మరణించిన మూడేళ్ళ తర్వాత...
ఓ బౌద్ధ సన్యాసి భౌతికకాయం... చైనాలో ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. మరణించి మూడేళ్ళు దాటిన తర్వాత కూడా ఆయన.. గడ్డం, కనుబొమలు కలిగి ఉండటం చూపరులను విస్మయానికి గురి చేస్తోంది. తన జీవితాన్ని బౌద్ధ మతానికి అంకితం చేసిన ఫుహౌ మరణం తర్వాత ఆయన భౌతికకాయాన్ని ఓ తొట్టిలో భద్రపరిచారు. ఫుహౌ మరణానంతరం మూడేళ్ళ తర్వాత బుద్ధుడుగా మారతానని చెప్పాడంటూ అనుచరులు ఇటీవల ఆ బౌద్ధ సన్యాసి మమ్మీని తెరచి చూశారు. విలక్షణంగా ఉండే ఆయన గుబురు గడ్డంతోపాటు.. కనుబొమలు కూడా ఎప్పట్లాగే ఉండటాన్నిచూసి శిష్యగణం నిశ్చేష్టులయ్యారు.
1919 సంవత్సరంలో జన్మించిన ఫుహౌ 2012 జూన్ నెలలో మరణించారు. అప్పటికి ఆయనకు 94 ఏళ్ళ వయసు. పదమూడవ ఏటనే బౌద్ధమతం స్వీకరించిన ఆయన... అప్పట్లో తల నీలాలను తీయించుకొని గుండుతో... తూర్పు ప్రావిన్స్, ప్రధాన నగరం ఖ్వాంన్జులోని ఓ మఠంలో చేరారు. ఆయన ధాతృత్వంతో పులకించిపోయిన సహచరులు ఆయన్ను అమితంగా గౌరవించడం ప్రారంభించారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆయనను ఖ్వాంన్జు ఫుజ్ హావ్ దేవాలయ మఠాధిపతిగా నియమించారు.
బౌద్ధ సన్యాసి అయిన ఫుహౌ మరణించిన మూడేళ్ళకు బుద్ధుడుగా మారతానని చెప్పడంతో ఆయన శరీరాన్ని శిష్యుడైన జియాంగ్ యుఫెంగ్... కమలంవంటి ఓ తొట్టిలో ప్రత్యేక భంగిమలో భద్రపరిచాడు. అయితే గతవారం ఫుజ్ హావ్ ఆలయంలో ఫుహౌను భద్రపరిచిన తొట్టెను తెరిచి చూసిన శిష్యులు... మూడేళ్ళు దాటినా ఆయన శరీరం యథాస్థితిలో ఉండటంతోపాటు.. గడ్డం, కనుబొమలు కలిగి ఉండటంతో ఫుహౌ నిజంగా బుద్ధుని అవతారమేనని ప్రకటించారు. అంతేకాక భవిష్యత్తులో ఆయన శరీరం సురక్షితంగా ఉండేందుకు కావలసిన ఏర్పాట్లు చేసి... ప్రజలు, భక్తులు సందర్శించేందుకు వీలుగా సిద్ధం చేస్తున్నారు.
అయితే ఆధ్యాత్మిక పరమైన బౌద్ధ కర్మల పట్ల చైనాలోని అధిక శాతం ప్రజలు ఎప్పట్నుంచో అనుమానాలు వ్యక్తం చేస్తున్నా... స్థానిక టావోయిజం, ఇస్లాం మతం, ప్రొటెస్టంట్, కాథలిక్ మత సంస్థలతోపాటు బుద్ధిజం కూడా అధికారికంగా ఒకటి కావడంతో సన్యాసులు పారంపర్యంగా వారి సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు.