నా బేనర్లో నేనే డైరెక్టర్ ఛాన్స్ ఇస్తానేమో
పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్
స్టోరీ: పూరి డెరైక్షన్: మీరే!!
10 డేస్...
10 స్టోరీ ఐడియాస్
10 మినిట్స్...
ఇప్పటికి ఏడు స్టోరీ ఐడియాలు చెప్పా. ఇవాళ్టిది ఎనిమిదో ఐడియా. ఇలా మరో రెండు ఐడియాలు చెప్తా. మొత్తం పది ఐడియాలు. వీటిల్లో మీకు నచ్చిన కథకు మీరు స్క్రిప్ట్ రెడీ చేసి చక్కగా డైలాగులు రాసుకుని 10 నిమిషాల లోపు నిడివితో ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి. మీ ఇష్టం... ఏ డిజిటల్ కెమెరాతోనైనా తీయొచ్చు. ఏమీ లేకపోతే ఐ ఫోన్‌తోనైనా తీయొచ్చు. యాక్టర్స్ అంటారా? మీ ఇంట్లో, మీ చుట్టుపక్కల బోలెడంత మంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్లతోనే షూట్ చేయండి.
గమనిక: నేను చెప్పే కథల్లో గానీ, ఐడియాల్లో గానీ, ఏదైనా స్టాండర్డ్ తగ్గిందని మీరు ఫీలైతే, వాటిని మీ స్టాండర్డ్స్‌కి మార్చుకుని అందంగా తీయండి.
ఈ పది రోజుల్లో... నేను చెప్పే పది ఐడియాల్లో ఏ ఐడియా నచ్చినా దాంతో మీరు ఓ షార్ట్ ఫిల్మ్ తీసేయండి. మొత్తం 10 ఐడియాలూ తీస్తానన్నా మాకు ఓకే!
ఏమో..! మీలో ఎవరైనా నాకు నచ్చితే నా బేనర్లో నేనే డెరైక్షన్ ఛాన్స్ ఇస్తానేమో!
పూరి Idea-8
అమ్మాయి మిస్ ఇండియాలా ఉంటుంది. అబ్బాయేమో మిస్టర్ బాహుబలి. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్సే. ఇద్దరి కళ్లూ కలిశాయి. మాటలు కలిశాయి. హార్ట్‌లూ కలిశాయి. ఫైనల్‌గా ఇద్దరి సాఫ్ట్‌వేర్‌లూ ఒక్కటయ్యాయి. అయితే ఇద్దరికీ పెళ్లంటే విముఖత. కానీ ఒకే ఇంట్లో ఇద్దరూ కలిసి మెలిసి ఉండాలని ఫిక్సయిపోయారు. ‘‘ఏంటి సహజీవనమా?’’అని ఎవరైనా అడిగితే, ‘‘మీరు ఏ పేరైనా పెట్టుకోండి. మాకు ఈ జీవనం హాయిగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు.
ఆరు నెలలు ఆరు క్షణాల్లా గడిచి పోయాయి. కట్ చేస్తే - ఇద్దరికీ తేడా వచ్చింది. మాట పట్టింపు వచ్చింది. వాళ్లిద్దరూ బ్రేకప్‌కి సిద్ధమయ్యారు. ఆ బ్రేకప్ ఎలా ఉంటుందో సరదాగా షార్ట్ ఫిల్మ్ తీయండి. ఆ అమ్మాయి వెర్షన్ వింటే కరెక్టే కదా అనిపించాలి. అబ్బాయి మాటలు వింటుంటే, ఇది సబబే కదా అనే భావం కలగాలి. చివరకు విడిపోవాలి. వాళ్లిద్దరూ విడిపోవడమే మంచిదని మనకూ అనిపించాలి. అంతా ఫన్నీగా ఉండాలి.
నెల రోజులు టైం ఇస్తున్నాం.
ఫిబ్రవరి 14 వేలంటైన్స్‌డే మీ ఎంట్రీలకు లాస్ట్ డే. మీరు తీసిన షార్ట్ ఫిల్మ్‌ని directorsakshi@gmail.comకి పంపించండి. ఒక్కో కథకు ఒక్కో డెరైక్టర్‌ని ఎంపిక చేస్తాం. అంటే పది కథలకూ పదిమంది దర్శకులు. వీళ్లందరికీ తగిన బహుమతులు ఇస్తాం. వాళ్లు తీసిన షార్ట్ ఫిల్మ్స్ ‘సాక్షి’ ఛానల్‌లో ప్రసారం చేస్తాం. యూ ట్యూబ్‌లో పెడతాం. దీంతో మీకు ఎక్స్‌పీరియెన్స్ వస్తుంది. ఎక్స్‌పోజర్ వస్తుంది. సినిమా ఇండస్ట్రీ నుంచి అవకాశాలూ రావొచ్చు.
ప్రెజెంటేషన్: పులగం చిన్నారాయణ
సామర్థ్యం ఉన్నవారికి ఆర్థిక సహాయం
పూరి జగన్నాథ్ స్టోరీకి దర్శకత్వ బాధ్యతలు వహించి, ష్టార్ ఫిల్మ్ తీయాలనుకున్న పేద కుటుంబాలకు చెందిన యువకులకు తాను ఆర్థిక సాయం చేస్తానని విజయనగరం జిల్లా పార్వతీపురంలోని వివేకానంద కాలనీకి చెందిన సిగడాం భాస్కరరావు ముందుకొచ్చారు. ‘స్టోరీ పూరి... డెరైక్టర్ మీరే’ అనే శీర్షికతో ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమవుతున్న స్టోరీలకు షార్ట్ ఫిల్మ్ తీయడానికి ప్రతిభ ఉండి, డబ్బు లేక డెరైక్షన్ చేయలేకపోతున్నామే అని ఆవేదన చెందే యువకులకు తాను ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఇందుకోసం ఎవరైనా సమర్థత కలిగినవారు తన ఫోన్ నంబర్‌ను (9949451283) సంప్రదించవచ్చని భాస్కరరావు చెప్పారు.
సిగడాం భాస్కరరావు