న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో జ్వరం, దగ్గు, జలుబు మందులు కొనుగోలు చేసిన వ్యక్తుల సమాచారాన్ని సేకరించాల్సిందిగా మందుల షాపులకు కొన్ని రాష్ట్రాలు ఆదేశాలు జారీచేశాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర, ఒరిస్సా, బీహార్‌లోని కొన్ని ప్రాంతాల్లోని మెడికల్ షాపులకు ఈ ఆదేశాలు జారీచేశారు. కోవిడ్ –19 లక్షణాలు ఉన్నప్పటికీ పరీక్షలు చేయించుకోకుండా, తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. కోవిడ్ లక్షణాలైన జ్వరం, దగ్గు, జలుబు మందులు కొనుగోలు చేసిన వ్యక్తుల ఫోన్ నంబర్, అడ్రస్‌లను తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కరోనా లక్షణాలను దాచి ఉంచే అవకాశం ఇవ్వకుండా పై అధికారులకు ఈ సమాచారం చేరుస్తారనీ, ఇది కేవలం ముందు జాగ్రత్త చర్య మాత్రమేనని అధికారులు తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం లాంటి కరోనా లక్షణాలు కనిపించినప్పటికీ, ఎవరైనా ఏమైనా అనుకుంటారనే భయంతోనూ, సంశయంతోనూ కొందరు సొంత వైద్యం చేసుకుంటున్నారని తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment