
ఇదో సరికొత్త ఛాలెంజ్!
ఐస్ బకెట్ ఛాలెంజ్ అయిపోయింది... ఆ తర్వాత రైస్ బకెట్ ఛాలెంజీ ఇప్పుడు పాతబడిపోయింది. అమెరికా అధ్యక్షుడి స్థాయి నుంచి అతి సామాన్యులు, సెలబ్రిటీల దాకా ఈ ఛాలెంజ్‌లను స్వీకరిస్తూ, మరికొంతమందికి ఆ సవాలును విసురుతూ వార్తల్లోకి వచ్చారు. ఏదోవ్యాధి బాధితుల కోసం నిధుల సేకరణలో భాగంగా ఐస్ బకెట్ ఛాలెంజ్ వ్యాప్తి చెందింది. పేదల కడుపు నింపడానికి రైస్ బకెట్ ఛాలెంజ్ కూడా అంతే ఆదరణ పొందింది. ఈ రెండూ సదుద్దేశంతో కూడిన కార్యక్ర మాలు కాబట్టి మీడియా కూడా బాగానే ప్రచారమిచ్చింది. అలాంటి ఐస్ బకెట్ ఛాలెంజ్ స్ఫూర్తితో మెట్రో నగరాల్లో ఇప్పుడిప్పుడే మరో కార్యక్రమం మొదలవుతోంది. మహిళల ఆరోగ్యం గురించిన ఉద్యమమిది. ‘హైజీన్ బకెట్ ఛాలెంజ్’ పేరుతో ఈ కార్యక్రమం ప్రచారంలోకి వస్తోంది.
వడోదరా కేంద్రంగా పనిచేసే ‘వాత్సల్య ఫౌండేషన్’ వారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఒక బకెట్ నిండా శానిటరీ న్యాపికిన్‌లను విరాళంగా సేకరించడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. మురికివాడల్లో నివసించే మహిళలకు ఆ శానిటరీ న్యాపికిన్‌లను అందించడానికి ఆ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. పేదరికంలో మగ్గుతున్న మహిళల్లో శానిటరీ న్యాప్‌కిన్‌లపై అవగాహన నింపడం, వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది వాత్సల్య ఫౌండేషన్. ఇందులో భాగంగా వీరు కొత్త ప్రయత్నం చేస్తున్నారు.
‘‘గ్రామీణ మహిళల్లోనే కాదు.. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద మహిళల్లో కూడా శానిటరీ న్యాప్‌కిన్‌ల గురించి అవగాహన లేదు. ఫలితంగా వారు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. వారికి సాయంగా నిలవడానికే ఈ ప్రయత్నం. ఈ నేపథ్యంలో కొంత సామాజిక ప్రచారం... దాతల సహకారం కోసం ఐస్‌బకెట్ ఛాలెంజ్ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం..’’ అని ఫౌండేషన్ నిర్వాహకులు చెప్పారు.
ముందుగా ఈ ఛాలెంజ్‌ను వడోదరాకే చెందిన కల్పనా షా అనే మహిళ స్వీకరించింది. ఆమె ఒక బకెట్ న్యాప్‌కిన్‌లను తన పనిమనిషికి డొనేట్ చేసింది. తను డొనేట్ చేయడమే గాక తన స్నేహితురాళ్లలో కొందరిని ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాల్సిందిగా కల్పనా షా ఛాలెంజ్ చేసింది. దీనికి స్పందనగా కొంతమంది మహిళలు ఈ విరాళానికి ముందుకొచ్చారు.
విద్యావేత్త అయిన నందితా అమిన్ తమకు సమీపంలోని గ్రామంలోని అమ్మాయిల బాధ్యత తీసుకొన్నారు. కొంతమంది అమ్మాయిలకు ఈ విషయంలో అండగా నిలబడేందుకు ఆమె ముందుకొచ్చారు. ఆర్థిక స్థితి బాగుండక అనేక మంది మహిళలకు శానిటరీ న్యాప్‌కిన్‌లు వాడే అవకాశం లేకుండా పోతోందని.. పేదరికం పర్యవసనంగా మహిళల్లో తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తడాన్ని నిరోధించడంలో భాగస్వామి అవుతున్నందుకు ఆనందంగా ఉందని అమిన్ చెప్పారు.
ఇలా ఆ స్వచ్ఛంద సంస్థ చేపట్టిన కార్యక్రమం క్రమంగా ఊపందుకొంటోంది. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న మహిళలు అనేకమంది గ్రామీణ, పేద మహిళల పరిస్థితిని అర్థం చేసుకొని సాటి మహిళలుగా స్పందిస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ కార్యక్రమం ద్వారా కొన్ని వందల మంది మహిళలకు శానిటరీ న్యాప్‌కిన్‌ల సాయం అందిందని వాత్సల్య ఫౌండేషన్ నిర్వాహకులు అంటున్నారు. ఒకవైపు ప్రభుత్వాలు కూడా మహిళల ఆరోగ్యప్రయోజనాలను గుర్తించి శానిటరీ న్యాప్‌కిన్‌ల విషయంలో అవగాహన నింపడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఇలాంటి సామాజిక సేవా సంస్థలు కూడా ఈ దిశగా ప్రయత్నించడం ద్వారా కొంతమంది మహిళలకు బాసటగా నిలిచినా అది అభినందించదగ్గ ప్రయత్నమే అవుతుంది.