అర్జునుడు ఇంద్రకీల పర్వతం మీద తపస్సు చేస్తూన్నప్పుడు, శివుడు కిరాత వేషంలో పరీక్షించడానికి వచ్చాడు. అదే సమయంలో మూకాసురుడు అర్జునుణ్ణి చంపుదామని ఒక పందిలాగ వచ్చాడు. అర్జునుడు ఆ పందిమీద బాణం వేసినప్పుడే మాయాకిరాతుడు కూడా బాణం వేసి, చచ్చిపోయిన పందిని నాదంటే నాదని వాదులాడుకుంటూ ఇద్దరూ యుద్ధానికి దిగారు. అర్జునుడి అమ్ములపొది ఖాళీ అవడంతో మల్లయుద్ధం చేశాడు.
ఆ పోరులో శివుణ్ణి మెప్పించి, పాశుపతాస్త్రాన్ని పొందాడు. ఆమీద అక్కడికి వచ్చిన దిక్పాలకుల నుంచి కూడా అస్త్రాలను పొంది, ఇంద్రుడు పిలవగా స్వర్గానికి అతిథిగా వెళ్లాడు. సంగీతం నాట్యమూ కూడా నేర్చుకోమని ఇంద్రుడు పురమాయిస్తే, అర్జునుడు చిత్రసేనుడి దగ్గర నేర్చుకొన్నాడు. అక్కడికి ఊర్వశి వచ్చి అతన్ని కోరుకొంటే, ‘చంద్రవంశానికి మాతృరూపివి నువ్వు. అంచేత కాదని అన్న అర్జునుణ్ని ‘నపుంసకుడివికమ్మ’ని శపించింది ఊర్వశి.
అయితే, తన తెలివితేటలతో, సమయస్ఫూర్తితో అర్జునుడు ఆ శాపాన్నే వరంగా ఉపయోగించుకున్నాడు. ఉత్తర గోగ్రహణానికి దుర్యోధనుడు భీష్ముడూ కర్ణుడూ మొదలైనవాళ్లతో వచ్చినప్పుడు, ఉత్తరుడికి సారథిగా బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు వెళ్లాడు. అక్కడ కౌరవ సైన్యాన్ని చూసి బెంబేలెత్తిన ఉత్తరుణ్ని సారథిగా చేసుకొని, అర్జునుడే యుద్ధం చేసి ఆవుల్ని మళ్లించాడు.
భాగవతంలో ఏముంటుంది?
♦ మహాభారత కావ్యాన్ని రచించిన తర్వాత కూడా వేదవ్యాసుడిని మనసులో ఏదో తెలియని వెలితితో బాధిస్తుండడంతో నారద మహర్షి సూచన మేరకు భగవంతుని లీలలను వర్ణించే పురాణానికి శ్రీకారం చుడతాడు. అదే శ్రీమద్భాగవతం.
♦ భాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం హిందూ సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణం. ఇది భగవంతుని కథ గా... భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగా, భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథగా ప్రసిద్ధి పొందింది. ప్రధానంగా విష్ణువు, కృష్ణుడు, ఇతర భగవదవతారాల గురించి ఈ గ్రంథంలో ఉటాయి.
♦ ఋషుల కోరికపై సూతుడు తాను శుక మహర్షి ద్వారా విన్న ఈ భాగవత కథను వారికి చెప్పినట్లుగాను, దానిని వేదవ్యాసుడు గ్రంథస్తం చేసినట్లుగానూ ఈ కథ చెప్పబడింది. భాగవతంలో వివిధ భాగాలను ‘స్కంధాలు‘ అంటారు. వివిధ స్కంధాలలో భగవంతుని అవతార కార్యాల వర్ణనలు, భక్తుల గాథలు, ఎన్నో తత్వ బోధలు, అనేకమైన ఆరాధనా విధానాలు, ఆధ్యాత్మికమైన సంవాదాలు పొందుపరచబడినాయి. భగవంతుని లీలలు సవివరంగా వర్ణింపబడ్డాయి. వైష్ణవులందరికీ ఇది పరమ పవిత్రమైన గ్రంథం. ఇది మొత్తం ద్వాదశ (12) స్కంధాలు అంటే 12 భాగాలుంటుంది.
♦ వేదాంత సారమే శ్రీ మద్భాగవతం. భాగవత రసామృతాన్ని పానం చేసినవారికి మరే ఇతరములు రుచించవు. వైష్ణవ సిద్ధాంతాలలో వేదాంత సూత్రాలకు భాగవత పురాణమే సహజమైన వ్యాఖ్య. పురాణాలలో ఇది ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది.
ఎలా అవతరించింది?
భాగవత పురాణం సంభాషణల రూపంలో సాగుతుంది. పరీక్షన్మహారాజు ఉత్తర, అభిమన్యుల కుమారుడు) ఒక మునిశాపం వల్ల ఏడు రోజులలోపు మరణిస్తాడని తెలిసి తన రాజ్య విధులన్నీ పక్కనబెట్టి ప్రతి జీవి అంతిమ లక్ష్యాన్ని తెలుసుకోవాలని కోరుకున్నాడు.
అదే సమయంలోనే తను సంపాదించిన అపార జ్ఞాన సంపదను ఎవరికి బోధించాలో తెలియక, ఒక మంచి శిష్యుని కోసం వెతుకుతున్న శుకుడు అనే ముని రాజుకు తారసపడి ఆ రాజుకు భాగవత కథలను బోధించడానికి అంగీకరిస్తాడు. ఈ సంభాషణ ఎడతెరిపిలేకుండా ఏడు రోజులపాటు కొనసాగింది. ఈ వారం రోజుల సమయంలో రాజుకు నిద్రాహారాలు లేవు. ఒక జీవి అంతిమ లక్ష్యం, నిత్య సత్యమైన భగవంతుని గురించి తెలుసుకోవడమేనని శుకుడు వివరిస్తాడు.
భాగవతాన్ని విన్న పరీక్షిత్తు ముక్తి పొందుతాడు.
Comments
Please login to add a commentAdd a comment