లైవ్‌లో చూడటం తగ్గిపోతోంది...!
ధోరణి
నేటి యువత గురించి బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) వారి ఆందోళన ఇది. ప్రస్తుత తరంలో లైవ్ టీవీ చూసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని బీబీసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇది కేవలం తమ ఛానల్‌ప్రసారాల విషయంలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా యువతలో లైవ్ ప్రసారాల మీద ఆసక్తి తగ్గిపోతోందని బీబీసీ విశ్లేషిస్తోంది. ఎక్కువ ఆసక్తిని రేకెత్తించే ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, ఇష్టమైన క్రీడా ప్రసారాలను తప్పిస్తే... ఫలానా ప్రోగ్రామ్‌లను తప్పనిసరిగా లైవ్‌లో చూడాలనే కోరిక వ్యక్తం చేసేవాళ్లు తగ్గిపోతున్నారని తమ అధ్యయనంలో తేలిందని బీబీసీ వాళ్లు ప్రకటించారు.
ఎందుకలా.. అంటే ఎవరి పనిలో వారు బిజీగా ఉండటం ఒక కారణం అయితే.. లైవ్‌లో చూడలేకపోయిన కార్యక్రమాన్ని మళ్లీ చూడటానికి అనేక అవకాశాలు ఉండటం మరో కారణం అని బీబీసీ అధ్యయనకర్తలు విశ్లేషించారు. ఇంటర్నెట్ పుణ్యమా అన్ని టీవీ ఛానళ్లూ, మీడియా సంస్థలు వెబ్‌తో అనుసంధానం అయ్యాయి. తమ కార్యక్రమాలను వీడి యోల రూపంలో స్టోర్ చేసి ఉంచుతున్నాయి. అలాంటి కార్యక్రమాలను వీక్షించడానికి అధునాతన గాడ్జెట్‌లు, కంప్యూటర్‌లు, ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చింది.
దీంతో దేన్ని ఎప్పుడైనా చూసుకోవచ్చనే భావన ఏర్పడింది. ప్రత్యేకించి 16 నుంచి 24 యేళ్ల మధ్య వారు దాదాపుగా ఈ అభిప్రాయానికి వచ్చేశారట! దీంతో ఇంతకుముందులా లైవ్ కవరేజిపై గొప్ప ఆసక్తి ఏమీ లేదని అధ్యయనకర్తలు అంటున్నారు. అయితే మధ్యవయసు వారిలో మాత్రం ప్రత్యక్ష ప్రసారాలపై ఆసక్తి యథావిధిగా కొనసాగుతోందని బీబీసీ పేర్కొనడం గమనార్హం. ప్రత్యక్ష ప్రసారాలపై ఆసక్తిని తగ్గించుకొన్న కుర్రతరం ఆ సమయాన్ని ఫోన్‌ను ఆపరేట్‌చేయడానికో, నిద్రకో కేటాయిస్తోందని కూడా అధ్యయనకర్తలు వివరించారు.
ఏదైనా సంచలన విషయం సంభవించినా... ఆ విషయం గురించి తెలిస్తే... అందుకు సంబంధించిన సమాచారాన్ని ఇంటర్నెట్‌లో చూడటానికి అవకాశం ఉండటం, యూట్యూబ్‌లో వీడియోల రూపంలో వీక్షించడానికి అవకాశం ఉండటంతో... ప్రత్యక్ష ప్రసారాలపై ఆసక్తి తగ్గిపోతోంది. ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశించడానికి కూడా వీలు లేదని అధ్యయనకర్తలు అభిప్రాయపడటం విశేషం.