ప్రేమ దివ్వెల ప్రజ్వలనం
భాషలన్నీ కలిసినా పదాలన్నీ కూర్చినా
భావాలన్నీ పోసినా నీ మహిమను వర్ణించగలవా...
స్వరాలన్నీ పలికినా రాగాలన్నీ శ్రుతి చేసినా
తాళాలన్నీ లయమీటినా నీ స్తుతిని పాడగలవా...
అమ్మానాన్నల ప్రేమ తోబుట్టువుల అనుబంధం
ఆలుమగల అనురాగం హితుల మిత్రుల స్నేహం
ప్రతిబింబించగలవా నీ అంతరంగం
నాకో రూపునిచ్చావు జీవం పోశావు
జీవితాన్ని అందంగా అమర్చావు
అనుబంధాలను ఆస్తులను అనంతంగా ఇచ్చావు
అన్నీ... ఆనందంగా పంచుకోవాలని!
ఒక్కోటీ ఒక్కోటీ నువ్వు న న్నర్థించావు...
కాదు కాదు.. ఆజ్ఞాపించావు
ప్రేమించమన్నావు.. తోటి మనిషిని!
ప్రేమ ఒక్కటే మా మధ్య వెలిగే దీపమన్నావు
అది లేకపోతే చీకటి ఒక్కటే మాకు మిగిలే ఆస్తి అన్నావు...
స్వామీ.. సృష్టికర్తా.. జీవదాతా..
మేము ఆశల ప్రేమికులం దురా ల దాసోహులం
నీ వెలుగును ఆర్పేశాం... చీకటినే సొంతం చేస్కున్నాం..
నువ్విచ్చిన ఈ నేలను స్వార్థ చీకట్లతో నింపేశాం..
మా ద్వేషాలతో పగలతో మా సమస్త దుర్గంధాలతో
నిన్ను తూట్లు పొడిచాం ఛిద్రం చేశాం.. రక్తం ఓడ్చాం... ప్రాణం పీల్చాం...
అయినా కోపించవే...? ... శపించవే..?
క్షమించడమే నీ శ్వాస ప్రేమించడమే నీ భాష
మేం నిన్ను సమాధి చేసినా మాపై ప్రేమతో... మరణాన్ని జయించావు
మేము సైతం మృత్యువును జయించే జయవీరులం కావాలన్నావు
ప్రేమతో.. ఇప్పుడైనా ... గుండెను నింపుకుంటే చీకటి... మరణం.. మటుమాయమన్నావు
తండ్రీ, నీ మరణం మా గుండెను కదిలించాలి
నీ రుధిరం మాలో ప్రవహించాలి అప్పుడే మాకు
నవోదయ నవజీవనం మా ఎదలతో... మా చుట్టూ
ప్రేమ దివ్వెల మహాప్రజ్వలనం..!! – ఝాన్సీ కె.వి.కుమారి
ఓషో వాణి
► దేవుడు కోరుకుంటే వచ్చేవాడు కాదు. మీకు ఎలాంటి కోరికలు లేనప్పుడే ఆయన మీ దగ్గరకు వస్తాడు.
► మనిషి లోపల దేవుడు దాగి ఉన్నాడు. ఆయన బయట పడేందుకు మీరే ఆయనకు ఒక చిన్న దారిని, మార్గాన్ని ఇవ్వండి. అదే సృజనాత్మకత. దివ్య సంభవాన్ని అనుమతించడమే సృజనాత్మకత. అది ఒక ధార్మిక స్థితి. సృష్టించే కళ అంటే అదే.
► ప్రకృతితో సామరస్యంగా వ్యవహరించడమే వివేక సారం. బుద్ధుడు, లావోట్జు, వంటి మార్మికులందరి సందేశం అదే.
► సహజంగా చేసే పని ఎప్పుడూ సంపూర్ణంగానే ఉంటుంది. చాలా గొప్పగా చెయ్యాలనే తపనతో చేసే అసహజమైన ప్రయత్నాలు ఎప్పుడూ అసంపూర్ణ ఫలితాలనే ఇస్తాయి. సహజత్వతమే సంపూర్ణత్వం.
► మీకు మీరు గుర్తున్నప్పుడు ఆ దేవుణ్ణి మీరు మరచిపోతారు. మిమ్మల్ని మీరు మరచిపోయినప్పుడు ఆ దేవుడు మీకు గుర్తొస్తాడు. వీటిలో ఏదో ఒకటే సాధ్యపడుతుంది. రెండింటినీ గుర్తుంచుకోవడం అసాధ్యం.
► అహం ఒక మానసిక దౌర్బల్యం. దానితో పరిపూర్ణత్వం సాధించడం అసంభవం. అది లేనప్పుడు పరిపూర్ణత్వం దానంతటదే సహజంగా సిద్ధిస్తుంది. – ఓషో భరత్ ‘సృష్టించే కళ’ నుంచి
మీకు తెలుసా?
తిరుమల శ్రీవారి ఆలయంలో మనం మూలమూర్తిని మాత్రమే దర్శించుకుంటాం. అయితే ఆయనతోపాటు మరో నాలుగు మూర్తులు భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్రశ్రీనివాసమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, శ్రీ దేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు కూడా ఉంటారు. భోగ శ్రీనివాసునికి నిత్య సేవలు, కొలువు శ్రీనివాసునికి లెక్కల అప్పగింతలు, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక ఉగ్ర శ్రీనివాసమూర్తిని మాత్రం ఏడాదికోసారి సూర్యోదయానికి ముందు సర్వాలంకారాలతో ఊరేగింపుగా తీసుకు వెళ్ళి అంతరాలయానికి తీసుకొచ్చేస్తారు. భక్తుల కోర్కెలు తీర్చే భారం మాత్రం మూలమూర్తి వెంకన్నదే. ఈ మూర్తులకే ధృవబేరం, కౌతుక బేరం, బలిబేరం, స్నపన బేరం అని పేర్లు.
తెలుసుకుందాం
► ప్రాతఃకాలంలో భారతాన్ని, మధ్యాహ్న సమయంలో రామాయణాన్ని, రాత్రివేళ భాగవతాన్ని పఠించాలి.
► దేవుడిని ఉంచిన స్థానంలో కంటే భక్తులు ఎత్తులో కూర్చోరాదు.
► దేవుని ఎదుట తలదువ్వరాదు, భోజనం చెయ్యరాదు.
► పుష్పాలను నీటితో తడపరాదు.
► గంటను నేలపై ఉంచరాదు.
► శని, ఆది, మంగళవారాల్లో కొత్తదుస్తులు ధరించరాదు.
► ఆలయంలో ఉండగా భగవంతుడికి తప్పించి పూజారితో సహా ఎవరికీ పాద నమస్కారం చేయరాదు.
రాహువు
జాతక రీత్యా వ్యక్తుల ఉత్థాన పతనాలలో కీలక పాత్ర పోషించే రాహువు మార్మికతకు, మానసిక భ్రమలకు కారకుడు. మోసాలకు, దుర్వ్యసనాలకు, హింసాప్రవృత్తికి, నేరస్వభావానికి కారకుడు. రాహువు నైసర్గిక పాపగ్రహం. అందువల్ల జాతకచక్రంలోని దుస్థానాలైన 6, 8, 12 ఇళ్లలో ఉన్నప్పుడు, ఉపచయాలైన 3, 6, 11 స్థానాలలో ఉన్నప్పుడు మేలు చేస్తాడు. జాతకచక్రంలో రాహువు ఇలాంటి అనుకూల స్థానాలలో ఉన్నప్పుడు తన దశాంతర్దశలలో శుభ ఫలితాలనే కలిగిస్తాడు.
అలా కాకుండా కేంద్ర కోణాలలో ఉన్నప్పుడు వ్యతిరేక ఫలితాలను ఇస్తాడు. ఇక రవి, చంద్రులతో కలసి ఉన్నట్లయితే జాతకులకు రాహువు కారణంగా ఇబ్బందులు తప్పవు. జాతకంలో రాహువు పరిస్థితి ప్రతికూలంగా ఉంటే జాతకునిలో హింసా స్వభావం ప్రకోపించి, నేరాలకు పాల్పడే పరిస్థితి తలెత్తే అవకాశం ఉంటుంది. తాగుడు, జూదం వంటి దుర్వ్యసనాలు, మోసాలు, చీకటి వ్యాపారాలు వంటివి జాతకుని వినాశనం వైపు నడిపించే సూచనలూ ఉంటాయి.
జాతకంలో రాహువు సానుకూలంగా ఉంటే జాతకులు వైద్య, పారిశ్రామిక, సాంకేతిక, రాజకీయ, గూఢచర్య రంగాల్లో రాణిస్తారు. ఇంద్రజాలం, హిప్నాటిజం వంటి విద్యల్లోనూ వీరికి ప్రవేశం ఉంటుంది. ఒకవేళ రాహువు జాతకంలో దోషభూయిష్టంగా ఉన్నట్లయితే, రాహు శాంతి కోసం మినుములను, ఇనుప పాత్రలో నూనెను, నలుపు గొంగళిని దానంగా ఇవ్వాలి. రాహు మంత్రాన్ని 18 వేల సార్లు జపించి, 1800 హోమం, 180 తర్పణం చేసి, 18 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. దుర్గా ఆరాధన, ఛిన్నమస్తా ఆరాధనల ద్వారా కూడా రాహువు దుష్ప్రభావాల నుంచి ఉపశమనం పొందవచ్చు. – దాస్
ఒక స్తోత్రం
జీవితంలో కష్టాలు, కడగళ్లనుభవించేవారు, తరచు కార్యహాని కలుగుతున్నవారు ఈ కింది సంకటహర గణపతి స్తోత్రాన్ని ఆర్నెల్లపాటు రోజూ పారాయణ చేయడం వల్ల ఆయా కష్టాలన్నీ తొలగుతాయని శాస్త్రోక్తి.
సంకట విమోచక గణపతి స్తోత్రం
ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాస స్మరేన్నిత్యం ఆయుఃకామార్థ సిద్ధయే
ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం
లంబోదరం పంచమంచ షష్టం వికటమేవచసప్తమం విఘ్నరాజంచ ధూమ్రవర్ణం తథాష్టమం
నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశాంతు గజాననం
ద్వాదశైతాని నామాని యః పఠేత్ శ్రుణుయాన్నిత్యం
నచ విఘ్నభయం తస్యసర్వసిద్ధికరం ప్రభోః
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభేత్ పుత్రం మోక్షార్థీ లభేత్ గతిం జపేద్గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చః లిఖిత్వాయత్సమర్పయేత్
తస్య విద్యా వేత్సర్వా గణేశస్య ప్రసాదతః
చేసేవాడు దేవుడే! మనం పనిముట్లం మాత్రమే!
ఒక పండితుడు పరమశివుడిపై ఒక స్తోత్రాన్ని రచించాడు. ప్రజలు దానిని చదివి చాలా ఆనందించి, పండితుణ్ణి ఎంతగానో ప్రశసించారు. ఆ పండితుడు తాను సాధించిన ఈ పనిని చూసుకుని గర్వంతో పొంగిపోయాడు. మరునాడు అతను శివాలయానికి వెళ్లి నమస్కారం చేస్తుండగా, అక్కడ ఉన్న నంది తన పళ్లను బయటపెట్టి చూపించాడు.
ఆ దంతాలమీద ఈ పండితుడు రాసిన స్తోత్రంలోని ప్రతి మాటా రాసి ఉంది. అది చూసి పండితుడు నిర్ఘాంతపోయాడు. అతని అహంకారం పటాపంచలయింది.ఈ కథను తన శిష్యులతో చెప్పి శ్రీ రామకృష్ణ పరమహంస ‘దీనిని బట్టి తెలిసిందేమిటంటే, దేవుడే అన్ని పనులూ చేసేవాడు! మనం ఆయన చేతిలో పనిముట్లు మాత్రమే! అని వారికి బోధించాడు.