
మీరు కరెక్ట్‌గానే చదివారు! గోళ్లు కుట్టించుకుంటారా అని!? ‘దిమాగ్ గిట్ల కరాబయ్యిందా ఏంటి? అసలూ.. ఎవరైనా గోళ్లు కుట్టించుకుంటారా?’ అంటూ కోపం తెచ్చుకోవద్దండి!! ఇది నెయిల్ ఆర్ట్‌లో లేటెస్ట్ ట్రెండ్! చెవులు, ముక్కు కుట్టించుకున్నట్లే.. గోళ్లు కుట్టించుకుని (హోల్ పెట్టించుకుని).. ఇదిగో ఈ చిత్రంలో ఉన్నట్లుగా మెరిపించుకోవచ్చు. గోళ్లతోనే డిస్కో డాన్స్ చేయించొచ్చు. నిజానికి ఈ రోజుల్లో నెయిల్ ఆర్ట్‌కి ఫాలోవర్స్ చాలా ఎక్కువ. గోళ్లను పొడవుగా పెంచుకుని.. కొమ్మలు రెమ్మలు, పక్షులు, చేపలు ఇలా ఎన్నో అద్భుతాలను నెయిల్ ఆర్ట్‌లుగా డిజైన్ చేసుకోవడం... ఆ ఆర్ట్‌కు అక్కడక్కడా మెరుపుకోసం కుందమ్స్ అతికించుకోవడం ఎప్పటి నుంచో నడుస్తున్న ట్రెండ్.
కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. నాజూగ్గా, పొడవుగా పెరిగిన గోళ్లను మెరిసే స్టడ్స్‌తో మరింత మెరిపించుకోవడమే ఇప్పటి ట్రెండ్. అందుకే మరి, నాజూకైన గోళ్లకు మెరుపుల స్టడ్స్ పెట్టుకుని కిరాక్ బాట పడుతోంది ఊత్. Eunkyung అనే దక్షిణ కొరియా యువ కళాకారిణి పరిచయం చేసిన ‘లెడ్ డిస్కో నెయిల్’ ఇప్పుడు మనదేశంలోనూ చాలామందిని ఆకట్టుకుంటోంది. ఈ స్టడ్స్‌ని అన్ని నెయిల్స్‌కి అటాచ్ చేసుకుని చీకట్లో ‘బూమ్ బూమ్ షకలక’ అంటూ.. డిస్కో లైట్స్ మాదిరిగా తళుక్కుమనిపించొచ్చు. ఇంతకీ ఈ మెరుపుకు కారణం ఏంటంటే.. విద్యుత్ దీపంలో ఉపయోగించే లెడ్‌ను స్టడ్స్‌లో వాడటంతో పాటు అది వెలిగేందుకు చిన్న బ్యాటరీ కూడా గోరు వెనుక భాగంలో అటాచ్ చెయ్యడం వల్ల చీకట్లో మెరుస్తుంది.
– సంహిత
Comments
Please login to add a commentAdd a comment