టూ స్టోరీస్ | Discriminat against womans | Sakshi
Sakshi News home page

టూ స్టోరీస్

Published Sat, Feb 24 2018 11:56 PM | Last Updated on Thu, Jul 11 2019 9:16 PM

Discriminat against womans  - Sakshi

ఆకాశం కథొకటి. భూమి కథొకటి. అంటే.. ఒకరి కథలో ఆకాశం.. ఇంకొకరి కథలో భూమీ.. ఉన్నాయని కాదు. అలాగని లేవనీ కాదు! ఆకాశమూ భూమీ పుట్టినప్పటి నుండి ఉన్న కథలని. అన్ని కథలని! లైంగిక వేధింపులతో మన అమ్మాయిలకు... అన్ని వేధింపులని!!

‘జీవితంలో ఎదుగుతూనే నన్ను నేను కాపాడుకోవాలి. నాపై విసిరే అనేకానేక వలల్లో చిక్కుకోకుండా జాగ్రత్త పడాలి. సినీరంగంలో ఇదో పెద్ద సవాల్‌ నాకు’ అంటున్నారు గీత రచయిత్రి శ్రేష్ఠ. 2012లో సినీ సీమలోకి అడుగుబెట్టి పదిహేను సినిమాలకు పాటలు రాసిన ఈ మంచిర్యాల యువతి మొదటి నుంచి లైంగిక, మానసిక వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ‘సమాజం.. కుటుంబం.. మగాడు ఎంత చెత్తగా ప్రవర్తించినా అతణ్ణి గౌరవిస్తాయి. ఆడపిల్ల విషయంలో మాత్రం చిన్న మచ్చ కూడా ఉండకూడదంటాయి. స్త్రీల పట్ల మన దృష్టికోణం మారాలి’ అంటున్న శ్రేష్ఠ వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.

‘ఒక రొమాంటిక్‌ క్రైమ్‌ కథ’ శ్రేష్ఠ తొలి సినిమా. 2016లో విడుదలైన ‘పెళ్లిచూపులు’ సినిమా మంచి బ్రేక్‌ ఇచ్చింది. ‘ఆ సినిమా హిట్‌ కావడంతో ‘అర్జున్‌రెడ్డి’లో అవకాశం వచ్చింది. తర్వాత ‘హలో’ ‘యుద్ధం శరణం’ సినిమాలకు పాటలు రాశాను. ‘అర్జున్‌రెడ్డి’కి రాసిన ‘మధురమే ఈ క్షణమే చెలీ’ పాటకు జీ గోల్డెన్‌ అవార్డు రావడం సంతోషంగా అనిపించింది. ‘యుద్ధం శరణం’ పాటలకూ మంచి అప్లాజ్‌ వచ్చింది. వేధింపు వ్యధల మధ్య నలిగిపోయిన నాకు ఈ విజయాలు కొంత శక్తినిచ్చాయి’ అంటున్న శ్రేష్ఠ చేతిలో ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టులున్నాయి.

చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం.  సినిమా పాటలు రాయాలనేది నా కోరిక. గీత రచనపై పట్టు సాధించేందుకు పుస్తకాలు చదివేదాన్ని. పాటలు బాగా వినేదాన్ని.  కొన్ని పాటలు రాసుకున్నాక.. అవి బాగా వచ్చాయనే నమ్మకం కలిగాక.. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాను. ఓ  నిర్మాతను కలసి చాన్స్‌ ఇవ్వమని అడిగాను. ‘నువ్వే మాకు ఒక చాన్స్‌ ఇవ్వు’ అని బదులిచ్చాడు ఆయన. ఇలా వెళ్లిన ప్రతిచోటా ఎన్నో చేదు అనుభవాలు. అవమానాలు. ‘నీకు అవకాశమిస్తే మాకేంటి లాభం! నీ కంటే ఎంతోమంది గొప్ప రచయితలున్నారు. వాళ్లతో రాయించుకుంటాం’ అని కూడా అన్నారు.

మొండిగా ముందుకు...
 2013లో నా చేతిలోంచి చాలా ప్రాజెక్టులు జారిపోయాయి. నా తిరస్కారంతో ఇగో దెబ్బ తిన్నవాళ్లు కొందరు, నాతో మర్యాదగా మాట్లాడిన వాళ్లని ఇన్‌ఫ్లుయన్స్‌ చేసి, అవకాశాలు రాకుండా చేశారు. ఈ కారణంగా బతుకు మీదే విరక్తి పుట్టింది. ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. సైలెంట్‌గా ఉంటే ఎక్కడైనా∙సంబంధాలు బాగుంటాయి. కానీ అలా ఉండకూడదనుకున్నాను.  గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నాను. మొండితనంతో ముందుకు సాగాను. ఎప్పుడూ భయపడలేదు. కానీ నీరసం వచ్చింది. ఓపిక లేనట్టు అన్పించింది. నా బాధను ఎవ్వరితోనూ పంచుకోలేకపోయాను.

మన సమాజం – కుటుంబం బాధితురాలినే తప్పుబట్టి, ఆమె మాటలకు తప్పుడు వ్యాఖ్యలు జోడించి ప్రచారం చేస్తాయి. అబ్బాయిలకీ ఇబ్బందులు ఉంటాయి కదా అంటారు కొందరు. నిజమే, కానీ సక్సెస్‌ వచ్చేవరకే వాళ్లు ఇబ్బందిపడతారు. ఆ తరవాత వారికి రెడ్‌ కార్పెట్‌ పరుస్తారు. అమ్మాయిలు ‘ప్రిపేర్డ్‌’గా వస్తారనుకుంటారు పరిశ్రమలో చాలామంది. అందుకే మొదటి అవకాశం అందుకోవడానికి టైమ్‌ పట్టింది. కొందరు పది పదిహేనేళ్ల వరకూ ఎదురుచూడాల్సివస్తుంది. ఈ లోపు ఉత్సాహం సన్నగిల్లుతుంది. ఇక సినిమాలు వదిలేద్దాంలే అనిపిస్తుంది.

మహిళా దర్శకురాలే వల విసిరింది
అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న రోజుల్లో ఒక మహిళా దర్శకురాలు పరిచయం అయ్యింది. ఆవిడని అక్కా అని పిలిచేదాన్ని. కాస్త సన్నిహితంగా మెలిగేదాన్ని. ఒకరోజు ఫోన్‌ చేసి, ‘న్యూ ఇయర్‌ పార్టీకి వస్తావా’ అని అడిగింది.  ఆసక్తి లేదని చెప్పాను. ఒక అబ్బాయి ప్రపోజ్‌ చేస్తున్నాడని, పార్టీకి వస్తే ఇద్దరూ కలవొచ్చని చెప్పింది. ‘నన్ను ఎందరో ఇష్టపడుతుంటారు. నేను ఎందరినో కాదంటాను. నాకు ఇష్టం లేనప్పుడు మీరు ఎలా లీడ్‌ తీసుకుంటారు? నేను వద్దంటే ఎందుకు ఒత్తిడి చేస్తారు?’ అని ఆ దర్శకురాలిని ప్రశ్నించాను. ఆమె ఇబ్బంది పెట్టడంతో తనతో కలసి చేద్దామనుకున్న ప్రాజెక్టును వదిలేసుకున్నాను.

ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కాలేదు. ఈ ఆలోచనల నుంచి బయటపడకముందే ఫోనొచ్చింది. అవతలి వాడి మాటలు అసభ్యంగా ఉన్నాయి. ‘ఆవిడ నిన్ను ఆఫర్‌ చేసింది. నువ్వు కాదంటావేమిటి’ అంటూ పిచ్చిపిచ్చిగా వాగాడు. నాకు కోపం ఆగలేదు. ‘ఎవడ్రా నువ్వు’ అని గట్టిగా అరుస్తూ  కాల్‌ కట్‌ చేశాను. ఇది జరిగి నాలుగు సంవత్సరాలైంది. ఈ రంగంలో అమ్మాయిల్ని నమ్మడం కూడా కష్టమవుతోంది. వాళ్లతో స్నేహం చేసే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది. పురుషుల దురుద్దేశాన్ని తొందరగా పసిగట్టవచ్చు. కానీ స్త్రీల విషయంలో అది కష్టమవుతోంది.

‘నీ దగ్గర ఏముందని ఇంత పొగరు? నన్నే కాదంటావా? నువ్వు నా గ్రిప్‌లో ఉండాలి. లేదంటే నీకు కెరీర్‌ లేకుండా చేస్తా’ అన్నాడు ఓ దర్శకుడు. ఇలాంటి అనేకానేక చేదు అనుభవాల కారణంగా పురుష సమాజం మీదే జుగుప్స కలుగుతోంది. సాధారణంగా ధనవంతుల కుటుంబాల్లో పుట్టిన వారికి లేదా వెన్నుదన్నులు ఉన్న వారికి సినీ పరిశ్రమలో అంతగా ఇబ్బందులు ఉండవు. ఏ పరిచయాలూ
లేని నాబోటి మధ్యతరగతి వాళ్లది మాత్రం ముళ్లదారే! ఆ దారిలో నన్ను నేను కాపాడుకుంటూ ముందుకు సాగే క్రమంలో కనీసం పది సినిమాలు వదులుకున్నాను.

మంచి వాళ్లూ ఉన్నారు..
2016లో పెళ్లిచూపులు చిత్రం రచయిత్రిగా నన్ను నిలబెట్టింది. నాకు పేరు తీసుకొచ్చింది. అక్కడ ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయోనని భయపడ్డాను. వాళ్లకు నా భయాలు – చేదు అనుభవాలు  వివరించాను. ‘అందరూ ఒకేలా ఉండరు. ఇక్కడ మీకు ఎలాంటిæ భయమూ ఉండదు’ అని హామీ ఇచ్చారు వాళ్లు. ‘పెళ్లిచూపులు’ సినిమా ఇండస్ట్రీలో ఇక ముందుకు సాగవచ్చనే నమ్మకం ఇచ్చింది.  మరో మూడు సినిమాల్లో పాటలు రాసే అవకాశం అందించింది.  సినీసీమలో ‘చాన్స్‌ ఇస్తావా’ అని అడిగే వాళ్లతో పాటు స్త్రీని గౌరవించే వారూ తారసపడ్డారు. పెళ్లిచూపులు సినిమా తర్వాత మురికి మాటలు తగ్గాయి. నాకు గాలమేయాలని చూసిన ‘పెద్దలు’ ఇప్పుడు డౌన్‌లో ఉన్నారు. నేను వాళ్ల కంటే మెరుగ్గా ఉన్నాను. ఇది ఒకింత సంతోషపరిచే విషయం నాకు.

ఇటీవల ఓ టీవీ చానల్‌ నన్ను ఇంటర్వ్యూ చేసింది. ‘ఆమెను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు’అంటూ ఆ చానల్‌ ఆఫీసుకు ఫోన్లు వెళ్లాయి. ఇంటర్వ్యూ ప్రసారం కాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. కాల్‌ చేసింది ఓ మహిళేనట! ఈ విషయం తెలిసిన ఆ చానల్‌ ఉద్యోగులు నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ‘పెళ్లిచూపులు’ తర్వాత నా చేదు అనుభవాల్ని మీడియాతో పంచుకున్నాను. ఈ కారణంగా వేధింపులు తగ్గాయి. ‘సాక్షి’ ద్వారా నేను చెప్పగలిగింది ఒకటే. ఇలాంటి తోడేళ్లు ప్రతి చోటా ఉంటాయి. అప్రమత్తంగా ఉంటూ ముందుకు సాగాల్సిందే. సమస్యలు ఎదురైతే గొంతు విప్పాల్సిందే. నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టాల్సిందే.  – హృదయ


మంచం కింద, తలగడ కింద, వంట గదిలో, ఫ్రిడ్జ్ కింద... అన్ని చోట్లా కత్తులు ఉంచుకుంది ఫిదా ఫేమ్‌ గాయత్రి గుప్తా. ఎవరినీ చంపడానికి కాదు, తనను తాను రక్షించుకోవడం కోసమే ఈ ఏర్పాటంతా. ఆమె ఒంటరిగా జీవిస్తోంది. ఏక్షణమైనా ఏదైనా జరుగుతుందేమోనని ఆమెకు భయం. సినీ పరిశ్రమలో కొందరు తనను లైంగికంగా వేధించారని ఇటీవల మీడియా ముందు గొంతు విప్పింది గాయత్రి గుప్తా. నేను షార్ట్‌ఫిల్మ్స్, ఫీచర్‌ ఫిల్మ్స్‌లో నటించాను. పాటలు పాడతాను, కథలు రాస్తాను. ఒక సినిమా షూటింగ్‌లో నేను లైంగిక వేధింపులకు గురయ్యాను.

అందుకే మీడియా ముందుకు వచ్చి నా గొంతు వినిపిస్తున్నాను. చాలామంది ఆడవాళ్లు దుస్తులు సరిగా వేసుకుంటే వారి మీద లైంగిక దాడులకు అవకాశముండదు, ఒంటి నిండా బట్టలు కట్టుకోవాలి అంటున్నారు. భారత కాలంలో ద్రౌపది దుస్తులు సరిగా వేసుకోలేదనే ఆమె మీద దుశ్శాసనుడు, కీచకుడు, సైంధవుడు అత్యాచారం చేయబోయారా. మన వస్త్రధారణ మీద పాశ్చాత్య ప్రభావం ఎక్కువగా ఉంది. ‘ఆడవాళ్లు ఏం వేసుకోవాలి’ అనేది ఇంకా మగవారు నిర్ణయించక్కర్లేదు. నాకు అనువుగా ఉన్న బట్టలు వేసుకునే హక్కు నాకు ఉంది.

కారులో దింపుతూ మిస్‌బిహేవ్‌ చేశారు..
నేను ఒక చిత్రం ఒప్పుకున్న సందర్భంలో, ‘‘ఇక్కడి వాతావరణం బాగుంటుందా’’ అని నేరుగా అడిగాను.  ‘‘అంతా బాగుంటుంది, మీకు ఇబ్బంది ఏమీ ఉండదు’’ అని సమాధానం చెప్పారు వారు. నిజమని నమ్మాను. సినిమా షూటింగ్‌ మొదలవ్వకుండానే, వారు నాతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు.  ఎక్కడికక్కడ నేను జాగ్రత్తగా నన్ను రక్షించుకుంటూ వచ్చాను. పరిశ్రమలో అన్నీ నాలుగుగోడల మధ్య జరిగిపోతాయి. ఎవ్వరికీ బయటకు తెలియవు. పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లాలన్నా ఆధారాలు కావాలి. ఇటువంటివి విన్నప్పుడే... సినీ పరిశ్రమకు అమ్మాయిల్ని పంపడానికి చాలామంది భయపడుతున్నారు.

ఫిర్యాదు చేయాలంటే ఆధారాలు లేవ్‌!
చాలామంది ‘ఫిలిమ్‌ చాంబర్‌లో ఫిర్యాదు చేశారా’ అని అడుగుతున్నారు. ఫిర్యాదు చేయడం నా ఉద్దేశం కాదు. పరిశ్రమలో పరిస్థితి ఇలా ఉంటుంది అని చెప్పడానికే నేను గొంతు విప్పాను. నాలాగే వేధింపులకు గురైన వారు గొంతు విప్పితేనే వేధించాలనుకునేవారు భయపడతారు. ఇబ్బందులు వచ్చినప్పుడు గట్టిగట్టిగా అరిస్తే, అవతలివారు నోరు మూసుకుని పారిపోతారు. అంతే. నాకు ఏం కావాలో, ఏది సంతోషం ఇస్తుందో నేను ప్లాన్‌ చేసుకుంటాను. ఇంటి నుంచి బయటకు వచ్చిన మూడు నాలుగు సంవత్సరాలు బాగా ఇబ్బంది పడ్డాను. ఆ టైమ్‌లో ఎమోషనల్‌ అయ్యాను కూడా. నేను అందరికీ చెప్పేది ఒక్కటే. తిండి కంటే కూడా ఆత్మ గౌరవం ప్రధానం. ఆ ఆత్మ గౌరవమే మనల్ని కాపాడుతుంది.

అవకాశాలు రాలేదని మీడియా కెక్కానట..
నేను మీడియాలో నా గొంతు వినిపించడాన్ని చాలా మంది విమర్శిస్తున్నారు. ‘ఈ అమ్మాయికి ఆఫర్లు రావట్లేదు కాబట్టి, అటెన్షన్‌ కోసం ఇలా చేస్తోంది’ అంటున్నారు. ఇలా మాట్లాడితే నేను ఏం చేయాలి. అందుకే నా సమస్యను నేనే పరిష్కరించుకుంటున్నాను. రాధికా ఆప్టే తెలుగులోనే కాదు దక్షిణాది సినిమాలు చేయనని గట్టిగా చెప్పేశారు. ‘ఇక్కడ అసలు మనిషిలా చూడట్లేదు’ అని చాలా ఘాటుగానే సినీ పరిశ్రమను విమర్శించారు.

అలాంటిదేం జరగలేదు
నేను చేసిన మొదటి సినిమా ఐస్‌క్రీమ్‌ 2. ‘రామ్‌గోపాల్‌ వర్మతో చేస్తున్నావు, జాగ్రత్త’ అని చాలామంది చెప్పారు. భయం భయంగానే సినిమా షూటింగ్‌కి వెళ్లాను. ఆయన ఏ మాత్రం అసభ్యంగా ప్రవర్తించినా వెంటనే ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టేయాలనుకున్నాను. ఆయనే కాదు, టీమ్‌లో అందరూ ఎంతో మంచిగా ఉన్నారు. వారంతా పని దాహం ఉన్నవారే.

నాకేమీ అక్కర్లేదు...
చాలామంది నన్ను వలలో వేసుకోవడానికి డబ్బు ఆఫర్‌ చేశారు. నాకు ఎవ్వరి డబ్బు అవసరం లేదు. అందునా నీతి తప్పి సంపాదించే డబ్బు అస్సలు అవసరం లేదు. తినడానికి తిండి, ఇల్లు అన్నీ ఉన్నాయి. డబ్బు సంపాదించడం నా జీవిత ధ్యేయం కాదు. నాకు నచ్చి, చేసిన పనికి డబ్బులు వస్తే సంతోషం. నేను రాయగలను, పాడగలను, డైరెక్ట్‌ చేయగలను. ఎవరో నాకు జీవితం ఇవ్వవలసిన అవసరం లేదు. ఇప్పుడు నేనే సొంతంగా సినిమా తీసే ఆలోచనలో ఉన్నాను. – వైజయంతి


అవసరమైతే తిరగబడాలి
వేధింపులకు  సినీరంగం సహా ఏ రంగమూ అతీతం కాదు. ఎవరికి వాళ్లు జాగ్రత్తగా ఉండాల్సిందే. లౌక్యంగానో, మొండిగానో ముందుకు సాగాల్సిందే. అవసరమైతే తిరగబడాలి కూడా. సినిమా రంగంలో అవకాశాల కోసం తమను తాము ఆఫర్‌ చేసుకుంటున్న వారు, తమంతట తాము ‘కమిట్‌’ అవుతున్నట్టు ప్రకటించే వారు కూడా ఉన్నారు. కొందరు తల్లిదండ్రులు పదిహేడు పద్దెనిమిదేళ్ల అమ్మాయిల్ని తీసుకొచ్చి  మా అమ్మాయిని మీకు అప్పజెపుతున్నాం.. మీదే పూచీ.. అన్నట్టు మాట్లాడుతుంటారు.

ఈ కోణాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. శీలం అనేది నైతికతలో ఒక భాగం. అది ప్రధానం అనుకున్నవాళ్లు గట్టిగా నిలబడాలి. ఎదురు తిరగాలి. డబ్బు, అవకాశాలతో లొంగదీసుకోవాలనుకునే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఏ రంగంలోనైనా నీతికోసం నిలబడితే, ఎదురు తిరిగితే గెలుస్తాం. శ్రేష్ఠ ఇందుకు ఒక ఉదాహరణ. సినిమా, మోడలింగ్, ఎంటర్‌టైన్‌మెంట్‌ వంటి రంగాల్లో ఆమెలా నిలబడుతున్న వాళ్లు్ల కొందరున్నారు.  – తమ్మారెడ్డి భరద్వాజ, సినీ దర్శకులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement