‘‘తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ 2018లో సెక్సువల్ హెరాస్‌మెంట్ రెడ్రెసెల్ ప్యానెల్ (లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్)ను ఆరంభించడం జరిగింది. మా దృష్టికి వచ్చిన ఫిర్యాదులను షరిష్కరించాం. పదిహేను రోజుల క్రితం ఓ కేసు మా దృష్టికి వచ్చింది. వారిద్దరి వ్యక్తిగత స్టేట్‌మెంట్స్‌ను తీసుకోవడం జరిగింది. కొన్ని ఆధారాల కోసం ఎదురు చూస్తున్నాం. అలాగే క్రిమినల్ కేసు కూడా నమోదు అయ్యిందన్న విషయం మా దృష్టికి వచ్చింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మా రిపోర్ట్‌ను కూడా సబ్‌మిట్ చేస్తాం’’ అని సెక్రటరీ, కన్వీనర్, నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ అన్నారు.
ఇదిలా ఉంటే... కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ విషయం చర్చనీయాంశమైంది. సినిమా ఇండస్ట్రీలో మహిళల భద్రత గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ వివాదం తేలేవరకూ అతన్ని డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని, అసోసియేషన్ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఫెడరేషన్‌కు చె΄్పాం.
అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై ఇంటర్నల్ రిపోర్ట్ వచ్చాక నిర్ణ యిస్తాం. చాంబర్ కార్యాలయంలో ఓ కంప్లైట్ బాక్స్ ఉంది. ఎవరైనా ఫిర్యాదులు చేయవచ్చు. ఫోన్‌కాల్, మెయిల్, పోస్ట్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఇది ఎప్పట్నుంచో ఉంది. అలాగే ఇండస్ట్రీలో ఉమెన్ సపోర్ట్ టీమ్ కూడా ఉంది. ఈ విషయం కొంతమందికి తెలియకపోవచ్చు. ప్రస్తుత వివాదం ముగిసిపోగానే ఈ టీమ్ గురించి అన్ని అసోసియేషన్‌లకు అవగాహన కల్పిస్తాం’’ అని అన్నారు. లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ చైర్‌పర్సన్ ఝాన్సీ మాట్లాడుతూ– ‘‘శ్రీరెడ్డి ఇష్యూ తర్వాత ఓ కమిటీని ఫామ్ చేశాం. ఇతర ఇండస్ట్రీస్‌లో జరగుతున్న సెక్సువల్ హెరాస్‌మెంట్ ఇక్కడ కూడా జరుగుతోంది.
ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు కొరియోగ్రాఫర్స్ మధ్య నెలకొన్న వివాదం ఇది. మేం ఇద్దరి స్టేట్‌మెంట్స్‌ను రికార్డ్ చేశాం. అయితే ఆమె స్టేట్‌మెంట్ రికార్డు చేసే సమయంలో తెలిసింది... కేసు చాలా సీరియస్ అని. లీగల్ సపోర్ట్ కూడా ఆ అమ్మాయికి అవసరం అని అర్థమైంది. మా పరిధిలో మేం చేయాల్సినది ఆమెకు చేశాం. బాధితురాలిగా చెప్పబడిన అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పట్నుంచే ఇండస్ట్రీలో పని చేస్తోంది. అయితే మైనర్‌గా ఇండస్ట్రీలో ఆమెకు చోటు కల్పించిన విధానం ్రపోటోకాల్ ప్రకారంగానే జరిగిందా? లేదా అనే విషయంపై కూడా ఎంక్వయిరీ జరుగుతోంది. మా ప్రస్తుత గైడ్‌లైన్స్ ప్రకారం 90 రోజుల్లో కేసును పరిష్కరించాలి. కానీ అంతకుముందే ముగించాలని మేం అనుకుంటున్నాం.
ఎంక్వయిరీ తర్వాత మా రిపోర్ట్ చెబుతాం. ఎలాంటి చర్యలు తీసుకుంటామో చెబుతాం. ఇండస్ట్రీలోని వారంతా ఈ ఇష్యూపై బయటకు మాట్లడకపోయినా అంతర్గతంగా చర్చిస్తున్నారు. ఆమెకు సపోర్ట్‌గా ఉంటామని ఓ పెద్ద హీరో తన మేనేజర్‌తో చెప్పించారు. దర్శకులు– నిర్మాతలు స్పందిస్తున్నారు. ఇండస్ట్రీలో టాలెంట్‌కు వర్క్ ఉంటుంది.
ఒకవేళ ఫేక్ కంప్లైట్స్ వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా ప్రత్యేక సెక్షన్ ఉంది. ఇండస్ట్రీలోని మహిళల రక్షణకు సంబంధించి ప్రభుత్వం తరఫు నుంచి సరైన గైడ్‌లైన్స్ లేవు. అలాగే ‘వాయిస్ ఆఫ్ ఉమెన్’ గురించి సమంతగారు సోషల్ మీడియాలో స్పందించారు. కానీ ‘వాయిస్ ఆఫ్ ఉమెన్’ అనేది ఇండస్ట్రీ నుంచి సెపరేట్ కాదు. దీనికి సంబంధించి ప్రభుత్వంతో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. బయటకు రాలేదు అంతే. సరైన సమయంలో పెద్దలు మాట్లాడతారు. అలాగే ఈ కేసుకు సంబంధించి బాధితురాలి ఫేస్‌ను మీడియా బయటపెట్టకూడదని కోరుతున్నాం’’ అని పేర్కొన్నారు.
‘‘2013లో ఆసరా అని పెట్టి, కొన్ని కేసులను పరిష్కరించడం జరిగింది. 2018లో సరికొత్తగా ఈ ప్యానెల్ పెట్టాం. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నాం. కానీ ఇండస్ట్రీలో ఉన్న మహిళలకు ధైర్యం ఇవ్వలేకపోతున్నాం. ఫలానా చోటుకు వచ్చి మీ సమస్యలపై ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామని చెప్పలేకపోతున్నామని నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ తరహా కేసులు లేవని కాదు. జరుగుతున్నవి జరిగినా కానీ, చాలా కేసులు రావడం లేదని నా అభిప్రాయం.
వచ్చినవరకు సాల్వ్ చేస్తున్నాం. సినిమాల్లో తనకు ఏదైనా అన్యాయం జరిగితే సపోర్ట్ చేసేందుకు ఇండస్ట్రీ ఉందనే ధైర్యం అమ్మాయిలకు రావాలి. ఆ ధైర్యం రావాలంటే కమిటీ ఉండాలి. వచ్చిన కేసులను మంచిగా సాల్వ్ చేయాలి. ప్రస్తుత కేసును సాల్వ్ చేయడానికి కొంత సమయం ఉంది. అలాగే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి యూనియన్‌కు ఓ కంప్లైట్ కమిటీ ఉండాలని సూచించాం. అలాగే మాకు కూడా డైరెక్ట్‌గా కంప్లైట్ చేయవచ్చు’’ అని ‘లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్’ అంతర్గత సభ్యులు, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించారు.
చిత్ర పరిశ్రమలో మైనర్లు ఎందుకు పని చేయాల్సి వచ్చిందన్న ప్రశ్నకు నిర్మాత వివేక్ కూచిభొట్ల స్పందిస్తూ– ‘‘చిన్నారులు డ్యాన్స్ చేయాల్సి అవసరం వచ్చినప్పుడు వారి తల్లిదండ్రుల అనుమతి తీసుకుంటాం. మేజర్ అయితే సభ్యత్వం ఇస్తాం’’ అని కమిటీ అంతర్గత సభ్యులు, నిర్మాత వివేక్ కూచిబొట్ల అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది, ‘పీఓఎస్‌హెచ్’ (ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్‌మెంట్) ఎక్స్‌పర్ట్ కావ్య మండవ తదితరులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment