
రాజ్యం, అధికారం, సంపదల కంటె సత్యం, ధర్మం ఎంతో విలువైనవిగా ఎంచి బుద్ధుడు అన్నిటినీ త్యజించి భిక్షువుగా మారాడు. భిక్షుసంఘాన్ని స్థాపించి ధర్మప్రబోధాలు చేస్తూ దేశదేశాలు తిరుగుతున్నాడు.శాక్యవంశానికి చెందిన యువరాజులు అనిరుత్థుడు, భిద్ధయుడు, ఆనందుడు, కింబిలుడు, దేవదత్తుడు అనే ఐదుగురు భిక్షువులుగా మారాలని నిర్ణయించుకున్నారు. ఒకరోజున వారు తమ ఇంట్లోని వారికి చెప్పకుండా బయలుదేరారు. వారు తమకు తోడుగా ఆస్థాన క్షురకుడైన ఉపాలిని వెంటతీసుకుని వెళ్లారు. నగర పొలిమేరలు దాటాక, వారు తాము ధరించిన విలువైన వస్త్రాల్ని, ఆభరణాల్ని తీసి మూటగట్టారు. నారబట్టలు ధరించారు. ఉపాలితో కేశఖండనం చేయించుకుని, ‘‘ఓ ఉపాలీ! విలువైన మా వస్త్రాలూ, ఆభరణాలూ నీవు తీసుకో: వాటితో జీవితాంతం హాయిగా జీవించు’’అని వెళ్లిపోయారు. ఆ మూటలు తీసుకుని వెనుదిరిగాడు ఉపాలి. కొంతదూరం పోయాక ఉపాలికి ఒక ఆలోచన వచ్చింది.
‘రాకుమారులు ఇంత విలువైన ఆభరణాలు త్యజించి, వాటిని గడ్డిపోచగా ఎంచి నాకు ఇచ్చేశారు. అంటే... వారు ఈ ఆభరణాల కంటె విలువైనదాన్ని పొందడం కోసమే ఈ పని చేసి ఉంటారు. మరి నాకెందుకూ ఈ ఆభరణాలు? నేను కూడా వారితోనే పోయి ఆ వెలలేని ఆభరణాల్ని పొందాలి’ అనుకుని ఆ వస్త్రాల్ని, మూటల్ని అక్కడే పడేసి, పరుగు పరుగున వచ్చి, వారిని కలిశాడు. ‘‘ఆ విలువైన ఆభరణాల్ని నీవు కూడా అందుకుందువుగాని రా’’ అని చెప్పి వారు తమ వెంట తీసుకుపోయారు. బుద్ధుడు ఆ ఆరుగురిలో ముందుగా ఉపాలికి దీక్ష ఇచ్చాడు. న వరత్నాలు పొదిగిన ఆభరణాల కంటె బుద్ధుడు ప్రవచించిన ధర్మం అనే ఆభరణమే విలువైనదని గ్రహించిన ఉపాలి, అతి తొందరలోనే అగ్రభిక్షువు కాగలిగాడు. ఉపాలికి బౌద్ధసంఘంలో ఎంతటి గౌరవం దక్కిందంటే... బుద్ధుడు నిర్వాణం పొందిన మూడు నెలలకి జరిగిన మొదటి బౌద్ధ సంగీతికి అతడే అధ్యక్షుడు. త్రిపిటకాలలో భిక్షు నియమావళిని బోధించే వినయపిటకం కూర్పుకు సారథి. రత్నాభరణాల్ని వదిలి ధర్మాభరణాన్ని ధరించిన ఉపాలి బౌద్ధసంఘంలో ఒక వజ్రంలా ప్రకాశించాడు.
Comments
Please login to add a commentAdd a comment