేదు. 75 డిగ్రీల సెంటీగ్రేడ్‌ నుంచి 100 డిగ్రీల సెంటీగ్రేడ్‌ (167–212 డిగ్రీల ఫారెన్‌హీట్‌) ఉష్ణోగ్రత వద్ద ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ బతికి ఉండే అవకాశం లేదు. క్లోరిన్, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ వంటి జెర్మిసైడ్స్, డిటర్జెంట్‌ సబ్బుల వల్ల కూడా వైరస్‌ నిర్మూలన జరుగుతుంది. ఆల్కహాల్‌ బేస్‌డ్‌ హ్యాండ్‌వైప్స్, జెల్స్‌ వంటివీ వైరస్‌ను నిర్మూలిస్తాయి. 

చికిత్స...
సాధారణ ఫ్లూకు లాగే దీనికీ చికిత్స చేస్తారు. అయితే... ఫ్లూకు సంబంధించిన సాధారణ లక్షణాలు కనిపించగానే ఇష్టం వచ్చినట్లుగా యాంటీబయోటిక్స్‌  యాంటీవైరల్‌ మందులను ఉపయోగించడం ఎంతమాత్రం సరికాదు. తప్పనిసరిగా డాక్టర్‌ దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. సాధారణ యాంటీవైరల్‌ మందులను మాత్రం డాక్టర్‌ సలహా మేరకు వాడవచ్చు.  సాధారణ ఫ్లూ లక్షణాలు కనిపించగానే  యాంటీవైరల్‌ మందులు వాడటం వల్ల మామూలు వైరస్‌లకూ మందులను ఎదుర్కొనే శక్తిని (రెసిస్ట్‌ చేసే శక్తి లేదా రెసిస్టెన్స్‌) మరింతగా పెరుగుతుంది.  ఒకవేళ యాంటీవైరల్‌ మందులనే వాడాల్సి వస్తే డాక్టర్లు తమ విచక్షణతోనూ, అనుభవంతోనూ ఆ విషయాన్ని నిర్ధారణ చేస్తారు. 

వీళ్లు కాస్త హైరిస్క్‌ వ్యక్తులు... 
సాధారణంగా మిగతా వారితో పోలిస్తే కొంత మంది స్వైన్‌ఫ్లూకు గురయ్యే అవకాశం ఎక్కువ. వాళ్లెవరంటే...  65 ఏళ్లు పైబడిన వృద్ధులు, ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు, గర్భిణులు, యుక్తవయస్కుల్లో ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు స్వైన్‌ ఫ్లూ వ్యాధి వ్యాపించడానికి అవకాశం ఉన్నవారిగా పరిగణిస్తారు. డయాబెటిస్, గుండెజబ్బులు, ఆస్తమా, సీఓపీడీ (క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మునరీ డిసీజ్‌) లాంటి ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులున్నవారు, మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు, నరాల వ్యాధిగ్రస్తులు, ఎండోక్రైన్‌ వ్యవస్థలో లోపాలున్న వ్యాధిగ్రస్తులు, కాలేయ వ్యాధులు ఉన్నవారు, దీర్ఘకాలంగా ఆస్పిరిన్, స్టెరాయిడ్స్‌ వంటి మందులు తీసుకుంటున్నవారు, హెచ్‌ఐవీ వంటి ఇమ్యూనిటీ తక్కువయ్యే వ్యాధులుండేవారిని హైరిస్క్‌ గ్రూపునకు చెందినవారిగా పేర్కొనవచ్చు. 

సాధారణ లక్షణాలివే... 
సాధారణ ఫ్లూ జ్వరంలో ఉండే లక్షణాలే దీన్లోనూ కనిపిస్తాయి. అంటే కాస్తంత జ్వరం, దగ్గు, గొంతులో ఇన్ఫెక్షన్, గొంతులో గరగర, ముక్కు దిబ్బడ,  ముక్కుకారడం, ఒంటినొప్పులు, తలనొప్పి, చలి, అలసట, నీరసం, కళ్లు–ముక్కు ఎర్రబారడం, కడుపులో నొప్పి... లాంటి లక్షణాలు ఇందులో ఉంటాయి. కొందరిలో వాంతులు, విరేచనాలు కూడా కనిపించవచ్చు.

టీకాతో కచ్చితమైన నివారణ...
స్వైన్‌ ఫ్లూకు వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది. కచ్చితమైన నివారణ కోసం వ్యాక్సిన్‌ తీసుకోవడం మేలు. ఈ వ్యాక్సిన్‌ సూదిమందు, నేసల్‌ స్ప్రే రూపాలలో లభిస్తున్నది. సూదిమందుగానో లేక నేసల్‌స్ప్రేగానో ఈ వ్యాక్సిన్‌ ఇవ్వడం వల్ల వ్యక్తిలో సైన్‌ఫ్లూ వ్యాధిని ఎదుర్కోగల రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది. ఆరు నెలల పసివాళ్లు మొదలుకొని వయోవృద్ధుల వరకు అందరూ ముందుజాగ్రత్త చర్యగా స్వైన్‌ఫ్లూ వ్యాక్సినేషన్‌ తీసుకోవచ్చు. ఈ టీకాను గర్భిణీలు కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. రోగికి దగ్గర ఉండేవారు కీమోప్రొఫిలాక్సిస్‌ మందులను తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వ్యాధి వచ్చే అవకాశాలను ఎక్కువగా ఉండే హెల్త్‌ ఇండస్ట్రీకి చెందిన డాక్టర్లు, నర్స్‌లకు ప్రభుత్వమే ఈ ప్రొఫిలాక్టిక్‌ మందులను ఇస్తుంటుంది.

నివారణ ఇలా... 
దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు ఎదుటివారిపై తుంపర్లు పడకుండా రుమాలును అడ్డుపెట్టుకోవాలి. రుమాలు లేనప్పుడు వ్యక్తులు విధిగా తమ మోచేతి మడతలో ముక్కు, నోటిని దూర్చి తుమ్మాలి. దీని వల్ల వైరస్‌ లేదా వ్యాధిని సంక్రమింపజేసే ఇతర సూక్ష్మజీవులు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించవు. దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు చేతులను అడ్డుపెట్టుకున్నవారు ఆ తర్వాత వాటిని  శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. దగ్గు, తుమ్ము సమయంలో ఉపయోగించిన రుమాలు/టిష్యూను వేరొకరు ఉపయోగించకూడదు.దాన్ని తప్పనిసరిగా డిస్పోజ్‌ చేయాలి. జలుబు లేదా ఫ్లూ ఉన్న వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. ఇలాంటి రోగులు తమ లక్షణాలు తగ్గిన 24 గంటల తర్వాత కూడా ఒకటి రెండురోజులు అందరి నుంచి దూరంగా ఉండటమే మంచిది. జ్వరంతో ఉన్నవారు పిల్లల ఆటవస్తువులను ముట్టుకోకపోవడమే మేలు. పరిసరాలను, కిచెన్లను, బాత్‌రూమ్‌లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోగి పక్కబట్టలను, పాత్రలను విడిగా శుభ్రపరచాల్సినంత అవసరం లేదు. వ్యక్తిగత పరిశుభ్రత కోసం ఒకరి బట్టలు, పక్కబట్టలు, పాత్రలను మరొకరు ఉపయోగించకపోవడం మంచిదే. పబ్లిక్‌ ప్లేసెస్‌లో ఒకే బాత్‌రూమ్‌ ఉపయోగించినప్పుడు అందరూ తలుపు హ్యాండిల్‌గాని, కొళాయి నాబ్‌ ఉపయోగించినప్పుడు ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దాన్నే ఫొమైట్‌ ట్రాన్స్‌మిషన్‌ అంటారు. కాబట్టి హ్యాండిల్స్‌/నాబ్స్‌ను ఉపయోగించినతర్వాత చేతులను తప్పనిసరిగా ‘హ్యాండ్‌ శానిటైజర్స్‌’తో శుభ్రం చేసుకోవడం అవసరం. పబ్లిక్‌ ప్రదేశాలలో మాస్క్‌ వాడటం  కొంత మేరకు మంచిదే.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement