సనాతనం నిత్యనూతనం | Devotional information by giridhar ravula | Sakshi
Sakshi News home page

సనాతనం నిత్యనూతనం

Published Sun, Nov 4 2018 1:11 AM | Last Updated on Sun, Nov 4 2018 1:11 AM

Devotional information by giridhar ravula - Sakshi

ఆత్మ విషయంలో తాత్వికులు మనసుతో తాదాత్మ్యత చెందితే, అదే ఆత్మను భగవంతుడు అని భక్తులు భక్తిమార్గంలో ఆరాధిస్తారు. అదే ఆత్మను అనంతశక్తి అంటూ శాస్త్రవేత్తలు ప్రయోగాలతో నిరూపించేందుకు ప్రయత్నం చేస్తారు. ఉపనిషత్తులు సత్యాన్వేషణ ఎలా చేయాలో చెబుతాయి.  సత్యమంటే మనం సాధారణ అర్థంలో తీసుకునే ఋజువాక్కులు కాదు.‘ఎల్లప్పుడు నిలిచి ఉండే వస్తువు.  మహిమాన్వితమైన అనంతమైనశక్తి.

రంగులేకున్నా, రూపులేకున్నా ఇంద్రియానుభవ స్వరూపాలకు అదే హేతువు. అది జననమరణాలు లేనిదైన శక్తి. దాని గురించి మాత్రమే ఉపనిషత్తులు చర్చిస్తాయి. అంతేకాకుండా, ఆ శక్తి పరిణామక్రమానికి నిదర్శనమైన ఖగోళ పదార్థాలన్నీ అశాశ్వత పదార్థాలు. నశించిపోతూ వస్తున్న అస్థిరపదార్థాల గురించి తాత్విక పరిశోధకులు  ఉపనిషత్తులలో చర్చించలేదు. ఎందుకంటే, అవి హేతువులు కావు. అసలైన హేతువు, స్థిరవస్తువు, స్వతఃసిద్ధమైంది అయిన ఆత్మ గురించి మాత్రమే విశేషమైన చర్చ జరిగింది. ఇక ఆత్మ సనాతనంగా ఉంటూనే, నిత్యనూతనంగా ఎలా ఉండగలుగుతోంది అనేది పెద్ద ప్రశ్న.

ఆత్మ తన ఉనికిని స్థిరంగా కొనసాగించడానికి పరిణామాన్ని ఆశ్రయించింది. ఈ పరిణామ ప్రక్రియలో తనకు తానుగా ఖగోళ పదార్థంగా మారుతూ, తిరిగి తనకు తానుగా అనంతశక్తిగా మారుకుంటూ తన స్థిరత్వాన్ని కొనసాగిస్తూ వస్తోంది. ఈ ప్రక్రియను అంతా తన లోపలనే గుంభనంగా కొనసాగిస్తూ నిశ్చలంగా, నిర్దిష్టంగా, శాశ్వతంగా ఉంటూ వస్తోంది, ఉండబోతోంది.
ఆ శక్తి పరిణామాన్ని ఆశ్రయించడంలో రెండు ప్రాథమిక చర్యల ద్వారా పదార్థంగా ఏర్పడుతూ, గతిస్తూ ఉంటుంది.

తద్వారా తన ఉనికిని నిత్యనూతనంగా ఉంచుకుంటోంది. ఆ చర్యలే సంలీనం, విచ్ఛిత్తి. క్వార్క్‌లు, హైడ్రోజన్‌ లాంటి అణువుల సంలీనం వలన నక్షత్రాలు, గ్రహాలు లాంటి ఖగోళ పదార్థాలేర్పడతాయి. అలా ఏర్పడిన వాటిల్లో అనుకూల వాతావరణం ఉన్న గ్రహాల పైన జైవికపదార్థాల సంలీనం వలన జీవాలు ఏర్పడతాయి. ఈ పదార్థాలు తమ మనుగడ తర్వాత విచ్ఛిన్నం చెందుతూ, తిరిగి అన్నీ శక్తిరూపంలోకి మారిపోతాయి. తద్వారా శక్తి ఎప్పుడూ స్థిరంగా ఉంటూ, తనకు తానుగా ఉనికిని చాటుకుంటూనే ఉంటుంది.

– గిరిధర్‌ రావుల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement