సాంఖ్యయోగంలో శ్రీ కృష్ణుడు సర్వాంతర్యామియైన ఆత్మ గురించి తెలుసుకున్న వారు కూడా ఆశ్చర్యానికి లోనవుతున్నారని తెలియజేశాడు. అంటే, ఆ ఆత్మ ఒక విచిత్రమైన, అర్థమయ్యీ కానట్టుండే విషయమని అర్థం చేసుకోవచ్చు. కారణం, అది విశ్వవ్యాప్తమై అన్నింటినీ తనలోనే కలిగి ఉంటుంది. నక్షత్రాలు, నక్షత్రమండలాలే కాకుండా వాటి ఉత్పత్తులైన కాంతి, శబ్దం, అంతరిక్షం, ఆకాశం లాంటి వాటన్నింటికీ ఉత్పన్నకారకమై, తిరిగి తానే లయకారకమవడం వింతగా కనిపిస్తుంది. ఈ ఖగోళపదార్థాలేవీ శాశ్వతం కావని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం కూడా నిరూపిస్తోంది. అంటే, ‘యదృశ్యతి తన్నశ్యతి’– కనిపించేవన్నీ నశించేవే! మరి నశించనిది ఏంటంటే మనం చెప్పుకునే ఆత్మ లేక అనంతమైన శక్తి మాత్రమే. ఆధునిక వైజ్ఞానికులు చెప్పిన శక్తి నిత్యత్వ నియమం’ ప్రకారం శక్తిని సృష్టించలేము, నశింప చేయలేము కానీ, శక్తి రూపాలను మాత్రం మార్చగలము.
ఇదే విషయాన్ని ఉపనిషత్తులు అనేకమార్లు, అనేక విధాలుగా ఘోషించినా, వాటిల్లో ‘కఠోపనిషత్తు’ రెండవ అధ్యాయం లోని 18 వ శ్లోకాన్ని చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఆత్మ జన్మించడం లేదు, మరణించడం లేదు. ఇది దేని నుండి రూపొందినది కాదు. ఎన్నటికీ ఉండేది, సనాతనమైనది, శరీరం నశించినా నశించనిది. ఈ శ్లోక భావననే ఆధునిక శాస్త్రజ్ఞులు చెప్పిన ‘శక్తి నిత్యత్వ నియమం’ కూడా చెప్తుంది. ఈ శ్లోకం సిద్ధాంతాల మధ్య భేదం ఏమీ కనిపించదు. ఇక్కడ శరీరమనేదాన్ని కనిపించే అన్ని పదార్థాలుగా చెప్పుకోవచ్చు.
అంతటితో ఆగకుండా కఠోపనిషత్తు ఈ ఏకాత్మ గురించి పరిపరివిధాలుగా విశ్లేషించింది. ఇంద్రియాలు గ్రహించగల శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలన్నింటికీ అతీతమైన, అవినాశియైన, ఆద్యంత రహితమైన, బుద్ధికన్నా శ్రేష్ఠమైన, సుస్థిరమైన భగవంతుని లేదా ఏకాత్మను లేదా అనంతమైన శక్తిని అనుభూతితో గ్రహించాలని తెలియజేస్తోంది.
ఈ శక్తి అనంతమైనది అంటోంది. అంటే ఈ శక్తి స్థలం మిగల్చకుండా వ్యాపించి ఉంది కాబట్టి, దానికి రూపం లేదు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులన్నింటికీ అతీతమైనది. అంటే ఈ అనంతమైన శక్తికి రంగు, రుచి, వాసన, ఆకృతి, స్పర్శ మొదలైన పదార్థ స్వభావాలు ఏమీ లేవని అర్థం. ఇంద్రియాలు అట్టి శక్తిని చూడలేవు, తెలుసుకోలేవు. అనుభూతి ద్వారా మాత్రమే తెలుసుకోగలం. కాబట్టి, అలాగే అర్థం చేసుకుందాం. దాని నుండి ఉద్భవించిన మనతో కలిపి కనిపించేవన్నీ తిరిగి దానిలోకే వెళ్తాయి.
కాబట్టి, అశాశ్వతమైన ఆకృతుల పట్ల ఆశ పెంచుకోవడం, ద్వేషించటం తగనిది. ఇదే విషయాన్ని ఈశావాస్యోపనిషత్తు ఎవరు సకల జీవరాశులను ఆత్మలోను, ఆత్మను సకల జీవరాశులలోనూ దర్శిస్తాడో అతను ఎవరినీ ద్వేషించడని నిర్ధారిస్తోంది. అందుచేత, ఇతర పదార్థాలు అంటే గ్రహాలు, నక్షత్రాలే కాకుండా చెట్టూచేమ, పశుపక్ష్యాదులు ఏవిధంగానైతే తమ తమ ధర్మాల రీత్యా మాత్రమే కర్మలను ఆచరిస్తూ, శాంతియుతంగా మనుగడ సాగిస్తూ ఉన్నాయో అదేవిధంగా మనం మానవధర్మాన్ని మాత్రమే ఆచరించాలి. అదే జీవిత పరమావధి.
– రావుల గిరిధర్
Comments
Please login to add a commentAdd a comment