డర్టీ మిర్రర్ | Dirty Mirror | Sakshi
Sakshi News home page

డర్టీ మిర్రర్

Published Mon, Oct 31 2016 10:37 PM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM

డర్టీ మిర్రర్

డర్టీ మిర్రర్

నన్ను నేను చూడలేను.
అద్దం ముందు నిలబడలేను.
నిజానికి ఎవరిముందూ నిలబడలేను.
అవును. నన్ను నేను చూడలేను.
కమిలిన గుర్తులు నన్ను వెక్కిరిస్తున్నాయి.
చేతులతో వెక్కిరిస్తున్నాయి.
చేతలతో వెక్కిరిస్తున్నాయి.
గుర్తులు గుర్తుకొస్తున్నాయి.
అవును. నన్ను నేను చూడలేను.
ఒక్కొక్కసారి మరకలు మన మీద కాదు...
సమయం అనే అద్దం మీద ఉంటాయి.
ఆ డర్టీ మిర్రర్ మీద కనిపించే కమిలిన గుర్తులు తుడిచేస్తే పోవా? పోతాయి.

 

సోఫాలో అత్తగారి పక్కనే కూర్చుంది శైలజ. భర్త విశ్వ వచ్చి ఆమె పక్కన కూర్చోగానే దిగ్గున లేచి వెళ్లి కుర్చీ వెనకాల నిలబడింది. విశ్వ మొహం ఎర్రబడింది. అసహనంగా కదిలాడు. తల్లివైపు తిరిగి ‘‘నాకు విడాకులు కావాలి! అందుకే మిమ్మల్ని పిలిచాను’’ అన్నాడు.నిర్ఘాంతపోయారు ఇరువైపు పెద్దలు. మౌనంగా ఉన్న శైలజను చూస్తూ తల్లి అలివేలు ‘‘ఏం మాట్లాడవేంటే, ఏమైంది?’’ ఆదుర్దాగా అంది .   ‘‘అమ్మాయి బాగుందని, ముచ్చటపడితేనే కదరా ఈ పెళ్లి చేసింది. ఇప్పుడు వద్దు, విడిపోతానంటే ఏంటర్ధం?’’ విసుగ్గా కొడుకును మందలించింది పుణ్యవతి. శైలజ, విశ్వల పెళ్లై ఆరునెలలవుతోంది. పెళ్లికి వచ్చిన వారంతా జంట బాగుందని ఎంతో మెచ్చుకున్నారు. అంతలోనే విడాకులు కావాలంటూ విశ్వ గొడవ. ‘‘లేదమ్మా! ఒక కప్పు కింద పరాయివాళ్లలా ఏళ్లకు ఏళ్లు ఉండటం సాధ్యం కాదు. విడిపోవడమే మేలు’’ మాట్లాడేదేమీ లేనట్టుగా అక్కణ్ణుంచి వెళ్లిపోయాడు విశ్వ.  శైలజ మౌనంగా తన గదివైపు వెళ్లింది.పెద్దలు ముఖముఖాలు చూసుకున్నారు.

విడాకులు తప్పవా?!
శైలజ, విశ్వ చెరో గదిలో ఉండటం గమనించింది అలివేలు. ‘‘శైలూ...’’ గదిలో పడుకుని పైకప్పు కేసి చూస్తూ ఉన్న శైలజ తల్లి మాటలకు ఉలిక్కిపడి ఏంటన్నట్టు చూసింది. ‘‘ఏంటే ఇది.. నీ వెనుక చెల్లీ, తమ్ముడు ఉన్నారని మరిచిపోయావా? విడాకులు తీసుకుని పుట్టింటికి వస్తే నలుగురూ ఏమనుకుంటారు? చెల్లికి పెళ్లి అవుతుందా?! అయినా ఏమైందే?! సొంత ఇల్లు, ఇంటినిండా సామాను. బీరువా నిండా చీరలు, నగలు. పైగా పల్లెత్తు మాట అనడు అల్లుడు. ఇంతకన్నా ఏం కావాలే! ఈ విడాకుల గొడవేంటి’’ తల్లి మాటలకు మౌనంగా ఉంది శైలజ.‘‘నువ్వు మాట్లాడవే! చిన్నప్పటి నుంచీ ఇంతేగా! నీకు పిచ్చి పట్టింది. ఏదడిగినా మౌనంగా ఉంటావు. నీకొచ్చిన కష్టమేంటో చెప్పకపోతే .. మాకు మాత్రం ఏం తెలుస్తుంది? అయినా నిన్ను గారాబం చేసి చెడగొట్టాడే మీ నాన్న. అదే ఇప్పుడు నా తలమీదకొచ్చింది. విడాకులిస్తే ఇంకెక్కడికైనా పో.. మా ఇంటికి మాత్రం రాకు...’’ అంటూ విసురుగా వెళుతున్న వైపే చూస్తూ ఉండిపోయింది శైలజ.

మరణమే సమాధానమా!
ఆసుపత్రి బెడ్ మీద చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది శైలజ. విశ్వ ఫోన్ చేసి చెప్పడంతో తలీతండ్రి, అత్తామామ వచ్చారు.  ‘‘విషం తాగింది..’’ చెప్పాడు విశ్వ. కూతురి ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళనగా అడిగారు తల్లీతండ్రి. వారి చేతికి శైలజ రాసిన ఉత్తరం ఇచ్చి, అక్కడ నుంచి మౌనంగా వెళ్లిపోయాడు విశ్వ.శైలజ ఆత్మహత్య ప్రయత్నం చేయడానికి ముందు రాసిన ఉత్తరం అది...

‘‘అమ్మా! విడాకులు తీసుకొని నీ దగ్గరకు వస్తే మీ పరువు పోతుంది. అలాగని ఇక్కడే ఉంటే ప్రతీ రోజూ నా ప్రాణంపోయినంత పనౌతూవుంది. ఇందులో విశ్వ తప్పేమీ లేదు. నాకు అసలు పెళ్లంటేనే ఇష్టం లేదని ముందే చెబితే.. అప్పుడు నువ్వే మాత్రం ఒప్పుకోలేదు. పైగా చచ్చిపోతానని బెదిరించి నా నోరు కట్టేశావు. తల్లిదండ్రులుగా మీ బాధను చూడలేక ఈ పెళ్లికి ఒప్పుకున్నా! కానీ, విశ్వను నేను అంగీకరించలేకపోతున్నా! అతన్ని చూస్తేనే నాకు భయం వేస్తోంది. నా మీద చెయ్యి వేస్తే ఒళ్లంతా గొంగళి పురుగులు పాకినట్టుగా ఉంది. నా శరీరం మీద నాకు అసహ్యం కలుగుతోంది. అమ్మా, ఇదంతా నీకు చెప్పాలని, నీ ఒళ్లో తలపెట్టుకొని ఏడ్వాలని ఉంది. కానీ, నువ్వా అవకాశాన్ని నాకెప్పుడూ ఇవ్వలేదు. అందుకే నీకే అవకాశాన్ని ఇచ్చి వెళ్లిపోతున్నాను.. బై!’’. ఉత్తరం చదివిన అలిమేలు మంగ ఏడుస్తూనే ఉంది. ‘నా కూతురుని బతికించు దేవుడా!’ అని దేవుళ్లకు మొక్కుంది.  రెండు రోజుల తర్వాత శైలజకు ప్రమాదం తప్పిందని చెప్పారు డాక్టర్లు.

కొత్త జన్మ
శైలజ కౌన్సెలర్ ఎదురుగా ఉంది. తను చనిపోకుండా ఎందుకు బతికానా అని ఏడుస్తూ ఉంది.  కౌన్సెలర్ ఆమె మాటలను శాంతంగా విన్నాడు.  ‘‘శైలజా, ఇది మీకు కొత్త జన్మగా భావించండి. మీరు ఆత్మహత్య వైపుగా ఎందుకు మొగ్గుచూపారో.. అక్కడ నుంచే మీ ప్రయాణాన్ని మొదలుపెడితే సమస్య తగ్గే అవకాశం ఉంది. అందుకు గతం తాలూకు చేదును వెలికి తీసి, మీ మనసుకు సాంత్వన చేకూర్చే ఈ థెరపీ మీకెంతో మేలు చేస్తుంది..’ అన్నారు కౌన్సెలర్. శైలజ తల్లి, తండ్రి అక్కడే ఉన్నారు. కూతురు జీవితం బాగయ్యే మార్గం వెతుకుతున్నప్పుడు దొరికిన ఆలంబన ‘ఫాస్ట్‌లైఫ్ రిగ్రెషన్ థెరపీ.’ మానసిక స్వస్థతను కలిగించే ఈ థెరపీ తమను తాము అర్థం చేసుకుంటూ సమస్యలకు పరిష్కారం దొరికేలా చేస్తుందని తెలుసుకుని ఈ థెరపీకి శైలజను తీసుకువచ్చారు.

టైమ్ మిషన్!
శైలజకు థెరపీ ఇవ్వడం మొదలైంది. నిపుణులు చెప్పిన విధంగా ధ్యానముద్రలో కళ్లుమూసుకున్న శైలజ తన కళ్ల ముందు ఎలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయో..  దర్శించడం మొదలుపెట్టింది. కౌన్సెలర్  తన సూచనలను కొనసాగిస్తూ..‘‘శైలజా మీకు ఇప్పుడు పాతికేళ్లు. ఈ వయసు నుంచి 15 ఏళ్ల మధ్యలోకి ధ్యానం ద్వారా టైమ్ మిషన్‌లో ప్రయాణిస్తున్నట్టుగా వెళతారు. ఈ మధ్యలో మిమ్మల్ని కుదిపేసిన విషయాల మీద దృష్టి నిలపండి. అక్కడ మీరు ఏం సందర్శిస్తున్నారో.. ఆ విషయాలను మాకు చెప్పండి’’ అన్నారు.

 
కాసేపటికి శైలజ మళ్లీ మాట్లాడం మొదలుపెట్టింది. ‘‘పదో తరగతిలో ర్యాంకు రాలేదు. అమ్మకు కోపం వచ్చింది. నాన్న బాధ పడుతున్నారు.. అప్పటి విషయాల గురించి చెబుతోంది శైలజ. కాసేపటికి, కౌన్సెలర్ సూచనలు మళ్లీ మొదలయ్యాయి.

ఎనిమిదేళ్ల వయసులో...
‘‘మీరు ఇంకా వెనక్కి అంటే... 15 నుంచి 5 ఏళ్ల మధ్య మీ వయసు ఉందని భావించండి. ఈ పదేళ్లలో ఏం జరిగిందో మీ మనోనేత్రంతో దర్శిస్తూ చెప్పండి’’.  కౌన్సెలర్ చెబుతున్న సూచనలతో శైలజకు అందుతున్నాయి. కాసేపటికి.. శైలజ ‘‘నా వయసు 8 ఏళ్లు..’ అంటూ ఆగిపోయింది. ఆమె కళ్ల నుంచి ధారగా నీళ్లు చెక్కిళ్ల మీదకు చేరుతున్నాయి. నిలువెల్లా వణికిపోతోంది... ‘అమ్మా, అమ్మా..!’ అని అరుస్తోంది. ‘వద్దు.. ప్లీజ్ అంకుల్.. నన్నేమీ చేయద్దు. వదిలేయండి...’ అంటూ వేడుకుంటోంది. ‘‘ఏం జరిగింది, ఎందుకు బాధపడుతున్నావు..’’ అడిగారు కౌన్సెలర్.

‘‘మా ఇంటి ఎదురుగా ఉండే అంకుల్. మంచివాడు కాదు. ఆంటీ లేదు. అమ్మ నన్ను అంకుల్‌కి స్వీట్లు ఇచ్చి రమ్మంటే వెళ్లాను. అక్కడ.. ఆ అంకుల్ నన్ను డర్టీగా పట్టుకున్నాడు. నా ఒళ్లంతా తడిమాడు. నేను పారిపోయి వచ్చేశాను’’ అని చెప్పుకుంటూ పోతోంది. కూతురు అవస్థ చూస్తున్న అలిమేలు మంగ కళ్లలో నీళ్లు ఆగడం లేదు. ఎనిమిదేళ్ల వయసులో ఎదురింటి వాళ్ల గురించి శైలజ చెప్పిన విషయం ఆమెకు గుర్తుకువ చ్చింది.

కడిగేసుకున్న మురికి
శైలజ ఇంకా చెబుతోంది..‘‘అమ్మకు చెబుదామని పరిగెత్తుకువచ్చాను. కానీ, భయమేసింది. బాగా జ్వరం. ఓ రోజు అమ్మతో ‘ఆ అంకుల్ మంచివాడు కాదమ్మా!’ అంటే.. నన్నే తిట్టింది. ‘నాన్నకు హెల్త్ ప్రాబ్లమ్ వస్తే.. ఆ అంకుల్, ఆంటీలే ఆసుపత్రికి వచ్చి ఎంత సాయంగా ఉన్నారు. అలాంటి వారిని పట్టుకొని మంచివాడు కాదంటావా?’ అని కసిరింది. దాంతో ఏమీ చెప్పలేకపోయాను. నేను స్కూల్‌కెళుతుంటే ఆ అంకుల్ నన్ను చూసి నవ్వాడు. నాకు  వణుకు పుట్టింది. నాకు మగవాళ్లంటేనే భయం మొదలైంది. ఆ అంకుల్‌ని  చంపేయాలి’’ శైలజ ఏడుస్తూనే చెబుతోంది. ఆమెలో దుఃఖం తగ్గాక ‘‘దీనికి, ప్రస్తుత మీ జీవితానికి ఏదైనా సంబంధం ఉందా?’ అని కౌన్సెలర్ అనగానే.. ‘ఉంది. నేను మలినమయ్యాను. విశ్వ మంచివాడు. కానీ, అతణ్ణి చూస్తేనే భయమేస్తోంది’’ అంటూ ఏడుస్తూనే ఉంది శైలజ.

ఆమె దుఃఖం తీరేంతవరకు ఆగిన కౌన్సెలర్... ‘మీ  ఎనిమిదేళ్ల వయసులో జరిగిన చర్యను ఇప్పడు క్షమాపూర్వకంగా చూడండి. మిమ్మల్ని బాధించిన ఆ వ్యక్తిని క్షమించే ప్రయత్నం చేయండి. అప్పటి మీ అంతఃచేతనకు ఏ భయ మూ లేదని నచ్చచెప్పండి..’ సూచనలు ఇస్తున్నారు. అలా అవి ఆమె సమస్య ప్రక్షాళనకు ఉపయోగపడ్డాయి. తన పట్ల నీచంగా ప్రవర్తించిన వ్యక్తిని క్షమించగలిగింది.

అక్కణ్ణుంచి తెరిపిన పడిన మనసుతో మెల్లగా కళ్లు తెరిచింది. ఎదురుగా... తల్లి, తండ్రి. చిన్నవయసులో కూతురుకు ఎదురైన సమస్యను ఇన్నేళ్లకు గానీ అర్థం చేసుకోలేకపోయింది అలివేలు.  మనస్ఫూర్తిగా తనను క్షమించమని కూతురుని కోరింది. తల్లిని హత్తుకుపోయి తన వేదనంతా మరిచిపోయింది శైలజ.  శైలజ నవ్వుతోంది. చాలా ఆనందంగా..  తన భర్తతో కూర్చొని కులాసాగా కబుర్లు చెబుతోంది. తమ ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు, అత్తమామలకు అతిథి మర్యాదలు చేస్తున్న ఆమెను సంతోషంగా చూస్తూ ఉండిపోయారు కుటుంబ సభ్యులంతా.

నమ్మకం ముఖ్యం
బాల్యదశలో పిల్లల మెదళ్లలో చేరే భయం తాలూకు ‘బ్లాక్స్’ను తొలగించకపోతే అవి వారి జీవి తంపై చెడు ప్రభావాలు చూపు తాయి.  శైలజ విషయంలో అదే జరిగింది. తల్లి తన బాధను చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం నుంచి గతానికి ప్రయాణించడం, తనలో ఉన్న అంతర్‌శిశువుకి నచ్చజెప్పడంతో తిరిగి తన మనసును సవరించుకుంది. భర్తను అంగీకరించగలిగింది. దీంతో ఆమె తర్వాతి జీవితం ఆనందకరంగా సాగింది.

డాక్టర్ న్యూటన్ కొండవీటి,  లైఫ్ రీసెర్చ్ అకాడమీ, హైదరాబాద్

 

తండ్రి అసహజ ప్రవర్తన
హిట్లర్ బాల్యంలో ఎన్నో సృజనాత్మక పనులవైపు మొగ్గు చూపేవాడు. తల్లితో స్నేహంగా, సున్నితమైన హృదయం గలవాడుగా ఉండేవాడు. తండ్రి తన మాటే వినాలని అతనిని తరచూ కొట్టేవాడు. దీంతో హిట్లర్ మనసులో ఒక సంఘర్షణ. ‘నా తండ్రి నన్ను కొట్టినప్పుడు ఇంక ఏడ్వకూడద’ని ఓ రోజు నిర్ణయించుకున్నాడు. తండ్రిపై తిరుగుబాటు చేశాడు. అతనితోపాటే పెరిగిన ద్వేషంతో నియంతగా మారాడు. మానవజాతి మొత్తం వ్యతిరేకించే ఏకైక వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోయాడు.

- నిర్మల చిల్కమర్రి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement