నా మోచేతులు మామూలుగా అయ్యేదెలా?
నా వయసు 20. నా బాహుమూలలు చాలా నల్లగా ఉంటాయి. ఒక్కోసారి భరించలేనంత దురదగా కూడా ఉంటుంది. తగిన సలహా ఇవ్వగలరు.
- పి. విమల, కడప
బాహుమూలలు నల్లగా ఉండటానికి అనేక కారణాలుంటాయి. బ్యాక్టీరియల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వాటిలో ముఖ్యకారణాలు. ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల దురదగా కూడా ఉంటుంది. సాధారణంగా అధిక బరువు ఉండటం, హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా బాహుమూలల్లో ఉండే చర్మం నల్లగా లేదా ముదురు గోధుమ రంగులోకి మారుతుంది. అంతేకాదు, అలర్జీ, కొన్నిరకాల బాడీ స్ప్రేలు, డియోడరెంట్ స్ప్రేలు, హెయిర్ రిమూవల్ క్రీములు ఉపయోగించడం వల్ల కూడా బాహుమూలల్లో ఉండే చర్మం నల్లబడిపోతుంది. అందువల్ల అటువంటి కొత్తరకం హెయిర్ రిమూవల్ క్రీములు, స్ప్రేలు ఉపయోగించేటప్పుడు ముందుగా ముంజేతులు లేదా మణికట్టు మీద కొద్దిగా రాసుకుని, చర్మం కందటం, ఎర్రబడటం లేదా దురదగా ఉండటం వంటి పరిణామాలు ఉంటే వెంటనే వాటి వాడకం మానెయ్యాలి. లేజర్ హెయిర్ రిడక్షన్ మెథడ్స్ అనుసరించడం వల్ల ఇటువంటి ఇబ్బందులు ఉండవు. ఎప్పటికప్పుడు వ్యక్తిగత పరిశుభ్రత పాటించటం, అక్కడ చర్మం పొడిగా ఉండేలా చూసుకోవడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందేమో తెలుసుకునేందుకు మంచి డెర్మటాలజిస్టును కలిసి వారి సలహా మేరకు యాంటీఫంగల్ క్రీములు, పౌడర్లు వాడండి. అదేవిధంగా కోజిక్ యాసిడ్ వంటివి ఉండే డీపిగ్మెంటింగ్ క్రీమును అప్లై చేసి కాసేపటికి శుభ్రంగా కడిగేయటం వల్ల, అల్ఫాహైడ్రాక్సీ పీల్స్ వాడకం వల్ల తప్పకుండా మంచి ఫలితముంటుంది. దీనితోబాటు అధిక బరువు ఉంటే తగ్గేందుకు ప్రయత్నించడం అవసరం.
నా వయసు 38. నా మోచేతులు బాగా గరుకుగా, నల్లగా మారి, చూడటానికి అసహ్యంగా కనపడుతున్నాయి. తిరిగి మామూలుగా తయారు కావాలంటే ఏం చేయాలో దయచేసి తగిన సలహా ఇవ్వగలరు.
- పి.పద్మజ, మచిలీపట్నం
మోచేతులు నల్లగా, గరుకుగా మారడానికి కారణం చాలామంది మోచేతులను నిర్లక్ష్యం చేయడమే. అంతేకాదు, ఎక్కడ బడితే అక్కడ మోచేతులను ఎక్కువసేపు బలంగా ఆనించి ఉంచడం, మోపు చేసి లేవటం కూడా మరోకారణం. గ్లైకోలిక్ యాసిడ్, సాలిస్లిక్ యాసిడ్ ఉండే క్రీములను రాత్రి పడుకునే ముందు మోచేతులకు అప్లై చేసి, సున్నితంగా మర్దనా చేసి తిరిగి నిద్ర లేవగానే గోరువెచ్చటి నీటితో శుభ్రంగా కడిగెయ్యాలి. ఇలా కనీసం రెండు మూడు వారాలపాటు చేస్తే మోచేతుల మీది చర్మం తిరిగి మామూలు రంగులోకి మారుతుంది. అదేవిధంగా విటమిన్ ఎ పుష్కలంగా కలిగి ఉండే ట్రెటినోయిన్ వంటి క్రీములను వాడితే చర్మం గరుకుదనం తగ్గి మృదువుగా మారుతుంది. సన్‌స్క్రీన్ క్రీములు, లోషన్లు, మాయిశ్చరైజర్లు వాడటం వల్ల కూడా మంచి
ఫలితం ఉంటుంది.
డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ
చీఫ్ డర్మటాలజిస్ట్,
త్వచ స్కిన్ క్లినిక్,
గచ్చిబౌలి, హైదరాబాద్
డెర్మటాలజీ కౌన్సెలింగ్
Published Mon, Jul 27 2015 10:59 PM | Last Updated on Wed, Apr 3 2019 5:45 PM
Advertisement