
పిల్లల్లో ఎదుగుదల లోపాలను నివారించేందుకు రెసిస్టెంట్ స్టార్చ్ బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు ఫ్లిండర్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఆఫ్రికాకు చెందిన పిల్లల వ్యర్థాలను విశ్లేషించడం ద్వారా అరటిపండుతోపాటు వేర్వేరు బీన్స్‌ల ద్వారా శరీరానికి లభించే పిండిపదార్థం ఆరోగ్యానికి మేలు చేస్తుందని గుర్తించారు. పిల్లల్లోని బ్యాక్టీరియా ఈ రకమైన పిండిపదార్థం పూర్తిగా జీర్ణం కాకుండా పేవుల్లో పులియబెట్టి కొన్ని రకాల కొవ్వుల ఉత్పత్తికి సహకరిస్తాయని, ఈ కొవ్వులు కాస్తా కడుపులో వాపు/మంటలు రాకుండా నిరోధిస్తాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. గర్భంలో ఫలదీకరణం చెందింది మొదలు.. పుట్టిన తరువాత రెండేళ్లకాలం వారి ఎదుగుదలకు ఎంతో కీలకమని.. ఈ తొలి వెయ్యి రోజుల కాలంలో పౌష్టికాహారం తీసుకుంటే జీవితాంతం మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చునని ఇప్పటికే జరిగిన అనేక పరిశోధనలు చెబుతున్నాయి.
భారత్‌తోపాటు, ఆఫ్రికాలోనూ లక్షల సంఖ్యలో సవజాత శిశువులు పోషకాహార లోపం బారిన పడటమే కాకుండా.. పూర్తిస్థాయిలో ఎదగలేకపోతున్న నేపథ్యంలో ఈ అధ్యయనానికి ప్రాధాన్యం ఏర్పడింది. కడుపు/పేవుల్లో వాపు/మంటల్లాంటివి లేకపోతే పోషకాలు శరీరానికి ఒంటబట్టి ఎదుగుదల మెరుగవుతుందని అంచనా. పసిపిల్లలకు అందించే ఆహారంలో రెసిస్టెంట్ స్టార్చ్‌ను పెంచడమే కాకుండా.. వండే పద్ధతుల్లో మార్పులు చేయడం ద్వారా ఈ పిండిపదార్థం శరీరంలోకి ఎక్కువగా చేరేలా చేయవచ్చునని వీరు సూచిస్తున్నారు.