సూర్యుడు ఉదయించాడు. అదే సమయంలో దీయా బజాజ్ ఎవరెస్టు శిఖరం మీద తొలి పాదం మోపింది. ఆమె తండ్రి అజీత్ బజాజ్ ఆమెకు ఒక్క అడుగు మాత్రమే వెనక ఉన్నాడు. ఐదు రోజుల క్రితమే.. మే 16న ఈ తండ్రీకూతుళ్లు ఆ మంచుకొండల్లో.. ఎల్తైన ఆ ఎవరెస్టు శిఖరం పైనుంచి సూర్యోదయం చూశారు. చిన్నతనంలో జాబిల్లిని చూపిస్తూ కూతురికి పాలబువ్వ తినిపించి ఉంటాడు ఆ తండ్రి. ఇప్పుడా కూతురే పెరిగి పెద్దదై ఎవరెస్ట్ పైనుంచి సూర్యుణ్ని చూపించింది తన తండ్రికి!
వివక్షపై శిఖర సందేశం
సరిగ్గా ఉదయం 4.30కి దీయా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. తరువాత ఆమె తండ్రి, వారితో పాటు షేర్పా సర్దార్ మినానీరు ఆమెను అనుసరించారు. బేస్ క్యాంపు నుంచి సాగిన ప్రయాణాన్ని దీయా తన బ్లాగులో లైవ్‌లో చూపుతూ వచ్చింది. వారి సాహసాలు, వాతావరణ పరిస్థితులు, ప్రకృతి అందాలు, వారు ఉన్న ప్రాంతం.. ఒకటేమిటి అన్ని విషయాలు కళ్లకు కట్టినట్లుగా చూపింది.
‘‘ప్రపంచంలోకెల్లా అతి ఎత్తయిన ప్రదేశం నుంచి నేను సూర్యోదయం చూశాను. ఇది నా జీవితంలో నేను మరిచిపోలేని క్షణం’’ అంటూ తన శిఖరయానం పూర్తయిన వెంటనే పులకరించిపోతూ పోస్ట్ పెట్టింది దీయా. భారతదేశంలో ఎవరెస్టు పర్వతం ఎక్కిన మొట్టమొదటి తండ్రీకూతుళ్లు వీళ్లే కావడం విశేషం. సమాజంలో లింగ వివక్షను రూపుమాపాలన్న సందేశంతో ఈ సాహసయాత్రను చేపట్టారు వీళ్లు.
శుభోదయ సాహసాలు
‘‘మా అమ్మాయికి తండ్రితో కలిసి ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కాలని కోరిక. ఇక ఈ ప్రయాణానికి సంబంధించి మరో అంశం.. ‘అవకాశం ఇస్తే, ఆడపిల్లలు తమను తాము నిరూపించుకోగలగడమే కాదు, ఉన్నత శిఖరాలకు కూడా చేరుకోగలరు’ అని చెప్పడం కూడా’’ అని అజీత్ బజాజ్ భార్య షిర్లీ థామస్ బజాజ్ అన్నారు. ‘‘వేసవి సెలవుల్లో దీయా, ఆమె చెల్లి ఇద్దరూ ఉదయాన్నే లేచేవారు. వైల్డ్‌లైఫ్ సఫారీకి వెళ్లేవారు. స్కూబా డైవింగ్ చేసేవారు. అన్నీ సాహస క్రీడలే’’ అని చెబుతారు షిర్లీ తన కూతుళ్ల గురించి మురిపెంగా.
స్కీయింగ్ కూడా కలిసే!
అజీత్ మూడు దశాబ్దాలుగా సాహస క్రీడలలో పాల్గొంటూనే ఉన్నారు. ఉత్తర ధ్రువంలో స్కీయింగ్ చేసిన మొట్టమొదటి భారతీయుడు అనే రికార్డు కూడా ఆయన పేరు మీద ఉంది. 2011 మే నెలలో ఈ సాహసం చేశాడు. ఆ తరువాతి సంవత్సరమే అజీత్, దీయా కలిసి గ్రీన్‌లాండ్ ఐస్ క్యాప్ గుండా స్కీయింగ్ చేసిన మొదటి భారతీయులుగానూ గుర్తింపు పొందారు. వీరిని చూస్తే, ఈ తండ్రీ కూతురు కలిసి ఏ సాహసమైనా చేయగలరని, వారికి సాధ్యం కానిది ఏమీ ఉండదనిపిస్తుంది.
స్వాప్నికుల కుటుంబం
దీయా, అజీత్‌లకు ఎవరెస్టును జయించాలన్న కోరిక కలగడానికి చాలామందే ప్రేరణ అయ్యారు. చిన్నప్పటి నుంచి దీయా పర్వతారోహకుల గురించి వింటూండేది. వారికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటూండేది. తండ్రికి ఒక ఆలోచనైతే ఉండేది... ‘ఎప్పటికైనా ఎవరెస్టును ఎక్కాలి’ అని. అలా ఇద్దరి ఆశలూ ఒకటయ్యాయి.
ఢిల్లీలోని స్నో లెపార్డ్ అడ్వెంచర్‌లో దీయా తల్లి షిర్లీ డైరెక్టరుగా పనిచేస్తున్నారు. 2012లో అజీత్‌కి స్కీయింగ్‌లో పద్మశ్రీ అవార్డు లభించింది. అటువంటి సాహస కుటుంబం నుంచి వచ్చిన దీయా.. యు.ఎస్. లోని కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి పట్టా పొందాక తల్లిదండ్రుల బాటలోనే సాహసాల వెంట పయనించింది.
Comments
Please login to add a commentAdd a comment